TSRTC : కండక్టర్ ను కాలితో తన్నిన యువతి కటకటాలపాలు, క్షణికావేశంలో జీవితాలు నాశనం చేసుకోవద్దన్న సజ్జనార్
TSRTC : ఇటీవల మద్యం మత్తులో ఓ యువతి టీఎస్ఆర్టీ కండక్టర్లపై దాడికి పాల్పడింది. ఈ ఘటనపై టీఎస్ఆర్టీసీ యాజమాన్యం పోలీసులకు ఫిర్యాదు చేసింది. కండక్టర్లపై దాడికి పాల్పడిన యువతిని ఎల్బీ నగర్ పోలీసులు ఇవాళ అరెస్టు చేశారు.
TSRTC : హైదరాబాద్ లోని హయత్‌నగర్ డిపోనకు చెందిన ఇద్దరు కండక్టర్లపై ఓ యువతి ఇటీవల దుర్భాషలాడుతూ దాడికి పాల్పడింది. ఈ వ్యవహారంలో టీఎస్ఆర్టీసీ సీరియస్ అయ్యింది. ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. కండక్టర్లపై దాడి కేసులో నిందితురాలైన అంబర్ పేటకు చెందిన సయ్యద్ సమీనాను ఎల్బీనగర్ పోలీసులు ఆదివారం అరెస్ట్ చేశారు. ఈ కేసులో నిందితురాలికి రంగారెడ్డి జిల్లా కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. ఈ కేసు విచారణను త్వరతిగతిన చేపట్టి.. నిందితురాలిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించిన పోలీసులకు టీఎస్ఆర్టీసీ సజ్జనార్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.
క్షణికావేశంలో జీవితాలు నాశనం చేసుకోవద్దు
టీఎస్ఆర్టీసీ సిబ్బంది విధులకు ఆటకం కలిగించినా, దాడులకు పాల్పడిన యాజమాన్యం ఏమాత్రం సహించదని సజ్జనార్ అన్నారు. బాధ్యులపై చట్ట ప్రకారం చర్యలుంటాయని హెచ్చరించారు. పోలీస్ శాఖ సహకారంతో నేరస్థులపై హిస్టరీ షీట్స్ తెరిచేలా సంస్థ చర్యలు తీసుకుంటుందన్నారు. 45 వేల మంది టీఎస్‌ఆర్టీసీ సిబ్బంది ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీయడంతో పాటు మనోవేదనకు గురిచేసే ఇలాంటి ఘటనలకు పాల్పడవద్దని విజ్ఞప్తి చేస్తున్నామన్నారు. క్షణికావేశంలో సహనం కోల్పోయి దాడులు చేసి జీవితాలను నాశనం చేసుకోవద్దని సజ్జనార్ సూచించారు.
టీఎస్ఆర్టీసీ విధులకు ఆటకం కలిగిస్తే చర్యలు
నిబద్దత, క్రమ శిక్షణతో సమర్థవంతంగా విధులు నిర్వహిస్తోన్న తమ సిబ్బందిపై కొందరు దాడులకు దిగడాన్ని తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(టీఎస్ఆర్టీసీ) యాజమాన్యం తీవ్రంగా ఖండించింది. ప్రతి రోజూ సగటున 55 లక్షల మంది ప్రయాణికులను క్షేమంగా గమ్యస్థానాలకు చేరవేస్తోన్న సిబ్బందిపై దుర్భాషలాడుతూ దాడులు చేయడం ఏమాత్రం సమంజసం కాదని పేర్కొంది. టీఎస్ఆర్టీసీ సిబ్బంది విధులకు ఆటకం కలిగించే, దాడులకు పాల్పడే వ్యక్తులపై చట్టప్రకారం చర్యలుంటాయని, పోలీస్ శాఖ సహకారంతో నేరస్థులపై హిస్టర్ షీట్స్ తెరిచేలా చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. సిబ్బందిలో ఆత్మస్థైర్యం దెబ్బతీసే ఇలాంటి ఘటనలకు పాల్పడితే ఏమాత్రం ఉపేక్షించబోమని టీఎస్‌ఆర్టీసీ యాజమాన్యం స్పష్టం చేసింది.
కండక్టర్లపై దాడులు
టీఎస్ఆర్టీసీ కండక్టర్లపై ఇటీవల మూడు చోట్ల మహిళలు దాడులకు పాల్పడ్డారు. హయత్ నగర్ డిపో-1కు చెందిన ఇద్దరు కండక్టర్లపై నానా దుర్బాషలాడుతూ వేర్వేరుగా దాడికి దిగారు. చిల్లర విషయంలో ఒక మహిళ, గుర్తింపు కార్డును చూపించి జీరో టికెట్ ను తీసుకోవాలని కండక్టర్ చెప్పినందుకు కండెక్టర్ సెల్ ఫోన్ లాక్కుని అసభ్యపదజాలంతో మరొక మహిళ దూషించారు. పికెట్ డిపోకు చెందిన మహిళా కండక్టర్ పై కొందరు మహిళలు సాముహికంగా దాడి చేశారు. పై మూడు ఘటనలపై రాచకొండ కమిషనరేట్ లోని సంబంధిత పోలీస్ స్టేషన్ లలో టీఎస్ఆర్టీసీ అధికారులు వేర్వేరుగా ఫిర్యాదు చేశారు. ఆ కేసుల దర్యాప్తు ప్రస్తుతం కొనసాగుతోందని ఆర్టీసీ అధికారులు వెల్లడించారు. చట్టప్రకారం వారిపై చర్యలు తీసుకుంటామని టీఎస్ఆర్టీసీ పేర్కొంది. హయత్‌నగర్ డిపో ఆర్టీసీ బస్సులో ఓ యువతి మద్యం మత్తులో వీరంగం చేసింది. తనకు చిల్లర ఇవ్వలేదని కండక్టర్‌ను దుర్భాషలాడుతూ కాలితో తన్నింది. కండక్టర్ సహా తోటి ప్రయాణికులు ఆమెను అడ్డుకునేందుకు ప్రయత్నించిన మద్యం మత్తులో అసభ్య పదజాలంతో రెచ్చిపోయింది. ఈ ఘటనపై టీఎస్ఆర్టీసీ ఎండీ సజ్జనార్ స్పందిస్తూ... నిబద్ధతతో విధులు నిర్వహిస్తున్న సిబ్బందిపై ఇలాంటి ఘటనలకు పాల్పడితే ఏమాత్రం ఉపేక్షించబోమన్నారు.