KTR | నేను చెప్పింది తప్పని నిరూపిస్తే.. రాజీనామా చేస్తా
తెలంగాణకు నిధులివ్వకుండా కేంద్రం వివక్ష చూపుతోందని మంత్రి కేటీఆర్ అన్నారు. తెలంగాణ నుంచి కేంద్రానికి అధిక నిధులు వెళ్లాయని చెప్పారు.
మహబూబ్‌నగర్ జిల్లాలో మంత్రి కేటీఆర్ పర్యటించారు. పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. దేవరకద్ర మండలం వెంకపల్లిలో రూ.55 కోట్లతో పేరూరు ఎత్తిపోతల పథకానికి శంకుస్థాపన చేశారు. వర్నె వద్ద ఆర్‌అండ్‌బీ రోడ్డుపై రూ.18 కోట్లతో వంతెన నిర్మాణాన్ని ప్రారంభించారు. భూత్పూర్ మున్సిపాలిటీలో క్రీడా ప్రాంగణ నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడారు. కేంద్రంపై విమర్శలు గుప్పించారు.
'కేంద్రానికి తెలంగాణ 3 లక్షల 65వేల కోట్లు ఇస్తే.. లక్షా 68 వేల కోట్లు మాత్రమే ఇచ్చింది. ఒకవేళ నేను చెప్పింది తప్పని నిరూపిస్తే.. రాజీనామాకు సిద్ధం. పాలమూరులో 8 లక్షల ఎకరాలకు నీళ్లిచ్చిన ఘనత సీఎం కేసీఆర్‌దే. కేసీఆర్ సీఎం అయ్యాకే పాలమూరులో వలసలు తగ్గాయి. మంచి మంచి సంక్షేమ పథకాలతో పేదలకు అండగా కేసీఆర్ సర్కారు ఉంది.' అని కేటీఆర్ అన్నారు.
నియోజకవర్గ అభివృద్ధి కోసం ప్రభుత్వంతో కొట్లాడి ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి నిధులు తీసుకొచ్చారని కేటీఆర్ అన్నారు. దేవరకద్ర నియోజకవర్గంలో వెంకటేశ్వర్‌రెడ్డి 21 చెక్‌డ్యాంలు కట్టించారని పేర్కొన్నారు. కొత్తకోట మున్సిపాలిటీకి త్వరలో రూ.4 కోట్లు మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. కేసీఆర్ సీఎం అయ్యాక తెలంగాణలో ఎన్నో మంచి కార్యక్రమాలకు ప్రారంభించారన్నారు. దేవరకద్రను పురపాలిక కేంద్రంగా ఏర్పాటు చేస్తామని ఈ సందర్భంగా కేటీఆర్ చెప్పారు. పురపాలిక కేంద్రం ఏర్పాటు చేసి నిధులు మంజూరు చేస్తామని స్పష్టం చేశారు.
ఈ ఏడాది నుంచే 2 పడక గదుల ఇళ్ల కోసం డబ్బులిస్తాం. 3 వేల మందికి రూ.3 లక్షలు అందించనున్నాం. పాలమూరు రంగారెడ్డికి ప్రధాని జాతీయ హోదా ఇస్తానన్నారు. 8 ఏళ్లలో దానికి ఒక్కపైసా కూడా దక్కలేదు. వికారాబాద్-కర్ణాటక, గద్వాల-మాచర్లకు రైలు అడిగినా ఇవ్వలేదు. నేను చెప్పింది తప్పైతే నా మంత్రి పదవికి రాజీనామా చేస్తా.
- కేటీఆర్, మంత్రి