Hyderabad Metro : హైదరాబాద్ మెట్రో రైలు పని వేళల్లో మార్పులు, అధికారుల క్లారిటీ!
Hyderabad Metro : మెట్రో రైలు సమయాలు పొడిగింపుపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని హైదరాబాద్ మెట్రో రైలు అధికారులు స్పష్టం చేశారు. యథావిధిగా ఉదయం 6 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు మాత్రమే మెట్రో రైళ్లు నడుస్తాయన్నారు.
Hyderabad Metro : హైదరాబాద్ మెట్రో రైలు సమయాల్లో మార్పులకు సంబంధించి జరుగుతున్న ప్రచారాన్ని అధికారులు ఖండించారు. మెట్రో రైలు సాధారణ పని వేళలు ఉదయం 6.00 గంటల నుంచి రాత్రి 11.00 వరకు మాత్రమేనని స్పష్టం చేశారు. ప్రయాణికుల సౌలభ్యం కోసం ట్రయల్ ప్రాతిపదికన అన్ని శుక్రవారాలు, సోమవారాల్లో మాత్రమే సర్వీసుల పొడిగింపుపై ప్రతిపాదనలు చేస్తున్నామన్నారు. ప్రతి సోమవారం ఉదయం 5.30 గంటలకు, ప్రతి శుక్రవారం రాత్రి 11.45 గంటల వరకు మెట్రో రైళ్ల రాకపోకలపై పరిశీలన మాత్రమే జరిగిందన్నారు. ఇంకా ఈ పొడిగింపుపై ఎలాంటి తుది నిర్ణయం తీసుకోలేదన్నారు. ప్రయాణికుల రద్దీ, రైళ్లు, ట్రాక్ నిర్వహణ సాధ్యాసాధ్యాలపై సర్వీసులు పొడిగింపు పరిశీలిస్తున్నట్టు మెట్రో అధికారులు తెలిపారు. ప్రయాణికులు మెట్రో రైళ్ల సమయాల విషయంలో గందరగోళానికి గురికావొద్దని, యథావిధి సమయాల్లోనే రాకపోకలు ఉంటాయన్నారు.
మెట్రో నిర్వహణ భారం
హైదరాబాద్ మెట్రో రైలును త్వరలో అమ్మకానికి పెట్టబోతున్నట్లు ఎల్ అండ్ టి సంస్థ ప్రెసిడెంట్, సీఎఫ్‌వో ఆర్.శంకర్ రామన్ ప్రకటించారు. 2026 తర్వాత మెట్రో రైలు విక్రయానికి సంబంధించిన నిర్ణయం ఉంటుందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిన మహిళలకు ఫ్రీ బస్సు సౌకర్యం ‘మహాలక్ష్మి’ స్కీమ్ కారణంగానే హైదరాబాద్ మెట్రో నిర్వహణ నుంచి వైదొలుగుతున్నట్టు శంకర్ రామన్ తేల్చి చెప్పారు. ఫ్రీ బస్సు పథకంతో మెట్రో ఆదాయం పడిపోయిందని పేర్కొన్నారు. ఇలాంటి సమయంలో మెట్రో రైళ్ల నిర్వహణ ఎలా సాధ్యమని ఆయన ప్రశ్నించారు. మహిళలకు ఉచిత బస్సు పథకంతో ఆర్టీసీ కూడా దివాళా తీసే పరిస్థితి వస్తుందన్నారు.
2026 తర్వాత నిర్ణయం
హైదరాబాద్ మెట్రో నిర్వహణ బాధ్యతల నుంచి తప్పుకోవాలని భావిస్తున్నామని శంకర్ రామన్ తెలిపారు. 2026 తర్వాత దీనిపై నిర్ణయిస్తామన్నారు. ప్రాధాన్యంలేని వ్యాపారాల్లో భాగస్వామ్యాన్ని ఉపసంహరించుకోనే ఆలోచన ఉన్నామన్నారు. ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణంతో మహిళలు మెట్రోలో ప్రయాణించడానికి ఆసక్తి చూపించట్లేదన్నారు. రద్దీకి తగిన బస్సులను ప్రభుత్వం పెంచట్లేదన్నారు. బస్సుల్లో సీట్లు దొరకని పురుషులు మాత్రమే మెట్రోలో ప్రయాణిస్తున్నారు. క్యాబ్ సర్వీసులు పెరగడం కూడా మెట్రోపై ప్రభావం చూపుతోందన్నారు. హైదరాబాద్ మెట్రో సేవల నుంచి వైదొలగాలనుకొన్న నిర్ణయం ఒక్క రోజులో తీసుకొన్నది కాదన్నారు. మహిళలకు ఉచిత బస్సు స్కీమ్ కారణంగా మెట్రోకు నష్టాలు వస్తున్నాయన్న ఆలోచనకు వచ్చామన్నారు. మెట్రో నిర్వహణకు సంబంధించి మరో 65 ఏళ్లు రాయితీలు ఉన్నాయన్నారు. మెట్రోలో రోజుకు 4.8 లక్షల మంది ప్రయాణిస్తున్నారని తెలిపారు.
సంబంధిత కథనం