Governor On TSRTC Bill : టీఎస్ఆర్టీఎస్ బిల్లు వ్యవహారం మళ్లీ మొదటికి, మరిన్ని వివరణలు కోరిన గవర్నర్
Governor On TSRTC Bill : టీఎస్ఆర్టీసీ బిల్లుపై రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన వివరణలపై గవర్నర్ తమిళి సై సంతృప్తి చెందినట్లు కనిపించడంలేదు. ఈ బిల్లుపై మరిన్ని సందేహాలు లేవనెత్తిన గవర్నర్ మళ్లీ ప్రభుత్వ వివరణ కోరారు.
Governor On TSRTC Bill : టీఎస్ఆర్టీసీ బిల్లుపై గవర్నర్ తమిళి సై సౌందరరాజన్ మరిన్ని వివరణలు కోరారు. శనివారం ఉదయం రాష్ట్ర ప్రభుత్వం పంపిన బిల్లుపై గవర్నర్ వివరణలు కోరారు. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం స్పందిస్తూ... గవర్నర్ ఐదు అభ్యంతరాలపై వివరణ ఇచ్చింది. అయితే ఈ సమాధానాలపై సంతృప్తి చెందని గవర్నర్ మరిన్ని సందేహాలు వ్యక్తం చేశారు. దీంతో బిల్లు వ్యవహారం మళ్లీ మొదటికి వచ్చింది. ఇటీవల కేబినెట్ సమావేశంలో ఆర్టీసీ విలీనంపై ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. వర్షకాల సమావేశాల్లో బిల్లు అసెంబ్లీ ప్రవేశపెట్టి ఆమోదం తెలపాలని రాష్ట్ర ప్రభుత్వం భావించింది. అయితే ఈ బిల్లుపై గవర్నర్ వివరణ కోరడంతో ప్రభుత్వం, రాజ్ భవన్ మధ్య మళ్లీ వివాదం నెలకొంది. ఆర్టీసీ బిల్లుపై గవర్నర్ సంతకం చేయాలని టీఎస్ఆర్టీసీ కార్మికులు ఇవాళ ఉదయం రాజ్‌భవన్ ను ముట్టడించారు. దీంతో కొంతమంది కార్మిక సంఘాల నేతలతో గవర్నర్ వీడియో కాన్ఫరెన్స్ లో మాట్లాడారు. తానెందుకు బిల్లుకు ఆమోదం తెలపలేదో గవర్నర్ వివరించారు. గవర్నర్ అడిగిన అన్ని అంశాలపై వివరణ ఇచ్చామని, ఆర్టీసీ బిల్లును శాసనసభలో ప్రవేశపెట్టేందుకు అనుమతి ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం కోరింది. అయితే ప్రభుత్వం ఇచ్చిన వివరణతో సంతృప్తి చెందని గవర్నర్ ...ఆర్టీసీ బిల్లుపై మరిన్ని సందేహాలు లేవనెత్తారు. మరో వైపు రేపటితో అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు ముగియనున్నాయి. ఈ నేపథ్యంలో ఆర్టీసీ బిల్లుకు ఆమోదం లభిస్తుందా? లేదా? అని ఆర్టీసీ కార్మికులు ఆందోళన చెందుతున్నారు.
ఉద్యోగులతో వర్చువల్ గా మాట్లాడిన గవర్నర్
అంతకు ముందు టీఎస్ఆర్టీసీ ఉద్యోగుల సంఘం ప్రతినిధులతో గవర్నర్ వర్చువల్ గా మాట్లాడారు. 43,373 మంది ఉద్యోగుల భవిష్యత్తు గురించి గవర్నర్ ఆందోళన వ్యక్తం చేశారు. గతంలో మాదిరిగానే టీఎస్ఆర్టీసీ ప్రయోజనాలను ఎల్లప్పుడూ పరిరక్షిస్తామని హామీ ఇచ్చారు. ప్రభుత్వం నా ప్రశ్నలకు స్పష్టత ఇవ్వకముందే ఆర్టీసీ కార్మికులు చేస్తున్న సమ్మె గురించి తెలిసి బాధపడ్డానన్నారు. ఈ సమ్మె వల్ల ఉద్యోగులందరిపై ఒత్తిడితో పాటు సామాన్య ప్రజానీకానికి అసౌకర్యం కలిగిందన్నారు. ఆర్టీసీ కార్మికుల సంక్షేమానికి తానెప్పుడూ అండగా ఉంటానని స్పష్టం చేశారు. ఆర్టీసీ గత సమ్మె సమయంలో రాత్రి 11 గంటలకు కూడా మీ సమస్యలను విన్నానని, మీ సమస్యలు వినడానికి రాజ్ భవన్ కు ఆహ్వానించానని గుర్తుచేశారు. బిల్లు ప్రవేశపెట్టడానికి ఆమోదం నిలిపివేయడంలో వ్యక్తిగత లేదా ఇతర రాజకీయ ప్రయోజనాలు లేవన్నారు.
