Jangaon Crime : ఏసీబీకి చిక్కిన జనగామ మున్సిపల్ కమిషనర్, మార్టిగేజ్ ల్యాండ్ రిలీజ్ కు లంచం డిమాండ్-jangaon crime in telugu acb raids in municipal office commissioner red handed caught ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Jangaon Crime : ఏసీబీకి చిక్కిన జనగామ మున్సిపల్ కమిషనర్, మార్టిగేజ్ ల్యాండ్ రిలీజ్ కు లంచం డిమాండ్

Jangaon Crime : ఏసీబీకి చిక్కిన జనగామ మున్సిపల్ కమిషనర్, మార్టిగేజ్ ల్యాండ్ రిలీజ్ కు లంచం డిమాండ్

HT Telugu Desk HT Telugu

Jangaon Crime : జనగామలో ఏసీబీ అధికారుల వలకు మున్సిపల్ కమిషనర్ చిక్కారు. మార్టిగేజ్ ల్యాండ్ రిలీజ్ చేసేందుకు లంచం డిమాండ్ చేయడంతో బాధితుడు ఏసీబీని ఆశ్రయించాడు.

జనగామ మున్సిపల్ ఆఫీస్ లో ఏసీబీ రైడ్స్

Jangaon Crime : జనగామ మున్సిపల్ ఆఫీస్ లో ఏసీబీ రైడ్స్ కలకలం రేపాయి. మున్సిపాలిటీకి మార్టిగేజ్ చేసిన ల్యాండ్ ను రిలీజ్ చేసేందుకు ఓ వ్యక్తి నుంచి ఏకంగా కమిషనరే లంచం డిమాండ్ చేయగా.. ఆయన డబ్బులు ఇస్తున్న సమయంలో ఏసీబీ అధికారులు రైడ్ చేసి పట్టుకున్నారు. వరంగల్ ఏసీబీ డీఎస్పీ సాంబయ్య తెలిపిన ప్రకారం పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. జనగామ జిల్లా లింగాల ఘన్ పూర్ కు చెందిన చెట్టిపల్లి రాజు 2022 జూన్ నెలలో జనగామ పట్టణంలో జీ ప్లస్ త్రీ బిల్డింగ్ కు పర్మిషన్ తీసుకున్నారు. పర్మిషన్ తీసుకునే క్రమంలో 10 శాతం భూమిని జనగామ మున్సిపాలిటీకి మార్టిగేజ్ చేసి, ఆఫీస్ నుంచి సర్టిఫికేట్ తీసుకున్నారు. ఆ తరువాత బిల్డింగ్ నిర్మాణ పనులను ఈ ఏడాది సెప్టెంబర్ లో పూర్తి చేశారు. ఇంతవరకు బాగానే ఉండగా.. పనులన్నీ పూర్తి కావడంతో మార్టిగేజ్ చేసిన 10 శాతం ల్యాండ్ ను రిలీజ్ చేసుకునేందుకు రాజు ప్రయత్నాలు చేశారు. కాగా ఆ ల్యాండ్ ను రిలీజ్ చేయడానికి మున్సిపల్ కమిషనర్ జంపాల రజిత సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్ కు హాజరై సంతకం పెట్టాల్సి ఉంది.

మార్టిగేజ్ ల్యాండ్ రిలీజ్ కు లంచం

దీంతో అదే విషయమై చెట్టిపల్లి రాజు పలుమార్లు కమిషనర్ ను సంప్రదించారు. తన మార్టిగేజ్ ల్యాండ్ ను రిలీజ్ చేయాల్సిందిగా వేడుకున్నారు. కానీ ఆమె మాత్రం ఆ విషయాన్ని నాన్చుతూ వచ్చారు. ఫలితంగా రాజు రెండు నెలలుగా ఇబ్బంది పడుతున్నారు. రాజు నుంచి డబ్బులు ఆశించిన కమిషనర్ మార్టిగేజ్ ల్యాండ్ రిలీజ్ చేసేందుకు మొత్తం రూ.50 వేలు లంచంగా డిమాండ్ చేశారు. డబ్బులు ఇవ్వనిదే పని చేసేది లేదని తెగేసి చెప్పారు. దీంతో ఆయన బతిమాలుకోగా చివరకు రూ.40 వేలకు ఒప్పుకున్నారు. ఈ మేరకు అమౌంట్ ను తన డ్రైవర్ అయిన నవీన్ కు అప్పగించాల్సిందిగా సూచించారు.

రూ.40 వేలతో చిక్కిన డ్రైవర్

తన వైపు ఎలాంటి తప్పు లేకుండా లంచం ఎందుకు ఇవ్వాలన్న ఆలోచనతో రాజు కొద్దిరోజుల కిందట వరంగల్ ఏసీబీ డీఎస్పీ సాంబయ్యను ఆశ్రయించారు. దీంతో ఏసీబీ ఆఫీసర్ల సూచన మేరకు రూ.40 వేలను రాజు సోమవారం మధ్యాహ్నం మున్సిపల్ కమిషనర్ జంపాల రజిత డ్రైవర్ అయిన నవీన్ కు అప్పగించేందుకు వచ్చారు. తమ పథకంలో భాగంగా అప్పటికే అక్కడికి చేరుకున్న డీఎస్పీ సాంబయ్య, ఇతర ఆఫీసర్లు రాజు రూ.40 వేలను నవీన్ కు ఇస్తుండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. అనంతరం డబ్బులు సీజ్ చేసి నవీన్ ను విచారించగా ఆయన అసలు విషయాన్ని ఒప్పుకున్నాడు. డ్రైవర్ నవీన్ వాంగ్మూలం తీసుకుని, కమిషనర్ లంచం డిమాండ్ చేసినట్లుగా నిర్ధారించారు. అనంతరం మున్సిపల్ కమిషనర్ రజితతో పాటు డ్రైవర్ నవీన్ ఇద్దరినీ అదుపులోకి తీసుకున్నారు. ఆఫీస్ రికార్డ్స్ స్వాధీనం చేసుకుని విచారణ జరుపుతున్నారు. లంచం డబ్బుతో పట్టుబడిన ఇద్దరినీ మంగళవారం ఏసీబీ కోర్టులో హాజరుపరచనున్నట్టు డీఎస్పీ సాంబయ్య వివరించారు. ఏ పనికైనా ఎవరైనా లంచం డిమాండ్ చేస్తే వెంటనే తమను సంప్రదించాలని ఆయన సూచించారు.

(రిపోర్టింగ్ : హిందుస్థాన్ టైమ్స్ తెలుగు, వరంగల్ ప్రతినిధి)