Rains in Adilabad : ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో భారీ వర్షాలు - నిండుకుండలా 'కడెం' ప్రాజెక్ట్-heavy rains in adilabad district ,తెలంగాణ న్యూస్
Telugu News  /  Telangana  /  Heavy Rains In Adilabad District

Rains in Adilabad : ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో భారీ వర్షాలు - నిండుకుండలా 'కడెం' ప్రాజెక్ట్

HT Telugu Desk HT Telugu
Sep 28, 2023 05:17 PM IST

Telangana Rains : కొద్దిరోజులుగా తెలంగాణ వ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నాయి. ఈ ప్రభావం ఉత్తర తెలంగాణలోని ఆదిలాబాద్ జిల్లాలో మరింత ఎక్కువగా ఉంది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా గురువారం భారీ వర్షం కురిసింది.

తెలంగాణలో వర్షాలు
తెలంగాణలో వర్షాలు

Telangana Rains : ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా గురువారం భారీ వర్షం కురిసింది. గత వారం రోజులుగా జిల్లాలోని కొమరం భీమ్ జిల్లా, మంచిర్యాల, నిర్మల్, అదిలాబాద్ జిల్లాలో అక్కడక్కడ వర్షం కురుస్తూనే ఉంది, వాతావరణ శాఖ హెచ్చరికల ప్రకారం గురువారం జిల్లాలో భారీ వాన కురిసింది. ఓవైపు వినాయక నిమజ్జనం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కొనసాగుతోంది, నిమజ్జన కార్యక్రమంలో వర్షం కారణంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా అధికారులు ఆ వైపు చర్యలు చేపడుతున్నారు.

ట్రెండింగ్ వార్తలు

ఇదిలా ఉంటే బోథ్, ఖానాపూర్ మండలం, కొమరం జిల్లాలో పలుచోట్ల గురువారం మధ్యాహ్నం భారీ వర్షం కురిసింది. ఎగువ ప్రాంతాల నుండి వరద రావడంతో జిల్లాలోని ప్రాజెక్టులు నిండుకుండలా కనిపిస్తున్నాయి. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని సత్నాల, ముత్తడి వాగు, వట్టి వాగు, స్వర్ణ ప్రాజెక్ట్, గడ్డన ప్రాజెక్ట్, కడం ప్రాజెక్ట్, తదితర చెరువులు నిండుకుండలా కనిపిస్తున్నాయి. అధికారులు ముందు జాగ్రత్తగా ప్రాజెక్టుల వద్దనే విధులు కొనసాగిస్తున్నారు. ఎగువ ప్రాంతం నుంచి వచ్చే వరద నీరును పరిశీలిస్తూ గేట్లు లేపి కిందికి వదులుతున్నారు.

దిగువకు నీటి విడుదల :

ఉమ్మడి జిల్లాలో కురిసిన వర్షంతో పాటు ఎగువ ప్రాంతంలో వర్షం కారణంగా వచ్చే వరదను ప్రాజెక్టు గేట్లు తెరిచి నీటిని విడుదల చేస్తున్నారు. నిర్మల్ జిల్లా కడెం ప్రాజెక్టులో 700 అడుగుల సామర్థ్యం ఉండగా 697 అడుగులు నిండుగా ఉంది. ఎగువ ప్రాంతాల నుంచి వరద నీరు వస్తున్నకారణంగా ప్రాజెక్టు గేటు ఒకటి తెరిచి 2200 క్యూసెక్కుల నీరును బయటికి పంపిస్తున్నారు. అదేవిధంగా సారంగాపూర్ మండలంలోని స్వర్ణ జలాశయంలో ఒక గేటు తెరిచి 1000 క్యూసెక్కుల నీటిని బయటికి పంపిస్తున్నారు. ముథోల్ మండలం గడ్డన ప్రాజెక్టులో పూర్తి సామర్థ్యం 358 అడుగులు ఉండగా 357లకు నిండి ఉంది. ఎగువ నుండి వస్తున్న నీరును ప్రాజెక్టు ఒక గేటు తెరిచి 3000 క్యూసెక్కుల నీరును బయటకు పంపిస్తున్నారు. కొమురం భీం ప్రాజెక్టులో 243 అడుగుల నీటి సామర్థ్యం ఉండగా 237 అడుగుల నీరు నిండుకుంది. ఈ ప్రాజెక్టులో ఒక గేటు ద్వారా 1250 క్యూసెక్కుల నీరు బయటకు పంపిస్తున్నారు.

కొమురం భీమ్ ప్రాజెక్ట్ ద్వారా నీరు విడుదల
కొమురం భీమ్ ప్రాజెక్ట్ ద్వారా నీరు విడుదల

గత రెండు మూడు రోజులుగా వర్షం కురవడంతో జిల్లాలోని పలు చోట్ల ఇండ్లు కూలిపోయాయి, నిర్మల్ జిల్లా సారంగాపూర్ మండలం కోట్ల బీ గ్రామంలో బుధవారం దాసరి ముత్యం అనే వ్యక్తి ఇల్లు కుప్పకూలిపోయింది. ప్రమాద సమయంలో భార్య, పిల్లలు పరుగెత్తి ప్రాణాలను కాపాడుకున్నారు. సోన్ మండలం గ్రామ నివాసి రవి పశువులను తీసుకెళ్లి కుర్రులో మేపుతుండగా శ్రీరాంసాగర్ ప్రాజెక్టు గేటు ద్వారా నీరు విడుదల కావడంతో అక్కడే ఇరుక్కుపోయారు. వర్షాల నేపథ్యంలో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని అధికారులు కోరుతున్నారు.

 

రిపోర్టర్ : కామోజీ వేణుగోపాల్, ఆదిలాబాద్

 

WhatsApp channel

సంబంధిత కథనం