Karimnagar Rains: కరీంనగర్ జిల్లాలో జోరు వానలు.. పిడుగు పాటుకు రైతు మృతి, రైతులకు భారీగా పంట నష్టం
Karimnagar Rains: అల్పపీడన ప్రభావంతో ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో జోరు వాన కురుస్తుంది. ఉరుములు మెరుపులతో పిడుగుల వర్షం కురిసింది. పిడుగుపాటు హుజురాబాద్ మండలం పోతిరెడ్డిపేటలో పంట పొలంలోనే రైతు కంకణాల కృష్ణకుమార్ (30) ప్రాణాలు కోల్పోయారు.
Karimnagar Rains: ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా ఓ మోస్తారు నుంచి భారీ వర్షం కురిసింది. గాలివాన పిడుగుల వర్షం హుజురాబాద్ మండలం పోతిరెడ్డిపేటలో రైతు కుటుంబంలో విషాదాన్ని మిగిల్చింది. గ్రామానికి చెందిన రైతు కంకణాల కృష్ణకుమార్ (30) పశువులను మేత కోసం గ్రామ శివారులోని పంటపొలాల్లోకి తీసుకెళ్ళాడు.
ఉరుములు మెరుపులతో కూడిన పిడుగుల వాన పడడంతో పిడుగుపాటు కు కృష్ణకుమార్ గురయ్యాడు. తీవ్రగాయాలతో అక్కడికక్కడే మృతి చెందాడు. పశువులు మేత మేసి సాయంత్రం ఇంటికి వెళ్ళగా అతని భార్య మౌనిక తండ్రి కంకణాల సమ్మయ్య కృష్ణ కుమార్ సెల్ ఫోన్ చేయగా పనిచేయకపోవడంతో పశువులను తీసుకువెళ్లిన చోటును వెతుక్కుంటూ వెళ్లారు.
అక్కడ కృష్ణకుమార్ పిడుగుపాటుతో కాలిన గాయాలతో మృతి చెంది ఉండడం కనిపించడంతో గుండెలవిసేలా రోదించారు. మృతుని తండ్రి సమ్మయ్య గ్రామంలో సుంకరిగా పని చేస్తుండగా కృష్ణకుమార్ తనకున్న భూమిలో వ్యవసాయం చేస్తున్నాడు. కృష్ణకుమార్ కు భార్య మౌనికతో పాటు ఆరు సంవత్సరాల కుమారుడు ఉన్నారు. యువరైతు కృష్ణ కుమార్ మృతితో గ్రామంలో విషాదం అలుముకుంది.
నేలకొరిగిన వరి పంట..
గాలి వాన అన్నదాతలను నిండా ముంచ్చింది. వానతో పాటు గాలికి వరి మొక్కజొన్న పంటలు నేలకొరిగాయి. వరి గింజ కట్టే దశలో ఉండడంతో గాలికి నెలకొనడంతో అన్నదాతలు ఆవేదనతో ఆందోళన చెందుతున్నారు. తిమ్మాపూర్, చిగురుమామిడి మండలాల్లో పంటలు బాగా దెబ్బ తిన్నాయి. ఈనెల మొదటి వారంలో కురిసిన వర్షంతో పంటలు నీటమునిగి కొంత దెబ్బతినగా ప్రస్తుతం కురిసిన వర్షంతో నేలకొరకడంతో పెట్టిన పెట్టుబడి కూడా వచ్చే పరిస్థితి లేదని అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. ప్రభుత్వం ఆదుకోవాలని వేడుకుంటున్నారు.
అధికారులు అలెర్ట్…
వర్షాలు మరో రెండు రోజులపాటు ఉన్నాయని వాతావరణ శాఖ హెచ్చరించడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. ఉరుములు మెరుపులతో పిడుగులు పడే అవకాశం ఉండడంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరారు. వర్షం పడేటప్పుడు బయట తిరగవద్దని చెట్ల కింద ఉండవద్దని కోరారు. గాలివానతో కరెంటు వైర్లతో ప్రమాదం పొంచి ఉంటుందని హెచ్చరించారు. అటు జలాశయాల్లోకి వరద కొనసాగుతుండడంతో లోతట్టు ప్రాంత ప్రజల అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
(రిపోర్టింగ్ కె వి రెడ్డి ఉమ్మడి కరీంనగర్ జిల్లా కరస్పాండెంట్ హిందుస్థాన్ టైమ్స్ తెలుగు)