Jagtial Murder Politics : జగిత్యాల కాంగ్రెస్ లో కలకలం, కార్యకర్త హత్యతో హీటెక్కిన రాజకీయాలు-jagtial congress activist murder political clash erupts between mlc jeevan reddy mla sanjay kumar ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Jagtial Murder Politics : జగిత్యాల కాంగ్రెస్ లో కలకలం, కార్యకర్త హత్యతో హీటెక్కిన రాజకీయాలు

Jagtial Murder Politics : జగిత్యాల కాంగ్రెస్ లో కలకలం, కార్యకర్త హత్యతో హీటెక్కిన రాజకీయాలు

HT Telugu Desk HT Telugu
Oct 23, 2024 06:46 PM IST

Jagtial Murder Politics : జగిత్యాల జిల్లాలో కాంగ్రెస్ కార్యకర్త హత్య తీవ్ర కలకలం రేపుతోంది. తన అనుచరుడి హత్యతో ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి కాంగ్రెస్ అధిష్ఠానంపై మండిపడుతున్నారు. పార్టీ ఫిరాయింపులే ఇందుకు కారణమని ఆయన భావిస్తున్నారు. అనుచరుల ఒత్తిడితో జీవన్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తుంది.

జగిత్యాల కాంగ్రెస్ లో కలకలం, కార్యకర్త హత్యతో హీటెక్కిన రాజకీయాలు
జగిత్యాల కాంగ్రెస్ లో కలకలం, కార్యకర్త హత్యతో హీటెక్కిన రాజకీయాలు

జగిత్యాల జిల్లాలో కాంగ్రెస్ కార్యకర్త హత్య అధికార పార్టీ కాంగ్రెస్ లో కాక పుట్టించింది. పార్టీ శ్రేణులను ఆందోళనకు గురిచేస్తుంది. ముఖ్య అనుచరుడు గంగారెడ్డి హత్యకు గురి కావడంతో ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి పార్టీ అధినేతల తీరుపై రగిలిపోతున్నారు. పార్టీ ఫిరాయింపులను వ్యతిరేకిస్తూ నేతల మధ్య సమన్వయ లోపాన్ని బహిర్గతం చేస్తూ మండిపడుతున్నారు. పార్టీ వద్దు.. పదవులు వద్దనే భావనతో జీవన్ రెడ్డి ఉండగా అందుకు అనుగుణంగా అనుచరులు పావులు కదుపుతున్నారు. అనుచరుల ఒత్తిడితో రెండు మూడు రోజుల్లో జీవన్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి.

జగిత్యాల జిల్లా జాబితాపూర్ మాజీ ఎంపీటీసీ కాంగ్రెస్ సీనియర్ కార్యకర్త గంగారెడ్డి హత్య రాజకీయంగా దుమారం రేపుతుంది. అధికార పార్టీ కాంగ్రెస్ లో అంతర్గత విభేదాలు, గ్రూప్ రాజకీయాలను బహిర్గతం చేస్తుంది. గంగారెడ్డిని వ్యక్తిగత కక్షలతో అదే గ్రామానికి చెందిన బత్తిని సంతోష్ గౌడ్ హత్య చేసినప్పటికీ జగిత్యాలలో గత కొంతకాలంగా రాజకీయంగా నెలకొన్న పరిణామాల నేపథ్యంలో హత్య హాట్ టాపిక్ గా మారింది. మృతుడు గంగారెడ్డి కాంగ్రెస్ సీనియర్ నేత ఎమ్మెల్సీ జీవన్ రెడ్డికి ప్రధాన అనుచరుడు కావడం... హంతకుడు బీఆర్ఎస్ పార్టీలో తిరగడం ప్రస్తుతం బీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన డాక్టర్ సంజయ్ కాంగ్రెస్ లో చేరడం.. హత్య రాజకీయంగా రంగు పులుముకుంటుంది.

