IIIT Hyderabad: ఈ క్యాంపస్‌లో సీటు వస్తే.. మీ లైఫ్ సెట్ అయినట్టే..-iiit hyderabad is the best in terms of annual salary package for campus recruitment ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Iiit Hyderabad: ఈ క్యాంపస్‌లో సీటు వస్తే.. మీ లైఫ్ సెట్ అయినట్టే..

IIIT Hyderabad: ఈ క్యాంపస్‌లో సీటు వస్తే.. మీ లైఫ్ సెట్ అయినట్టే..

Basani Shiva Kumar HT Telugu
Aug 18, 2024 12:14 PM IST

IIIT Hyderabad: ఇంజినీరింగ్.. చాలామంది విద్యార్థుల కల. కానీ.. ఏ కాలేజీలో చదవాలి.. ఎక్కడ చదవాలి అనే విషయాల్లో మాత్రం చాలామందికి క్లారిటీ ఉండదు. ఎక్కడ చదివితే లైఫ్‌లో సెట్ అవుతాం అని విద్యార్థులు ఆరా తీస్తుంటారు. అలాంటి వారి కోసమే ఈ సమాచారం.

హైదరాబాద్‌ ఐఐఐటీ
హైదరాబాద్‌ ఐఐఐటీ

హైదరాబాద్‌ ఐఐఐటీ.. ఇప్పుడు ఈ పేరు దేశవ్యాప్తంగా మారుమోగుతోంది. దానికి కారణం.. ప్రాంగణ నియామకాల వార్షిక వేతన ప్యాకేజీలో హైదరాబాద్‌ ఐఐఐటీ హవా నడుస్తోంది. లాస్ట్ అకడమిక్ ఇయర్‌లో దేశంలోని ప్రముఖ ఐఐటీలను దాటేసి ఫస్ట్ ప్లేస్‌లో నిలిచింది. హైదరాబాద్ ఐఐఐటీలో మీడియన్‌ ప్యాకేజీ ఐఐటీ ఢిల్లీ, ఐఐటీ మద్రాస్, ఐఐటీ బాంబే కంటే ఎక్కువ ఉంది. ప్రముఖ ఐఐటీ క్యాంపస్‌ల్లో నాలుగేళ్ల బీటెక్‌ విద్యార్థులకు 2022-23 అకడమిక్ మీడియన్ వార్షిక వేతనం అత్యధికంగా 24 లక్షల రూపాయలు ఉండగా.. హైదరాబాద్ ఐఐఐటీలో ఏకంగా 30.30 లక్షల రూపాయలు ఉంది.

వార్షిక వేతనం 30 లక్షల పైనే..

తాజాగా.. కేంద్ర విద్యాశాఖ ఎన్‌ఐఆర్‌ఎఫ్‌ ర్యాంకింగ్‌లను విడుదల చేసింది. దీంట్లో క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌కు ఎంపికైన వారి సంఖ్య, ప్యాకేజీ, ఉన్నత విద్యకు వెళ్లిన వారి వివరాలను వెల్లడించింది. ఇంజినీరింగ్‌ విభాగంలో మొత్తం 1,463 కాలేజీలు పోటీపడగా.. టాప్‌-100 కాలేజీలను కేంద్ర విద్యా శాఖ ప్రకటించింది. హైదరాబాద్ ఐఐఐటీలో నాలుగేళ్ల బీటెక్‌లో 154 మంది పాస్ అవ్వగా.. 140 మంది క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో సెలెక్ట్ అయ్యారు. వారిలో 70 మంది వార్షిక వేతనం 30 లక్షల పైనే ఉండటం గమనార్హం. ఈ క్యాంపస్‌లో కంప్యూటర్‌ సైన్స్, ఈసీఈ బ్రాంచీలు మాత్రమే ఉండటంతో.. క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో ఎక్కువ మంది విద్యార్థులు సెలెక్ట్ అవుతున్నారు.

ప్రభుత్వ ప్రైవేట్ భాగస్వామ్యంతో..

ఐఐఐటీ హైదరాబాద్ క్యాంపస్‌ను 1998లో స్థాపించారు. ఇది ప్రొఫెసర్ సీఆర్ రావు రోడ్డు గచ్చిబౌలిలో ఉంది. ప్రభుత్వ ప్రైవేట్ భాగస్వామ్యంతో దీన్ని స్థాపించారు. ఈ క్యాంపస్‌లో అండర్ గ్రాడ్యుయేట్, పోస్ట్ గ్రాడ్యుయేట్, డ్యూయల్ డిగ్రీ ప్రోగ్రాంలు ఉన్నాయి. అమెరికాలో కార్నెగీ మేలన్ యూనివర్సిటీ సహకారంతో.. ఇక్కడ ఎంఎస్ఐటి ప్రోగ్రాం నడుపుతున్నారు. ఈ క్యాంపస్‌లో ఐఐఐటి సాంస్కతిక కార్యక్రమాలు, మానవ విలువలపైనా తరగతులు నిర్వహిస్తున్నారు. సువిశాలమైన స్థలంలో ఈ క్యాంపస్ నిర్మించారు. ఫుట్ బాల్, బాస్కెట్ బాల్, క్రికెట్, హాకీ గ్రౌండ్‌లు, ఓపెన్ ఎయిన్ జిమ్, ఓపెన్ ఎయిర్ థియేటర్ వంటి వసతులు ఉన్నాయి.

ఐదు హాస్టల్ భవనాలు..

ఐఐఐటీ హైదరాబాద్ క్యాంపస్‌లో మొత్తం ఐదు హాస్టల్ భవనాలు ఉన్నాయి. పలాష్ నివాస్, న్యూ బాయ్స్ హాస్టల్, బకుల్ నివాస్, పరిజాత్ నివాస్, న్యూ గర్ల్స్ హాస్టల్.. భవనాలు ఉన్నాయి. న్యూ గర్ల్స్ హాస్టల్‌ను అమ్మాయిలకు కేటాయించారు. మిగతా భవనాల్లో అండర్ గ్రాడ్యుయేట్ బాయ్స్ ఉంటారు. బకుల్ నివాస్‌లో పీజీ విద్యార్థులు ఉంటారు. ఏ భవనానికి ఆ భవనంలో మెస్ సౌకర్యం ఉంటుంది. ఆహ్లాదకరమైన వాతావరణంలో క్యాంపస్ ఉందని.. ఎన్నో ఆవిష్కరణలకు ఇక్కడ బీజం పడిందని విద్యార్థులు చెబుతున్నారు.

Whats_app_banner