Komuravelli Railway Station : కొమురవెల్లి మల్లన్న భక్తులకు శుభవార్త, రైల్వే స్టేషన్ నిర్మాణానికి కేంద్రం గ్రీన్ సిగ్నల్
Komuravelli Railway Station : కొమురవెల్లిలో రైల్వే హాల్టింగ్ స్టేషన్ ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. మనోహరాబాద్-కొత్తపల్లి మార్గంలో కొమురవెల్లిలో హాల్టింగ్ రైల్వేస్టేషన్ నిర్మించనున్నారు.
Komuravelli Railway Station : ప్రముఖ పుణ్యక్షేత్రమైన కొమురవెల్లిలో రైల్వే స్టేషన్ ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం పచ్చ జెండా ఊపింది. కొమరవెల్లి శివారు నుంచి రైల్వే మార్గాన్ని ఇప్పటికే నిర్మిస్తుండగా.... సిద్దిపేట నుంచి సికింద్రాబాద్ కు రైలు రాకపోకలు సాగేస్తుంది. అయితే మార్గమధ్యలో ఉన్న కొమురవెల్లిలో ఇన్ని రోజులు హాల్టింగ్ లేకపోవడం గమనార్హం. ఇక్కడ స్టేషన్ ఏర్పాటు చేయాలని రైల్వే అధికారులు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు, ప్రజాప్రతినిధులకు ప్రజలు అనేక సార్లు విన్నపాలు పంపారు. అయితే ఎట్టకేలకు కొమురవెల్లి శివారు నుంచి వెళుతున్న రైల్వే మార్గంపై హాల్టింగ్ స్టేషన్ నిర్మిస్తామని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రకటించారు. దీంతో మల్లన్న భక్తులు, స్థానికులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
హాల్టింగ్ స్టేషన్
హాల్టింగ్ స్టేషన్ ఏర్పాటుతో లక్షలాది మంది భక్తులకు ప్రయోజనం కలగనుంది. నాలుగు రాష్ట్రాల నుంచి స్వామివారి దర్శనానికి ఏటా దాదాపు 25 నుంచి 30 లక్షల మంది భక్తులు వస్తూ ఉంటారు. అందులో 70 శాతం మంది సామాన్య భక్తులే ఉంటారు. వారంతా ఆర్టీసీ బస్సులలో, ఇతర ప్రైవేట్ వాహనాలలో ఆలయానికి చేరుకుంటారు. అయితే బస్సుల్లో వచ్చే వారికి రాజీవ్ రహదారి నుంచి మూడు కిలోమీటర్ల దూరంలోని కొమురవెల్లికి చేరుకుంటారు. తిరిగి ఇంటికి వెళ్లేందుకు భక్తులు, ప్రయాణికులు ప్రధాన రహదారిపై గంటల సమయం నిరీక్షించాల్సి వచ్చేది. ఇక హైదరాబాదు నుంచి వచ్చే భక్తులు 110 కిలోమీటర్లు, కరీంనగర్ నుంచి వచ్చే వారు 90 కిలోమీటర్లు ప్రయాణం చేస్తూ .... రెండు, మూడు వాహనాలు మారాల్సిన పరిస్థితి వచ్చేది. హైదరాబాద్ నుంచి ఒక్కొక్కరికి రూ.100 నుంచి రూ.150, కరీంనగర్ నుంచి రూ. 100 ఖర్చు అవుతుంది. రైలు ప్రయాణం అయితే సగం భారం తగ్గే అవకాశం ఉంటుంది. కొమురవెల్లి సమీపంలో రైల్వే స్టేషన్ ఏర్పాటుతో పేద, మధ్యతరగతి ప్రజలకు ఎంతో ప్రయోజనం కలుగనుందని భక్తులు హర్షం వ్యక్తం చేశారు.
మనోహరాబాద్-కొత్తపల్లి మార్గంలో కొమురవెల్లిలో హాల్టింగ్ రైల్వేస్టేషన్ నిర్మించనున్నారు. భక్తుల విజ్ఞప్తితో సాధ్యాసాధ్యాలపై చర్చించిన రైల్వేశాఖ.. కొమురవెల్లి మల్లన్న జాతర సందర్భంగా రైల్వేహాల్ట్ స్టేషన్ నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. లకుడారం, దుద్దెడ స్టేషన్ల మధ్య కొమురవెల్లిలో కొత్త హాల్ట్ స్టేషన్ నిర్మాణానికి రైల్వేశాఖ అంగీకరించింది. రైల్వే అధికారుల నిర్ణయంపై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు.
బీఆర్ఎస్ కు ఓటేస్తే మూసి నదిలో వేసినట్లే- కిషన్ రెడ్డి
రాబోయే లోక్ సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి ఓటు వేస్తే మూసి నదిలో వేసినట్లేనని కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి ఆరోపించారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. లోక్ సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ఎంపీలు సీట్లు గెలిచినా, ఓడినా వచ్చే నష్టమేమీ లేదని కిషన్ రెడ్డి పేర్కొన్నారు. అసెంబ్లీ ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ అనేక హామీలు ఇచ్చిందని ప్రస్తుతం వాటిని ఎలా అమలు చేయాలనే దానిపై ప్రభుత్వానికి స్పష్టమైన రూట్ మ్యాప్ లేదని విమర్శించారు. ప్రధాని నరేంద్ర మోదీ హయాంలో దేశంలో నాలుగు కోట్లకు పైగా ఇండ్లు నిర్మించామని కిషన్ రెడ్డి పేర్కొన్నారు. బీజేపీ అధికారంలోకి వచ్చాక 1500 కు పైగా పనికిరాని చట్టాలను రద్దు చేశామని ప్రకటించారు. కేసీఆర్ అధికారంలో ఉన్నప్పుడు రాష్ట్రంలో అర్హులైన ప్రజలకు ఇండ్లు నిర్మించి ఇవ్వలేకపోయారని కిషన్ రెడ్డి మండిపడ్డారు.
రిపోర్టింగ్ : కేతిరెడ్డి తరుణ్, హైదరాబాద్ జిల్లా