Hyderabad Metro Parking : పెయిడ్ పార్కింగ్ నిర్ణయం వాయిదా..! ఎల్‌అండ్‌టీ మరో ప్రకటన-hyderabad metro key statement on paid parking at nagole and miyapur ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Hyderabad Metro Parking : పెయిడ్ పార్కింగ్ నిర్ణయం వాయిదా..! ఎల్‌అండ్‌టీ మరో ప్రకటన

Hyderabad Metro Parking : పెయిడ్ పార్కింగ్ నిర్ణయం వాయిదా..! ఎల్‌అండ్‌టీ మరో ప్రకటన

Maheshwaram Mahendra Chary HT Telugu
Aug 24, 2024 11:41 AM IST

ఉచిత పార్కింగ్ విషయంపై ప్రయాణికులకు హైదరాబాద్ మెట్రో మరోసారి కీలక అప్డేట్ ఇచ్చింది. నాగోల్‌, మియాపూర్‌ మెట్రో రైలు డిపోల వద్ద పెయిడ్ పార్కింగ్ నిర్ణయాన్ని వాయిదా వేసింది. తదుపరి ఆదేశాలు వచ్చే వరకు ఈ నిర్ణయం అమల్లో ఉంటుందని తెలిపింది.

ప్రయాణికులకు హైదరాబాద్ మెట్రో అలర్ట్
ప్రయాణికులకు హైదరాబాద్ మెట్రో అలర్ట్

హైదరాబాద్ మెట్రో కీలక అప్డేట్ ఇచ్చింది. నాగోల్‌, మియాపూర్‌ మెట్రో రైలు డిపో పెయిడ్ పార్కింగ్ నిర్ణయాన్ని వాయిదా వేసింది. ఈ మేరకు శనివారం ఓ ప్రకటన విడుదల చేసింది. తదుపరి ఆదేశాలు వచ్చే వరకు ఈ నిర్ణయం అమల్లో ఉంటుందని ప్రకటించింది. పెయిడ్ పార్కింగ్ విషయంలో ప్రయాణికుల సమస్యలను మరింత మెరుగుపరచటంతో పాటు సజావుగా అమలు చేసేందుకు వాయిదా వేసినట్లు వెల్లడించింది.

ముందుగా నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం… ఆగస్టు 25వ తేదీ నుంచి నాగోల్‌ వద్ద ఉన్న మెట్రో పార్కింగ్ లో ఫీజును వసూలు చేయనున్నట్లు మెట్రో యాజమాన్యం ప్రకటించింది. ఇక సెప్టెంబర్‌ 1 నుంచి మియాపూర్‌ మెట్రో పార్కింగ్‌ లాట్‌లో పార్కింగ్‌ ఫీజు నిర్ణయం అమల్లోకి వస్తుందని వెల్లడించింది.

మెరుగైన సౌకర్యాలతో పాటు పార్కింగ్ ప్రాంతాల్లో బయో-టాయ్‌లెట్లు కూడా ఏర్పాటు చేస్తామని తెలిపింది. వాహనాల భద్రతకు కావాల్సిన అన్ని చర్యలు తీసుకుంటామని పేర్కొంది. అయితే నిర్ణయించిన ఈ తేదీలను వాయిదా వేస్తున్నట్లు శనివారం ఓ ప్రకటనను విడుదల చేసింది. దీంతో తదుపరి ఆదేశాలు వచ్చే వరకు ఉచిత పార్కింగ్ విధానమే కొనసాగే అవకాశం ఉంది.

ధరల బోర్డు ఏర్పాటు…

నాగోల్ మెట్రో స్టేషన్ వద్ద పెయిడ్ పార్కింగ్ ధరలను సూచిస్తూ ఇటీవలే ఓ బోర్డును కూడా ఏర్పాటు చేశారు. దీని ప్రకారం… బైకును మినిమం 2 గంటల వరకు పార్క్ చేస్తే రూ.10 చెల్లించాల్సి ఉంటుంది. 8 గంటల వరకు పార్కింగ్ చేస్తే రూ.25, 12 గంటల వరకు రూ.40 కట్టాలి. అలాగే కార్లకు మినిమం 2 గంటల వరకు పార్క్ చేస్తే రూ.30 చెల్లించాలి. అదే 8 గంటల వరకు రూ.75, 12 గంటల వరకు అయితే రూ.120 చొప్పున ధరలను నిర్ణయించారు.

ఇటీవలే ప్రతిరోజూ మాదిరిగానే చాలా మంది వాహనదారులు నాగోల్ మెట్రో స్టేషన్ వద్దకు వచ్చారు. ఈ క్రమంలో నిర్వాహకులు ఫీజు గురించి ప్రస్తావించగా…. చాలా మంది వాహనాదారులకు విషయం అర్థం కాలేదు. ఉచిత పార్కింగ్ సౌకర్యం ఉంది కదా అంటూ ప్రశ్నలు సంధించారు. చాలా సేపు వాహనదారులకు, నిర్వాహకులకు మధ్య ఘర్షణ చెలరేగింది. ఇందుకు సంబంధించి అనేక వార్తలు వార్తలు కూడా సర్క్యూలేట్ అయ్యాయి.

పార్కింగ్ విషయంలో తలెత్తిన గందరగోళానికి చెక్ పెడుతూ…మెట్రో యాజమాన్యం కూడా ప్రకటన చేసింది. నాగోల్, మియాపూర్ స్టేషన్ల వద్ద పార్కింగ్ ఫీజును వసూలు చేస్తామని తెలిపింది. తేదీలను కూడా వెల్లడించింది.

టాపిక్