ganesh chaturthi 2024 : గణపతి భక్తులకు గుడ్‌న్యూస్.. హుస్సేన్‌సాగర్‌లో వినాయక నిమజ్జనానికి హైకోర్ట్ గ్రీన్ సిగ్నల్
ganesh chaturthi 2024 : హైదరాబాద్‌లోని హుస్సేన్ సాగర్‌లో వినాయక నిమజ్జనంపై ఇప్పటివరకు గందరగోళం నెలకొంది. కానీ.. ఆ పరిస్థితికి తెలంగాణ హైకోర్టు చెక్ పెట్టింది. హుస్సేన్‌సాగర్‌లో వినాయక నిమజ్జనానికి హైకోర్ట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీనిపై గణపయ్య భక్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
హైదరాబాద్‌లోని గణేష్ ఉత్సవ కమిటీలకు తెలంగాణ హైకోర్టు గుడ్ న్యూస్ చెప్పింది. హుస్సేన్‌సాగర్‌లో వినాయక నిమజ్జనానికి హైకోర్ట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ ఏడాది కూడా హుస్సేన్ సాగర్‌లోనే గణపతి విగ్రహాలను నిమజ్జనం చేసుకోవడానికి అనుమతించింది. గతంలో కోర్టు ఇచ్చిన ఆదేశాలు పాటించాలని ప్రభుత్వానికి సూచించింది. నిమజ్జనం చివరి సమయంలో ధిక్కరణ పిటిషన్ సరికాదని ఉన్నత న్యాయస్థానం అభిప్రాయపడింది.
జీహెచ్ఎంసీ బ్యానర్..
హైదరాబాద్‌లోని హుస్సేన్‌సాగర్ దగ్గర మంగళవారం ఉదయం పోలీసులు, జీహెచ్ఎంసీ అధికారులు బ్యానర్లు ఏర్పాటు చేశారు. గణేష్ నిమజ్జనాలకు అనుమతి లేదంటూ బ్యానర్లు కట్టారు. హైకోర్టు ఆదేశాల మేరకే బ్యానర్లు కట్టామని జీహెచ్ఎంసీ అధికారులు వెల్లడించారు. హుస్సేన్‌సాగర్ చుట్టూ బారికేడ్లు ఏర్పాటు చేశారు. అయితే.. మంగళవారం సాయంత్రం తెలంగాణ హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో నిమజ్జనానికి ఏర్పాట్లు చేస్తున్నారు.
రాజాసింగ్ హాట్ కామెంట్స్..
ట్యాంక్‌బండ్‌లో గణేష్ నిమజ్జనం నిషేధం అంటూ వెలసిన పోస్టర్లపై ఘాటుగా స్పందించారు బీజేపీ నేత రాజాసింగ్. హుస్సేన్ సాగర్‌లో కొత్తగా కలుషితం అయ్యేది ఏముందని ప్రశ్నించారు. ఇప్పటికే అది కలుషిత నీరు అని స్పష్టం చేశారు. ట్యాంక్ బాండ్‌లో వద్దు అంటే.. మరి ఎక్కడ నిమజ్జనం చెయ్యాలో చెప్పాలని డిమాండ్ చేశారు. రాజాసింగ్ ఈ వ్యాఖ్యలు చేసిన కాసేపటికే నిమజ్జనాన్ని నిషేధించలేం అని హైకోర్టు స్పష్టం చేసింది.
నిమజ్జనం అంటే అక్కడే..
హైదరాబాద్ వాసులకు గణేష్ నిమజ్జనం అంటే హుస్సేన్ సాగరే గుర్తుకొస్తుంది. నగరంలో ఖైరతాబాద్ గణపతి నుంచీ.. గల్లీలోని బుల్లి గణపతుల వరకూ.. అన్నింటినీ ట్యాంక్‌బండ్ దగ్గరే ప్రతి ఏటా నిమజ్జనం చేస్తారు. దీంతో అక్కడ సందడి వాతావరణం కనిపిస్తుంది. గణపతి నిమజ్జనాన్ని చూసేందుకు తెలంగాణ ప్రజలే కాకుండా.. ఏపీ, మహారాష్ట్ర నుంచి కూడా భక్తులు వస్తారు. ఆ రద్దీకి తగ్గట్టు పోలీసులు ఏర్పాట్లు చేసేవారు. కానీ.. ఈ ఏడాదే కాస్త గందరగోళ పరిస్థితి నెలకొంది. తాజాగా తెలంగాణ హైకోర్టు ఆ గందరగోళానికి బ్రేక్ వేసింది.