ఉద్యోగులు బిల్లును క్షుణ్ణంగా అధ్యయనం చేయాలి
"ఇప్పుడు కూడా నేను మీ అందరితో ఉన్నాను, విస్తృత ప్రజా ప్రయోజనాల దృష్ట్యా ఆర్టీసీ ఉద్యోగులు, సంస్థ ప్రయోజనాలను పరిరక్షించడమే నా ఏకైక ధ్యేయం. పెండింగ్ లో ఉన్న పీఆర్సీలు, ఈపీఎఫ్, గ్రాట్యుటీ, లీవ్ ఎన్క్యాష్మెంట్ బకాయిలపై ఆందోళన చెందుతున్నట్లు గవర్నర్ ఉద్యోగులకు తెలియజేశారు. రిటైర్డ్ ఉద్యోగులంతా ఇబ్బందులు పడుతూ వినతిపత్రాలు పంపుతున్నారు. తీసుకున్న కోట్లాది ఉద్యోగుల సంక్షేమ సహకార సంఘం సొమ్మును ప్రభుత్వం ఇంకా తిరిగి ఇవ్వలేదు. తాను పూర్తిగా ఆర్టీసీ కార్మికులకు అనుకూలమని, నిజంగా వారికి మేలు జరిగితే వారికి పూర్తిగా అనుకూలంగా ఉన్నానని, భవిష్యత్తులో ఉద్యోగుల ప్రయోజనాలు పూర్తిగా పరిరక్షించాలని కోరుకుంటున్నానని చెప్పారు. ఆర్టీసీ ఉద్యోగులు, రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా ముసాయిదా బిల్లులోని 5 అంశాలపై స్పష్టత కోరుతూ రాజ్ భవన్ సచివాలయం ప్రభుత్వానికి లేఖ రాసినట్లు తెలిపారు. ఈ బిల్లును అకారణంగా ప్రవేశపెట్టకూడదని, నిబంధనలపై సమగ్రంగా చర్చించేందుకు సంబంధిత పార్టీలకు తగినంత సమయం ఇవ్వాలి. ఒక రాజ్యాంగ అధిపతిగా, రాజ్యాంగ నిబంధనలను ధృవీకరించి, ప్రజలతో పాటు ఉద్యోగుల విస్తృత ప్రయోజనాలను పరిరక్షించాలని నాకు హామీ ఇవ్వాలి. అందువల్ల ఎత్తిచూపిన 5 అంశాలపై న్యాయ సలహా వివరణలను కోరారు. ఉద్యోగులు, సంబంధిత పక్షాలన్నీ బిల్లును క్షుణ్ణంగా అధ్యయనం చేయాలని విజ్ఞప్తి చేస్తున్నాను." - గవర్నర్ తమిళి సై
బెదిరించి సమ్మెకు పిలుపునిచ్చారు- ఆర్టీసీ జేఏసీ ప్రతినిధి
ప్రభుత్వం నుంచి సమాధానం రాగానే.. ఉద్యోగుల ప్రయోజనాలను పరిరక్షించడానికి బిల్లుపై తగిన చర్యలు తీసుకుంటానని గవర్నర్ తెలిపారు. ఉద్యోగ సంఘాలు సమ్మెకు పిలుపునివ్వలేదని వీడియో కాన్ఫరెన్స్ లో జేఏసీ ప్రతినిధులు ఒకరు గవర్నర్ కు తెలిపారు. ఇది పూర్తిగా ప్రభుత్వ ప్రాయోజిత, బలవంతపు సమ్మె అన్నారు. మహిళా ఉద్యోగులను కూడా వదలడం లేదన్నారు. మమ్మల్ని బెదిరించి సమ్మెకు పిలుపునిచ్చి రాజ్ భవన్ ముట్టడి కార్యక్రమాన్ని నిర్వహించాలని బలవంతం చేశారన్నారు. కొందరు ఎమ్మెల్యేలు, ఒక మంత్రి ఉద్యోగులకు కోపం తెప్పించడానికి, ప్రజల మనోభావాలను దెబ్బతీసేందుకు ఈ ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించారన్నారు.