Samshabad Metro : హైదరాబాద్ చుట్టూ మెట్రో రైలు విస్తరిస్తామన్న కేసీఆర్…
Samshabad Metro హైదరాబాద్ చుట్టూ అన్ని దిక్కుల్లో మెట్రో సేవలను విస్తరిస్తామని సిఎం కేసీఆర్ ప్రకటించారు. పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వ నిధులతో చేపట్టిన శంషాబాద్ ఎయిర్‌పోర్ట్ మెట్రో నిర్మాణానికి సిఎం కేసీఆర్ శంకుస్థాపన చేశారు. మెట్రో నిర్మాణంతో రంగారెడ్డి జిల్లా ప్రాంతం అభివృద్ధి చెందడానికి ఉపయోగపడుతుందని మంత్రి సబితా ఇంద్రారెడ్డి చెప్పారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత తెలంగాణ ముఖ చిత్రం మారిపోయిందని మంత్రి సబితా ఇంద్రారెడ్డి చెప్పారు.
Samshabad Metro : మైండ్ స్పేస్ నుంచి శంషాబాద్ వరకు పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వ నిధులతో మెట్రో నిర్మాణం చేపడుతున్నట్లు సిఎం కేసీఆర్ చెప్పారు. జిఎంఆర్, హెచ్‌ఎండిఏ రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంతో ప్రభుత్వ నిధులతోనే శంషాబాద్ ఎయిర్ పోర్ట్ మెట్రో నిర్మాణం చేపట్టినట్లు కేసీఆర్ చెప్పారు.
దేశ రాజధాని ఢిల్లీ కంటే వైశాల్యంలో పెద్దదిగా ఉండేదని, భాగ్య నగరానికి 1912లో విద్యుత్ సదుపాయం వచ్చిందని, మద్రాసు నగరానికి 1927లో విద్యుత్ వచ్చిందని గుర్తు చేశారు. అన్ని రకాల మతాలు, జాతులు, కులాలకు ఆశ్రయమిచ్చిన కాస్మోపాలిటిన్ చరిత్ర భాగ్యనగరానికి ఉందని సిఎం చెప్పారు. చరిత్రలో హైదరాబాద్ గొప్పదని, వర్తమానంలో అంతకంటే గొప్పగా నిలిచేలా అభివృద్ధి చేస్తామని చెప్పారు. దేశంలో ఏ నగరంలో లేని సమశీతల వాతావరణం హైదరాబాద్‌లో ఉందన్నారు. అన్ని భాషలు, సంస్కృతులు కలిగిన ప్రజలు హైదరాబాద్‌లో స్థిర నివాసాలు ఏర్పాటు చేసుకున్నారన్నారు.
ఆంధ్రప్రదేశ్‌రాష్ట్రంలో సమైక్య పాలకుల నిర్లక్ష్యం వల్ల బాధలు అనుభవించినట్లు సిఎం కేసీఆర్ చెప్పారు. కరెంటు ఇవ్వలేకపోతే వేరే రాష్ట్రాలకు వెళ్లిపోతామని పారిశ్రామికవేత్తలు ధర్నాలు చేసిన పరిస్థితి నుంచి ఇప్పుడు పుష్కలంగా లభించే స్థాయికి ఎదిగామన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో కుత్బుల్లాపూర్, శేరిలింగంపల్లి, రాజేంద్రనగర్ వంటి ప్రాంతాల్లో మంచినీరు కూడా లేక ప్రజలు ఎన్నో బాధలు పడ్డారన్నారు. ఇప్పుడు నగరంలో 24 గంటలు కరెంటు పోని పరిస్థితికి తెచ్చామన్నారు.
దేశంలో హైదరాబాద్ నగరాన్ని పవర్ ఐలాండ్‌గా మార్చామని కేసీఆర్ చెప్పారు. న్యూయార్క్, పారిస్, లండన్‌లలో కరెంటు పోవచ్చేమో కాని హైదరాబాద్‌లో మాత్రం కరెంటు పోయే పరిస్థితి ఉండదని కేసీఆర్ చెప్పారు. 500గొప్ప పరిశ్రమలు హైదరాబాద్‌లో కొలువు దీరుతున్నాయని చెప్పారు. ట్రాఫిక్ కష్టాలను తీర్చుకుంటూ ముందుకెళ్తున్నామని చెప్పారు.
ఆఫీస్ స్పేస్, రియల్ ఎస్టేట్ రంగంలో నిబంధనలు సడలించడం ద్వారా పెద్ద ఎత్తున పెట్టుబడులను హైదరాబాద్ నగరాన్ని ఆకర్షిస్తున్నట్లు సిఎం కేసీఆర్ చెప్పారు. హైదరాబాద్ విమానాశ్రయంలో రెండో రన్ వే ఏర్పాటవుతోందని, ఎయిర్ పోర్ట్ కనెక్టివిటీ కోసం రూ.6250కోట్లతో మెట్రోను విస్తరిస్తున్నట్లు చెప్పారు.
శంషాబాద్ ప్రాంతంలో పేదల ఆధీనంలో భూముల సమస్యను పరిష్కరిస్తానని కేసీఆర్ హామీ ఇచ్చారు. హైదరాబాద్ మెట్రోలో నాలుగున్నర లక్షల మంది రోజూ ప్రయాణిస్తున్నారని చెప్పారు. ప్రపంచంలో కాలుష్యరహితమైన ట్రాఫిక్ రద్దీ నియంత్రించే ఏకైక మార్గం మెట్రో మాత్రమే అని చెప్పారు. హైదరాబాద్ చుట్టూ మెట్రో విస్తరించాలన్నారు. కేంద్రం సహకారం ఉన్నా లేకున్నా అన్ని ప్రాంతాలకు మెట్రోను విస్తరిస్తామని చెప్పారు. బిహెచ్‌ఈఎల్ ప్రాంతానికి మెట్రో సదుపాయాలను సొంతంగానే విస్తరించేందుకు ప్రయత్నిస్తామని చెప్పారు. మౌలిక సదుపాయల కల్పన కోసం ఎంత ఖర్చైనా వెనుకాడమని చెప్పారు. ప్రపంచమే అబ్బురపడేలా హైదరాబాద్‌ను తీర్చిదిద్దాలన్నారు.
భూమ్మీద ఉష్ణోగ్రతలు పెరిగిపోతున్నాయని, ఉష్ణోగ్రతలు తగ్గించేలా ప్రజలు కృషిచేయాలన్నారు. ఏటా లక్షల సంఖ్యలో హైదరాబాద్ జనాభా పెరుగుతోందని, దానికి తగ్గట్టుగా మౌలిక సదుపాయాలు, మురుగు నీటిపారుదల సదుపాయం కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. ప్రజల అవసరాలకు అనుగుణంగా ఎప్పటికప్పుడు ప్రణాళికలు సిద్దం చేయాలని సూచించారు. హైదరాబాద్‌లో ఏ మూల నుంచైనా 25నిమిషాల్లోనే ఎయిర్ పోర్ట్ చేరుకోవచ్చన్నారు.
మెట్రో నిర్మాణానికి సంబంధించి హెచ్‌ఎండిఏ వాటాగా కమిషనర్ అరవింద్ కుమార్ రూ.625కోట్ల రుపాయలను ముఖ్యమంత్రికి అందచేశారు. జిఎంఆర్ సంస్థ భాగస్వామ్య నిధులను కూడా ముఖ్యమంత్రికి సంస్థ ప్రతినిధులు అందచేశారు.