Uppal Cricket Stadium : రేపటి నుంచి వన్డే వరల్డ్ కప్, ఉప్పల్ స్టేడియంలో సీట్లు ఇలా!
Uppal Cricket Stadium : రేపటి నుంచి వన్డే క్రికెట్ ప్రపంచ కప్ మ్యాచ్ లు ప్రారంభం కానున్నాయి. అయితే హైదరాబాద్ ఉప్పల్ క్రికెట్ స్టేడియంలో కుర్చీలు చూసి అభిమానులు షాకవుతున్నారు. వేల రూపాయలు పెట్టి టికెట్లు కొనుకుంటే కనీసం కూర్చొనేందుకు సీట్లు కూడా శుభ్రం చేయరా? అని మండిపడుతున్నారు.
Uppal Cricket Stadium : భారత్ వేదికగా జరగబోయే ప్రపంచ కప్ రేపటి నుండి ప్రారంభం కానుంది. ఈ మెగా టోర్నీకి బీసీసీఐ దేశంలో మొత్తం 10 స్టేడియాలను సిద్ధం చేసి ఆయా స్టేడియాల మరమ్ముతలకు, అభివృద్ధికి పెద్ద మొత్తంలో డబ్బు కేటాయించింది. అందులో హైదరాబాద్ ఉప్పల్ రాజీవ్ గాంధీ స్టేడియం కూడా ఉంది. అయితే గతేడాది బీసీసీఐ ఉప్పల్ స్టేడియం అభివృద్ధి, మరమ్మతులకు రూ.119 కోట్లు కేటాయించగా స్టేడియంలోని పరిస్థితి మాత్రం మారలేదు అంటున్నారు క్రికెట్ అభిమానాలు.
అపరిశుభ్రంగా కుర్చీలు
అక్టోబర్ 3న పాకిస్తాన్-ఆస్ట్రేలియా జట్ల మధ్య వార్మప్ మ్యాచ్ ఉప్పల్ స్టేడియంలో జరిగింది. ఈ మ్యాచ్ ను చూసేందుకు వెళ్లిన అభిమానాలకు మాత్రం నిరాశే మిగిలింది. స్టేడియంలో కూర్చునేందుకు ఏర్పాటు చేసిన కుర్చీలు అన్నీ అపరిశుభ్రంగా ఉండడంతో మ్యాచ్ అంతా నిలబడే వీక్షించారు అభిమానాలు గత సంవత్సరంతో పోలిస్తే చాలా వరకు స్టేడియంలో అభివృద్ధి కనిపించినా కూర్చునే సీట్ల విషయంలో మాత్రం హైదరాబద్ క్రికెట్ అసోసియేషన్ అశ్రద్ధ చేసింది అంటున్నారు క్రికెట్ అభిమానాలు.
వీడియోలు వైరల్
క్రికెట్ విశ్లేషకుడు వెంకటేష్, ఇతర క్రికెట్ అభిమానాలు అపరిశుభ్రంగా ఉన్న కుర్చీల ఫోటోలు, వీడియోలు సామాజిక మాధ్యమాల్లో పెట్టడంతో అవి వైరల్ అయ్యాయి. బీసీసీఐ కేటాయించిన రూ.119 కోట్లు ఎక్కడికి పోయాయి హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఏం చేస్తుంది? మ్యాచ్ చూసేందుకు వేల రూపాయలు ఖర్చు చేసి స్టేడియానికి వస్తే కనీసం కూర్చునే కుర్చీలు పరిశుభ్రంగా ఉంచలేరా అని ఫ్యాన్స్ మండిపడ్డారు. అయితే గతంలో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ అజారుద్దిన్ పై అనేక అవినీతి ఆరోపణలు రావడంతో ఇటీవలే సుప్రీం కోర్టు హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ను పూర్తిగా రద్దు చేసి జస్టిస్ నాగేశ్వర్ రావు నేతృత్వంలో సింగిల్ మెంబర్ కమిటీని నియమించింది. అప్పటి నుండి స్టేడియం వ్యవహారాలు అన్నీ జస్టిస్ నాగేశ్వర్ రావు ఆదేశాల మేరకు కొనసాగుతున్నాయి.