JNTU Hyderabad : ఇక ఎంటెక్‌ లేకుండానే పీహెచ్‌డీ అడ్మిషన్.. !-jntu hyderabad key decision on phd programme fro btech students ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Jntu Hyderabad : ఇక ఎంటెక్‌ లేకుండానే పీహెచ్‌డీ అడ్మిషన్.. !

JNTU Hyderabad : ఇక ఎంటెక్‌ లేకుండానే పీహెచ్‌డీ అడ్మిషన్.. !

HT Telugu Desk HT Telugu
Feb 18, 2023 10:20 AM IST

PhD programme for BTech Hons students: పీహెచ్‌డీలోకి ప్రవేశాలపై హైదరాబాద్ జేఎన్టీయూ కీలక నిర్ణయం తీసుకుంది. ఇక నుంచి బీటెక్‌ నుంచే పీహెచ్‌డీలోకి ప్రవేశాలు కల్పించనుంది.

జేఎన్టీయూ కీలక నిర్ణయం
జేఎన్టీయూ కీలక నిర్ణయం (jntuh.ac.in)

PhD programme for BTech Hons Students: ఇంజినీరింగ్ విద్యార్థులను రీసెర్చ్ వైపు మళ్లించే దిశగా అడుగులు వేసింది హైదరాబాద్ జేఎన్టీయూ. ఈ మేరకు పీహెచ్డీ ప్రవేశాల విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది. ఎంటెక్ లేకుండానే పీహెచ్డీ ప్రవేశాలు కల్పించనుంది. అయితే ఇది అందరికీ కాకుండా... కేవలం బీటెక్ ఆనర్స్ పూర్తి చేసిన వారికి మాత్రమే ఈ ఛాన్స్ ఇవ్వనుంది. ఈ మేరకు వర్శిటీ నిర్ణయం తీసుకుంది.

ఎప్పట్నుంచి అమలంటే..?

తాజాగా జేఎన్టీయూ తీసుకున్న నిర్ణయాన్ని వచ్చే విద్యాసంవత్సరం నుంచి అమలు చేయాలని చూస్తోంది. అయితే ఆనర్స్ డిగ్రీ తప్పనిసరిగా అర్హత సాధించాల్సి ఉంటుంది. 160 క్రెడిట్స్‌తో ఇంజినీరింగ్ మరో 18 క్రెడిట్స్‌ను పూర్తిచేస్తే ఆనర్స్‌ డిగ్రీని జారీ చేస్తారు. ఈ ఆనర్స్‌ డిగ్రీ పొందిన వారు ఎంటెక్, ఎంఫిల్‌ వంటి వాటితో సంబంధం లేకుండానే నేరుగా పీహెచ్‌డీలో ప్రవేశాలు కల్పించనున్నారు. నిజానికి పీహెచ్డీ చేయాలంటే ఎంటెక్ తప్పనిసరిగా. కానీ వర్శిటీ తీసుకున్న తాజా నిర్ణయంతో చాలా మంది విద్యార్థులకు లబ్ధి చేకూరనుంది. ఫలితంగా భారీ సంఖ్యలో విద్యార్థులు కూడా రీసెర్చ్ వైపు ఆసక్తి చూపే అవకాశం కూడా ఉండనుంది.

ప్రస్తుతం పీహెచ్డీ అడ్మిషన్ల విషయంలో చేపడుతున్న ప్రక్రియలో పలు మార్పులు తీసుకువచ్చింది వర్శిటీ. అటానమస్ కళాశాలలతో పాటు ప్రైవేట్‌ ఇంజినీరింగ్‌ కాలేజీల్లోనూ పీహెచ్‌డీ చేసే అవకాశం కల్పించేందుకు సిద్ధమైంది. అయితే ఆయా కళాశాల్లో రీసెర్చ్ సెంటర్ ఉండాల్సి ఉంటుంది. తాజా నిర్ణయంతో వర్శిటీ బోధన సిబ్బందిపై ఒత్తిడి తగ్గే అవకాశం ఉంది.

డ్యూయల్ డిగ్రీ...

JNTU Dual Degree Courses: ఇంజినీరింగ్ కళాశాలల్లో డ్యూయల్ డిగ్రీ కోర్సులకు జేఎన్‌టీయూ హైదరాబాద్‌ ఇప్పటికే అనుమతులు మంజూరు చేసిన సంగతి తెలిసిందే. 2022-23 విద్యాసంవత్సరం నుంచి డ్యూయల్ డిగ్రీ కోర్సుల్ని నిర్వహించాలని నిర్ణయించింది. డ్యూయల్ డిగ్రీ పాలసీప్రకారం ఒక్కో కాలేజీకి 60 సీట్లు కేటాయించింది. కనీసం 30 శాతం మంది విద్యార్థులు రిజిస్టర్ చేసుకున్న కళాశాలలకు మాత్రమే డ్యూయల్ డిగ్రీ కోర్సుల నిర్వహణకు అనుమతి లభిస్తుంది. ఇంజినీరింగ్ 2,3,4 ఏడాది చదువుతున్న విద్యార్థులు మాత్రమే రిజిస్టర్ చేసుకోవడానికి అర్హులు. వీరందరూ బీటెక్‌ కోర్సుతో పాటు బీబీఏ డేటా అనలిటిక్స్‌ కోర్సును కూడా చదువుకోవచ్చు. వారంలో రెండురోజులు అంటే శని, ఆదివారాల్లో ప్రత్యక్ష బోధన, మిగతా రోజుల్లో ఆన్‌లైన్ తరగతులు నిర్వహిస్తారు. ఈ కోర్సు ద్వారా విద్యార్ధులకు ఏక కాలంలో ఇంజనీరింగ్, బిజినెస్ మేనేజ్‌మెంట్‌లో నైపుణ్యం లభిస్తుంది. క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌ పరీక్షల్లో మేనేజ్‌మెంట్ నైపుణ్యాలు ఉన్న వారికి మెరుగైన ఉద్యోగాలు లభిస్తాయని భావిస్తు్నారు.

డ్యూయల్ డిగ్రీ కోర్సుల్లో అడ్మిషన్లు పొందిన వారు కనీసం మూడేళ్ల నుంచి గరిష్ఠంగా ఆరేళ్లలో కోర్సు పూర్తి చేయాల్సి ఉంటుంది. ఈలోపు కోర్సు పూర్తి చేయకపోతే అడ్మిషన్ రద్దవుతుంది.

Whats_app_banner