CM KCR : భారతీయుల ఐక్యతను చీల్చేందుకు బీజేపీ కుట్ర, యూసీసీని వ్యతిరేకిస్తున్నాం- సీఎం కేసీఆర్-hyderabad muslim leaders met cm kcr on ucc bill clarified brs opposes uniform civil code ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Cm Kcr : భారతీయుల ఐక్యతను చీల్చేందుకు బీజేపీ కుట్ర, యూసీసీని వ్యతిరేకిస్తున్నాం- సీఎం కేసీఆర్

CM KCR : భారతీయుల ఐక్యతను చీల్చేందుకు బీజేపీ కుట్ర, యూసీసీని వ్యతిరేకిస్తున్నాం- సీఎం కేసీఆర్

Bandaru Satyaprasad HT Telugu
Published Jul 10, 2023 08:32 PM IST

CM KCR : ఉమ్మతి పౌరస్మృతి బిల్లును వ్యతిరేకిస్తున్నామని సీఎం కేసీఆర్ తెలిపారు. దేశ ప్రజల్లో చిచ్చుపెట్టేందుకు బీజేపీ కుట్ర చేస్తుందని ఆరోపించారు.

సీఎం కేసీఆర్
సీఎం కేసీఆర్

CM KCR : యూనిఫాం సివిల్ కోడ్(UCC) పేరుతో బీజేపీ ప్రజలను విభజించేందుకు కుట్ర చేస్తుందని సీఎం కేసీఆర్ అన్నారు. యూసీసీని వ్యతిరేకిస్తున్నట్లు సీఎం కేసీఆర్ ప్రకటించారు. యూసీసీతో అన్ని మతాల ప్రజలను అయోమయంలోకి నెట్టేందుకు ప్రయత్నిస్తున్నారన్నారు. బీజేపీ విద్వేష రాజకీయాలు చేస్తుందని ఆగ్రహం వ్యక్తంచేశారు. బీజేపీ ఇప్పటికే పలు రకాలుగా ప్రజల మధ్య చిచ్చుపెట్టిందని, ఇప్పుడు యూసీసీ పేరుతో మరోసారి ప్రజలను విభజించేందుకు కుట్రలు చేస్తుందని ఆరోపించారు. భారత్ భిన్నత్వంలో ఏకత్వం చాటుతూ ప్రపంచానికే ఆదర్శంగా నిలుస్తోందన్నారు. భారతీయుల ఐక్యతను చీల్చేందుకు బీజేపీ యూసీసీ కుట్ర చేస్తుందని కేసీఆర్ మండిపడ్డారు. యూసీసీపై కేంద్ర ప్రభుత్వ నిర్ణయాలను తిరస్కరిస్తున్నామని కేసీఆర్‌ పేర్కొన్నారు.

ప్రజల్లో చిచ్చుపెట్టేందుకే

దేశంలోని అన్ని వర్గాల అభివృద్ధిని పట్టించుకోకుండా, ప్రజల్లో చిచ్చుపెట్టేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని సీఎం కేసీఆర్ ఆరోపించారు. యూనిఫామ్ సివిల్ కోడ్ పేరుతో దేశ ప్రజలను విడగొట్టడానికి మోదీ ప్రభుత్వం కుట్ర చేస్తుందని కేసీఆర్ విమర్శించారు. దేశంలో విభిన్న ప్రాంతాలు, జాతులు, మతాలు, ఆచార వ్యవహారాలు, సంస్కృతులు ఉన్నాయని, భిన్నత్వంలో ఏకత్వాన్ని చాటుతూ భారత్ ప్రపంచానికి ఆదర్శంగా నిలుస్తోందన్నారు. భారత ప్రజల ఐక్యతను చీల్చడానికి కేంద్రంలోని బీజేపీ యూసీసీ లాంటి నిర్ణయాలను తీసుకుంటుందని, ఈ నిర్ణయాలను బీఆర్ఎస్ పార్టీ తరఫున తిరస్కరిస్తామని అన్నారు. యూనిఫాం సివిల్ కోడ్ బిల్లును వ్యతిరేకిస్తున్నామని సీఎం కేసీఆర్ వెల్లడించారు.

యూసీసీ వ్యతిరేకంగా మద్దతు కూడగడతాం-అసదుద్దీన్ ఒవైసీ

యూనిఫామ్ సివిల్ కోడ్ బిల్లును వ్యతిరేకిస్తామని సీఎం కేసీఆర్‌ తమకు హామీ ఇచ్చారని ఏఐఎంఐఎం అధినేత, ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ తెలిపారు. యూనిఫాం సివిల్‌ కోడ్‌తో ముస్లింలతో పాటు హిందువులకు కూడా నష్టమే అన్నారు. ఆదివాసీలకు కూడా ఈ బిల్లుతో అన్యాయం జరుగుతుందన్నారు. పార్లమెంట్ లో బీఆర్ఎస్ యూసీసీ బిల్లును వ్యతిరేకించాలని ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ సీఎం కేసీఆర్ ను కోరారు. తెలంగాణలోని ముస్లిం మత పెద్దలు, ఆల్‌ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు అధ్యక్షుడు ఖాలిద్‌ సైఫుల్లా రెహ్మానీ, జమియతుల్ ఉలమా ఏ హింద్ ప్రతినిధులు ముఫ్తీ గయాజ్‌ అమ్మద్‌లతో కలిసి ఎంపీ అసదుద్దీన్ సీఎం కేసీఆర్ భేటీ అయ్యారు. యూనిఫాం సివిల్‌ కోడ్ ముస్లిం మతపెద్దలతో సీఎం కేసీఆర్ చర్చించారు. అన్నీ రాష్ట్రాల్లో కోట్ల సంఖ్యలో ఆదివాసీలు ఉన్నారని, యూసీసీ వల్ల వారందరికీ ఇబ్బందులు ఎదురవుతాయన్నారు. హిందూ వివాహ చట్టం రద్దు అవుతుందన్నారు. యూసీసీ ప్రజాస్వామ్యానికి మంచిది కాదని ఒవైసీ అన్నారు. యూసీసీకి వ్యతిరేకంగా అన్ని పార్టీల మద్దతు కోరుతామని, అన్ని రాష్ట్రాల సీఎంలు, పార్టీ అధినేతలను కలుస్తామని అసదుద్దీన్ ఒవైసీ తెలిపారు.

Whats_app_banner