Rekha Nayak: కాంగ్రెస్‌లో చేరనున్న ఖానాపూర్ ఎమ్మెల్యే రేఖానాయక్
Rekha Nayak: ఖానాపూర్ బిఆర్‌ఎస్ ఎమ్మెల్యే అజ్మీర రేఖా నాయక్ కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారు. రేఖానాయక్ మళ్లీ పోటీ చేసేందుకు టిక్కెట్ కేటాయించకపోవడంతో ఆమె బిఆర్‌ఎస్‌ను వీడాలని నిర్ణయించుకున్నారు.
Rekha Nayak: వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల జాబితా ప్రకటించిన వెంటనే టిక్కెట్లు దక్కవని తేలిన అభ్యర్థులు పార్టీ ఫిరాయించేందుకు సిద్ధమవుతున్నారు. నిర్మల్ జిల్లా ఖానాపూర్ ఎమ్మెల్యే అజ్మీర రేఖా నాయక్ మంగళవారం ఉదయం కాంగ్రెస్‌లో చేరనున్నారు. రేఖానాయక్ భర్త శ్యామ్ నాయక్ సోమవారమే కాంగ్రెస్ పార్టీలో చేరారు.
పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి శ్యామ్ నాయక్‌కు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. బిఆర్‌ఎస్ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కేసీఆర్ సోమవారం ప్రకటించిన అసెంబ్లీ ఎన్నికల అభ్యర్థుల మొదటి జాబితాలో రేఖా నాయక్ పేరు లేకపోవడంతో ఆమె అసంతృప్తికి గురయ్యారు. పార్టీ మారాలని బిఆర్‌ఎస్ ఎమ్మెల్యే నిర్ణయించుకున్నారు.
రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఖానాపూర్ స్థానం నుంచి పోటీ చేసే అభ్యర్థిగా జాన్సన్ నాయక్‌ను బరిలోకి దింపాలని బిఆర్‌ఎస్ పార్టీ నిర్ణయించింది. ఖానాపూర్ సిట్టింగ్ ఎమ్మెల్యే రేఖానాయక్ స్థానంలో జాన్సన్ నాయక్ టిక్కెట్ దక్కింది. జగిత్యాల జిల్లా మెట్‌పల్లికి చెందిన జాన్సన్ నాయక్ , మంత్రి కేటీఆర్‌తో ఉన్న సాన్నిహిత్యంతో ఖానాపూర్ టిక్కెట్ లభించినట్టు చెబుతున్నారు.
మరోవైపు ఎమ్మెల్యే టిక్కెట్ దక్కకపోవడంతో కాంగ్రెస్ పార్టీ నుంచి ఎన్నికల బరిలో దిగాలని రేఖానాయక్ భావిస్తున్నారు. ఈ దఫా ఆమె అసిఫాబాద్ నుంచి పోటీ చేయాలని భావిస్తున్నారు. రేఖానాయక్ చేరికను కాంగ్రెస్ పార్టీ కూడా స్వాగతిస్తోంది.
అదిలాబాద్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీని నాయకత్వ లేమి వేధిస్తోంది. జిల్లాలో బలమైన నాయకులు లేకపోవడం పార్టీని వేధిస్తోంది. దీంతో పార్టీ మారేందుకు సిద్ధమైన రేఖానాయక్‌ను కాంగ్రెస్ పార్టీ స్వాగతిస్తోంది. అదిలాబాద్‌లో అధికార పార్టీని ఎదుర్కోగలిగిన నాయకత్వం కాంగ్రెస్ పార్టీకి లేదని, రేఖానాయక్ రాక తమకు కలిసొస్తుందని భావిస్తున్నారు. వరుసగా రెండుసార్లు గెలిచిన తనకు మూడోసారి గెలిస్తే మంత్రి పదవి ఇవ్వాల్సి వస్తుందనే టిక్కెట్ నిరాకరించారని రేఖానాయక్ ఆరోపించారు.