కాక పుట్టించిన సంజయ్ చేరిక

జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ ని కనీస సమాచారం లేకుండా కాంగ్రెస్ లో చేర్చుకోవడంతో ఆ పార్టీలో కాక పుట్టించింది. సంజయ్ కాంగ్రెస్ లో చేరినప్పటి నుంచి తీవ్ర ఆవేదనతో ఉన్న జీవన్ రెడ్డిని గంగారెడ్డి హత్య మరింత క్రుంగదీసి మనోవేదనకు గురి చేస్తుంది. ప్రభుత్వ పెద్దలు తీరు, పార్టీ నేతల వైఖరి పట్ల అసహనం వ్యక్తం చేస్తున్నారు. గంగారెడ్డి హత్యతో ఆవేదనతో ఆందోళనకు దిగిన జీవన్ రెడ్డి 40 ఏళ్ల రాజకీయ జీవితంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతగా తనకు ఇచ్చే బహుమతి హత్యనా అని మండిపడ్డారు. పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ మాట్లాడుతుండగానే ఫోన్ కట్ చేసిన జీవన్ రెడ్డి, జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ తో నీకో దండం నీ పార్టీ కో దండం అంటూ అసహనం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని సంతోషపడాలా... నా మనుషులను చంపేస్తున్నారని బాధపడాలా? అని ప్రశ్నించారు. రక్షించాల్సిన పోలీసులు వాళ్లకే వత్తాసు పలుకుతారు... కాంగ్రెస్ పార్టీ వాళ్ళకే వత్తాసు పలుకుతుందని ఆవేదన వ్యక్తం చేశారు.

పార్టీలో ఉంటాడా? వీడుతాడా? అనే సర్వత్రా చర్చ

కాంగ్రెస్ పార్టీ పెద్దల తీరుపై తీవ్ర అసహనంతో ఉన్న ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి పార్టీలో ఉంటాడా?.. వీడుతాడా అని సర్వత్రా చర్చ సాగుతోంది. గంగారెడ్డి హత్య అనంతరం జీవన్ రెడ్డితో పాటు ఆయన అనుచరులు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. కాంగ్రెస్ లీడర్ లు, పట్టించుకోరు.. పోలీసులు పట్టించుకోరు.. ఇక మనకు కాంగ్రెస్ వద్దంటు జీవన్ రెడ్డి పై అనుచరులు ఒత్తిడి పెంచుతున్నారు. కాంగ్రెస్ ముస్కులో ప్రాణాలు తీస్తుంటే...నేను రాజకీయాల నుండి తప్పకుంటా, నాకు ఏ పదవి వద్దని జీవన్ రెడ్డి స్పష్టం చేశారు. అయితే ఆవేదనతో ఆందోళనలో ఉన్న జీవన్ రెడ్డి ని సముదాయించేందుకు ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ విశ్వప్రయత్నం చేసినప్పటికీ ప్రయోజనం లేకపోవడంతో పార్టీ పెద్దల పిలుపుమేరకు లక్ష్మణ్ కుమార్ హైదరాబాద్ కు వెళ్ళిపోయారు. తీవ్ర మనోవేదనతో ఉన్న జీవన్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

