CM KCR : వారం రోజులుగా సీఎం కేసీఆర్ కు వైరల్ ఫీవర్, ఇంట్లోనే చికిత్స అందిస్తున్న వైద్యులు
CM KCR : సీఎం కేసీఆర్ వారం రోజులుగా వైరల్ ఫీవర్ తో బాధపడుతున్నట్లు మంత్రి కేటీఆర్ తెలిపారు. వైద్యుల బృందం సీఎంకు ఇంట్లోనే చికిత్స అందిస్తున్నట్లు చెప్పారు.
CM KCR : సీఎం కేసీఆర్ వైరల్ ఫీవర్ తో బాధపడుతున్నట్లు మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు. వారం రోజులగా సీఎం కేసీఆర్ వైరల్ ఫీవర్, దగ్గుతో బాధపడుతున్నట్లు వెల్లడించారు. వైద్యుల బృందం ఆయనకు ఇంట్లోనే చికిత్స చేస్తున్నారని తెలిపారు. వైద్యులు సీఎంను నిత్యం పర్యవేక్షిస్తున్నట్లు చెప్పారు. కొన్ని రోజుల్లోనే సీఎం కేసీఆర్ కోలుకుంటారని మంత్రి కేటీఆర్ తెలిపారు.
హైదరాబాద్ ను వణికిస్తున్న ఫీవర్స్
హైదరాబాద్ వాసులను వైరల్ ఫీవర్స్ వణికిస్తున్నాయి. గత కొద్దిరోజులుగా ఉస్మానియా, గాంధీ, ఫీవర్, నిమ్స్ తో పాటు నగరంలోని పలు ఆస్పత్రులకు జ్వరాలతో జనం క్యూకట్టారు. ఏ ఇంట్లో చూసిన ఎవరో ఒకరు వైరల్ ఫీవర్తో బాధపడుతున్నారు. మురికివాడలు, బస్తీల్లో జ్వరాల బాధితులు సంఖ్య ఎక్కువగా ఉందని తెలుస్తోంది. జలుబు, దగ్గు, ఫీవర్, ఫుడ్ పాయిజన్, వాంతులు, ఒళ్లు నొప్పులు ఇలా పలు అనారోగ్య కారణాలతో ప్రజలు ఆస్పత్రుల్లో చేరుకున్నారు. నెల రోజుల క్రితం వరకు ఫీవర్ ఆస్పత్రిలో రోజుకు 300 ఓపీలు వస్తే.. ప్రస్తుతం రోజుకు 600 నుంచి 800 ఓపీలు వస్తున్నాయని వైద్యులు తెలిపారు. వీటిలో ఎక్కువ శాతం వైరల్ ఫీవర్ రోగులే ఉంటున్నారని చెబుతున్నారు. జ్వరాలతో ఆసుపత్రులో చేరే వారి సంఖ్య రోజుకు 70 నుంచి 140కి పెరిగిందన్నారు. డెంగీ, మలేరియా కేసులు కూడా వస్తున్నాయని వైద్యులు పేర్కొన్నారు. ప్రజలు తమ పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని, వ్యక్తి గత శుభ్రం పాటించాలని వైద్యులు సూచిస్తున్నారు.
రోజు రోజుకూ పెరుగుతున్న వైరల్ ఫీవర్స్ కేసులు
ఇటీవల వర్షాలు, వాతావరణంలో మార్పులతో వైరల్ ఫీవర్లు పెరుగుతున్నాయని వైద్యులు అంటున్నారు. ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు. ఉస్మానియా, గాంధీ ఆసుపత్రుల్లో కూడా వైరల్ ఫీవర్లతో రోగులు చేరుతున్నారు. ఉస్మానియాలో రోజుకు దాదాపు 400 కేసులు రాగా, గాంధీలో 300కు పైగా వైరల్ ఫీవర్ కేసులు వచ్చాయని తెలుస్తోంది. రాష్ట్రంలో విష జ్వరాలతో పాటు డెంగీ ప్రమాదకర స్థాయిలో వ్యాప్తి చెందుతోందని వైద్యులు అంటున్నారు. సాధారణ విష జ్వరంగానే భావిస్తూ సాధారణ చికిత్సతో తీసుకోవడంతో నాలుగైదు రోజుల జ్వరం తీవ్రత పెరిగి రోగులు తీవ్ర అనారోగ్యం బారిన పడుతున్న పరిస్థితులు నెలకొన్నాయని వైద్యులు తెలిపారు. రోజుల తరబడి తీవ్ర జ్వరంతో ఆసుపత్రులకు వస్తున్న రోగులకు డెంగీ అని తేలడంతో వైద్యులు వారిని కాపాడేందుకు తీవ్రంగా శ్రమించాల్సి వస్తోంది. మూడు రోజులకు మించి జ్వరం ఉంటే సాధారణ జ్వరమేనని నిర్లక్ష్యం చేయొద్దని వైరాలజీ వైద్యులు హెచ్చరిస్తున్నారు.
3 వేల డెంగీ కేసులు
రాష్ట్రంలో ఇప్పటి వరకూ 3 వేల డెంగీ కేసులు నమోదు కాగా అందులో 1600 కేసుల దాకా ఒక్క హైదరాబాద్‌లో నమోదైనట్లు తెలుస్తోంది. ఆగస్టు నెల నుంచి రాష్ట్రంలో డెంగీ కేసులు పెరుగుతున్నాయని వైద్యులు అంటున్నారు. ఒక్క ఆగస్టులో నెలలోనే డెంగీ కేసులు పదిరెట్ల మేర అధికంగా పెరిగాయని, పరిస్థితి ప్రమాదకరస్థాయిలో ఉందని ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు.