Telangana Opinion Poll 2023 : తెలంగాణలో అధికారం ఎవరిది..? జాతీయ సర్వేలో అనూహ్య ఫలితాలు-india today c voter survey shows congress surge in telangana assembly polls 2023 check full report are here ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Telangana Opinion Poll 2023 : తెలంగాణలో అధికారం ఎవరిది..? జాతీయ సర్వేలో అనూహ్య ఫలితాలు

Telangana Opinion Poll 2023 : తెలంగాణలో అధికారం ఎవరిది..? జాతీయ సర్వేలో అనూహ్య ఫలితాలు

Maheshwaram Mahendra Chary HT Telugu
Oct 21, 2023 01:22 PM IST

India Today - C Voter Survey :ఈసారి తెలంగాణలో ఎన్నికలు రసవత్తరంగా మారనున్నాయి. ఎవరికి వారే.. తామే అధికారంలోకి వస్తున్నామంటూ ధీమా వ్యక్తం చేస్తుండగా.. సర్వేలు మాత్రం ఊహించని ఫలితాలు ఇస్తున్నాయి. తెలంగాణ ఎన్నికలపై ఇండియా టుడే - సీ ఓటర్ ఇచ్చిన సర్వే ఫలితాలు ఆసక్తిని పుట్టిస్తున్నాయి.

తెలంగాణ ఎన్నికల సర్వే రిపోర్ట్
తెలంగాణ ఎన్నికల సర్వే రిపోర్ట్

India Today - C Voter survey On Telangana Polls: తెలంగాణలో ఎన్నికల యుద్ధం రసవత్తరంగా మారుతోంది. ప్రధాన పార్టీలైన బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ… ఎవరికి వారిగా వ్యూహాలు రచిస్తున్నారు. ఓవైపు పెద్ద ఎత్తున చేరికలతో పాటు… అభ్యర్థుల ఖరారుపై ఫోకస్ పెట్టాయి బీజేపీ, కాంగ్రెస్. అయితే ఈసారి తెలంగాణ గడ్డపై ఎలాగైనా హస్తం జెండాను ఎగరవేయాలని భావిస్తున్న కాంగ్రెస్…. అందుకు తగ్గటుగానే అడుగులు వేస్తోంది. బీఆర్ఎస్ ను ఓడించబోతున్నామని… తెలంగాణలో రాబోయేది తమ ప్రభుత్వమే అని తేల్చి చెబుతోంది. బీఆర్ఎస్, బీజేపీ పార్టీలు ఒకటేనంటూ ఆరోపించటమే కాకుండా… పలు అంశాలను ప్రజల ముందు ఉంచే ప్రయత్నం చేస్తోంది. మరోవైపు బీజేపీ మాత్రం… హంగ్ వస్తోందని సరికొత్త లాజిక్ ను తెరపైకి తీసుకువస్తోంది. ఇవన్నీ ఇలా ఉంటే… సర్వే రిపోర్టులు మాత్రం ఆసక్తికరమైన విషయాలను వెల్లడిస్తున్నాయి. తాజాగా విడుదలైన ఇండియా టుడే - సీ ఓటర్ సర్వేలో….కాంగ్రెస్ ముందంజలో ఉన్నట్లు తెలిపింది. అంతేకాకుండా పలు కీలక అంశాలను ఇందులో ప్రస్తావించింది.

సర్వేలోని కీలక అంశాలు ఇవే:

ఎన్నికల షెడ్యూల్ ప్రకారం నవంబర్ 30న పోలింగ్ జరగనుండగా.. డిసెంబర్ 3న ఫలితాలు వెలువడనున్నాయి. అయితే.. ఆ రోజు ఎలాంటి ఫలితాలు వెలువడనున్నాయో తెలియదు కానీ.. ఇండియా టుడే - సీ-ఓటర్ సర్వే లో మాత్రం అనూహ్యమైన ఫలితాలు వెలువడ్డాయి. కాంగ్రెస్ మెజార్టీ సీట్లను గెలుస్తుందని… అధికార బీఆర్ఎస్ రెండో స్థానంలోనే నిలుస్తుందని పేర్కొంది.

  • 119 అసెంబ్లీ సీట్లు ఉన్న తెలంగాణాలో ఈ సారి కాంగ్రెస్ పార్టీకి 54 సీట్లు వస్తాయని ఇండియా టుడే-సీ ఓటర్ సర్వే తేల్చింది.
  • 2018 ఎన్నికల్లో 88 సీట్లను గెలుచుకున్న బీఆర్ఎస్.. ఈసారి కేవలం 49 స్థానాలతోనే సరిపెట్టుకుంటుందని వెల్లడించింది.
  • గత ఎన్నికల్లో కేవలం ఒక్క స్థానంలోనే గెలిచిన బీజేపీ … ఈ ఎన్నికల్లో 8 సీట్లు గెలుచుకునే అకాశం ఉందని వివరించింది.
  • 2018 ఎన్నికల్లో ఇతరులు 11 మంది గెలవగా… ఈ ఎన్నికల్లో 8 మంది వరకు గెలవొచ్చని అంచనా వేసింది.

పెరగనున్న కాంగ్రెస్ ఓటింగ్ షేర్..!

  • ఇక ఓటింగ్ షేర్ విషయానికొస్తే కాంగ్రెస్ బలం భారీగా పెరగనున్నట్లు తెలిపింది ఇండియా టుడే - సీ ఓటర్ సర్వే. గత ఎన్నికల్లో 28 శాతం ఓట్లను దక్కించుకున్న కాంగ్రెస్… ఈసారి 39 శాతానికి పెరుగుతుందని వెల్లడించింది. గతంతో పోల్చితే 11 శాతం ఓట్లు పెరుగుతాయని సర్వేలో వెల్లడించింది.
  • 2018 ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి 47 శాతం ఓట్లు వస్తే… వచ్చే ఎన్నికల్లో 9 శాతం తగ్గి 38 శాతానికి పడిపోవచ్చని తెలిపింది.
  • 2018 ఎన్నికల్లో బీజేపీకి 8 శాతం ఓట్లు దక్కగా… రాబోయే ఎన్నికల్లో ఈ సంఖ్య రెండింతలు అవుతుందని పేర్కొంది. 16 శాతానికి పెరుగుతుందని వివరించింది.
  • ఇతరుల ఓట్ల శాతం 18 నుంచి 7 శాతానికి పడిపోతుందని అంచనా వేసింది.

ఇక తెలంగాణలో అధికారం దక్కాలంటే 60 అసెంబ్లీ స్థానాలను దాటాల్సి ఉంటుంది. మేజిక్ ఫిగర్ దాటే పార్టీకే అధికారం దక్కనుంది. అయితే ఇండియా టుడే - సీ ఓటరు సర్వేలో కాంగ్రెస్ …. మేజిక్ ఫిగర్ కు దగ్గరగా ఉండటం ఆసక్తికరంగా మారింది. అయితే ఎన్నికలకు మరింత సమయం ఉన్న నేపథ్యంలో… రాజకీయ పరిణామాలు మారే అవకాశం ఉంటుందనే అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు విశ్లేషకులు. సర్వే ఫలితాలను చూస్తే… తెలంగాణలో కాంగ్రెస్ భారీగా బలపడిందనే విషయాన్ని ప్రతిబింబిస్తున్నాయని అభిప్రాయపడుతున్నారు. సర్వే రిపోర్టులపై ఆయా పార్టీలు… ఒక్కో విధంగా స్పందిస్తున్నాయి.

Whats_app_banner