జీవన్ రెడ్డి పై అదిష్టానం కినుక

గత నాలుగు మాసాలుగా ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి కాంగ్రెస్ పెద్దల తీరుపట్ల ఆవేదనతో ఉండగా ముఖ్య అనుచరుడు హత్యతో అసహనం వ్యక్తం చేస్తున్నాడు. తన మాటను పార్టీ పెద్దలు, ప్రభుత్వ ప్రతినిధులు ఖాతరు చేయడం లేదనే ఆవేదనతో జీవన్ రెడ్డి ఉన్నారు. జీవన్ రెడ్డి ఎంత అసహనంతో ఉన్నారో పార్టీ పెద్దలు కూడా అదే స్థాయిలో జీవన్ రెడ్డిని వదిలించుకునే ప్రయత్నం చేస్తున్నట్లు జరుగుతున్న పరిణామాలను బట్టి అర్థమవుతుంది. ప్రభుత్వానికి కావల్సింది ఎమ్మెల్యేలు తప్ప ఎమ్మెల్సీలు కాదనే భావనతో సీఎం ఉన్నట్లు జీవన్ రెడ్డి భావిస్తూ పార్టీ ఫిరాయింపులపై ఘాటుగా స్పందించినట్లు తెలుస్తోంది. కెసిఆర్ అప్రజాస్వామికంగా ప్రతిపక్షాలను నిర్వీర్యం చేయాలని పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహిస్తే, మనం అదే కోరుకుందామా? అని జీవన్ రెడ్డి పార్టీ పెద్దలను ప్రశ్నించారు. అయితే జీవన్ రెడ్డి వైఖరిని పార్టీ పెద్దలు కొందరు తప్పు పడుతూ ఆయనను వదిలించుకునేందుకే ఎక్కువ మొగ్గు చూపుతున్నట్లు ప్రచారం జరుగుతుంది. అందులో భాగంగానే ఎమ్మెల్యే సంజయ్ ని జీవన్ రెడ్డి పై ఉసిగొలిపినట్లు తెలుస్తుంది.

జీవన్ రెడ్డిపై ఎమ్మెల్యే సంజయ్ ఫైర్

ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి పై జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ ఫైర్ అయ్యారు. కాంగ్రెస్ సీనియర్ నాయకుడు గంగారెడ్డి హత్య బాధాకరమని..హత్యను జీవన్ రెడ్డి రాజకీయం చేయడం ఖండిస్తున్నానని తెలిపారు. గంగారెడ్డి హత్యకేసులో తన పక్కనున్నవారితో నా హస్తం ఉందని జీవన్ రెడ్డి మాట్లాడించడం దురదృష్టకరమన్నారు. ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి పార్టీ ఫిరాయింపులపై మాట్లాడడం దయ్యాలు వేదాలు వల్లించినట్లు ఉందని ఎద్దేవా చేశారు. ఇప్పటికీ తాను బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేయలేదని, కాంగ్రెస్ పార్టీ సభ్యత్వం తీసుకోలేదని స్పష్టం చేశారు. ఫిరాయింపుల రాజకీయాల గురించి మాట్లాడుతున్న జీవన్ రెడ్డిది ఎలాంటి చరిత్రో అందరికీ తెలుసన్నారు. నాడు కాంగ్రెస్ ను తిడుతూనే రాజకీయాల్లోకి వచ్చిన చరిత్ర జీవన్ రెడ్డిదని విమర్శించారు. ఎన్టీఆర్ కేబినెట్ లో మంత్రి అయి నాదెండ్ల భాస్కర్ రావుతో కలిసి మళ్లీ పార్టీ ఫిరాయించి ఎన్టీఆర్ ను ఏకాకిని చేసింది జీవన్ రెడ్డి కాదా అని ప్రశ్నించారు. స్వాతంత్ర్యం రాకముందు నుంచే మేం కాంగ్రెస్ వాదులం,.. కాంగ్రెస్ పార్టీ ఆఫీసుకు కేంద్రబిందువు మా ఇల్లు అని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వంతో కలిసి పనిచేస్తే జగిత్యాల అభివృద్ధి చెందుతుందనేదే ఉద్దేశంతో కాంగ్రెస్ తో కలిసి పనిచేస్తున్నానని సంజయ్ స్పష్టం చేశారు.

కాంగ్రెస్ కార్యకర్త హత్య... జగిత్యాల నేతల మధ్య రాజకీయ విమర్శలు కాంగ్రెస్ పార్టీలో కలకలం సృష్టిస్తున్నాయి. కాంగ్రెస్ లో చోటు చేసుకుంటున్న విమర్శలు ఆరోపణలు ఆవేశాలు ఆవేదలు ఎటువైపు దారితీస్తుందోనని విపక్షాలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి.

రిపోర్టింగ్ : కె వి రెడ్డి ఉమ్మడి కరీంనగర్ జిల్లా కరస్పాండెంట్ హిందుస్థాన్ టైమ్స్ తెలుగు.

Whats_app_banner