Vargal Navodaya: వర్గల్ నవోదయలో ప్రవేశానికి దరఖాస్తుల ఆహ్వానం.. సెప్టెంబర్ 16 లాస్ట్ డేట్
Vargal Navodaya: వర్గల్ జవహార్ నవోదయ విద్యాలయంలో 6వ తరగతిలో ప్రవేశానికి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు.. సిద్దిపేట కలెక్టర్ మనుచౌదరి వెల్లడించారు. ఉమ్మడి మెదక్ జిల్లాలోని ప్రభుత్వ, గుర్తింపు పొందిన ప్రైవేటు పాఠశాలల్లో ప్రస్తుతం 5వ తరగతి చదువే విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాలన్నారు.
వర్గల్ జవహార్ నవోదయ విద్యాలయంలో 6వ తరగతిలో ప్రవేశానికి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు సిద్దిపేట కలెక్టర్ మనుచౌదరి వెల్లడించారు. ఆసక్తిగల విద్యార్థులు 16 సెప్టెంబర్ 2024 లోపు ఆన్‌లైన్‌లో ఉచితంగానే దరఖాస్తు చేసుకోవచ్చని సూచించారు. ఈ దరఖాస్తుకు ప్రధానోపాధ్యాయుడి సంతకం ఉన్న ధ్రువపత్రం, నివాస ధ్రువపత్రం, అభ్యర్థి ఫోటో, సంతకాన్ని అప్‌లోడ్ చేయాలని సూచించారు.
ఉమ్మడి మెదక్ జిల్లాలోని తల్లితండ్రులు, ఉపాధ్యాయులు తమ పిల్లలను ప్రోత్సహించి.. దరఖాస్టు చేయించాలని విజ్ఞప్తి చేశారు. దరఖాస్తు చేసుకున్న విద్యార్థులకు 18 జనవరి 2025న ప్రవేశ పరీక్ష ఉంటుందని కలెక్టర్ వివరించారు. ఈ పరీక్ష ఉమ్మడి మెదక్ జిల్లాలోని వివిధ పరీక్షా కేంద్రాలలో నిర్వహిస్తామన్నారు. మరిన్ని వివరాలకు www.Navodaya.gov.in వెబ్‌సైట్‌నూ చూడాలని కలెక్టర్ వివరించారు.
ప్రధానమంత్రి బాల పురస్కార్ అవార్డుకు దరఖాస్తులు..
మహిళా, శిశు సంక్షేమ శాఖ భారత ప్రభుత్వం ఆధ్వర్యంలో.. ప్రధానమంత్రి రాష్ట్రీయ బాల పురస్కార్ అవార్డుల కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా సంక్షేమ శాఖాధికారి శారద ఒక ప్రకటన విడుదల చేశారు. జిల్లా వ్యాప్తంగా 6 నుంచి 18 సంవత్సరాల లోపు వయసున్న బాల బాలికలు ఈ అవార్డుకు అర్హులని వివరించారు. 31 ఆగస్ట్ 2024 లోపు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.
ఆన్‌లైన్‌లోనే దరఖాస్తులు..
సాంస్కృతిక కలలు, క్రీడలు, సమాజ సేవ, పాండిత్యం, సాహసరంగాల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన బాలలు.. సంబంధిత సపోర్టింగ్ డాక్యుమెంట్స్‌తో దరఖాస్తు చేసుకోవాలని శారద సూచించారు. 31 ఆగస్ట్ 2024 లోపు ఈ దరఖాస్తులు ఆన్‌లైన్‌లో స్వీకరిస్తామని చెప్పారు. బాల పురస్కార్ అవార్డుల కోసం ఎంపికైన బాలలకు డిసెంబర్ 26వ తేదీన వీర్ బాల్ దివస్‌ను పురస్కరించుకొని ఈ అవార్డులను అందజేస్తామని వివరించారు. అర్హులైన వారు http://awards.gov.in వెబ్ సైట్‌లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.
( రిపోర్టింగ్ - హిందుస్తాన్ టైమ్స్ తెలుగు, ఉమ్మడి మెదక్ జిల్లా ప్రతినిధి )