Hyderabad Rains : హైదరాబాద్ లో కుండపోత వర్షం, మరో మూడ్రోజులు ఇదే పరిస్థితి!
Hyderabad Rains : హైదరాబాద్ నగరంలో కుండపోత వర్షం కురుస్తోంది. నగరంలోని పలు ప్రాంతాల్లో బుధవారం మధ్యాహ్నాం నుంచి భారీ వర్షం కురుస్తోంది. నగరంలో మరో మూడ్రోజుల పాటు వర్ష సూచన ఉందని వాతావరణ కేంద్రం ప్రకటించింది.
Hyderabad Rains : హైదరాబాద్ లోని పలు ప్రాంతాల్లో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురుస్తోంది. బుధవారం ఉదయం నుంచి వాతావరణం మేఘావృతమై ఉండగా...సాయంత్రం కుండపోతగా వర్షం కురిసింది. మాదాపూర్, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, గచ్చిబౌలి, షేక్‌పేట, మెహదీపట్నం, ఖైరతాబాద్, లక్డీకాపూల్, నాంపల్లి, యూసఫ్‌గూడ, ఫిలింనగర్, పంజాగుట్టలో భారీవర్షం కురుస్తోంది. భారీ వర్షంతో పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ జామ్ అయింది. రోడ్లపైకి నీరు చేరడంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. హైదరాబాద్ లో గురువారం గణేశ్ నిమజ్జనం కార్యక్రమాలు ఉండడంతో అధికారులు, పోలీసులు ఏర్పాట్లు చేస్తున్నారు. భారీ వర్షం కారణంగా నిమజ్జన ఏర్పాట్లకు ఆటంకం ఏర్పడింది.
మరో మూడ్రోజులు వర్షాలు
హైదరాబాద్ నగరంలో మరో మూడు రోజుల పాటు(సెప్టెంబర్ 30) వరకు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురువనున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. హైదరాబాద్ నగరానికి ఎల్లో అలెర్ట్ జారీ చేసింది. దీంతో పాటు ఉరుములు, మెరుపులతో కూడిన వాతావరణం ఈ నెలాఖరు వరకు ఉంటుందని వాతావరణ కేంద్రం అంచనా వేసింది. మంగళవారం తెలంగాణపై ట్రోపోస్పిరిక్ స్థాయిలలో తుపాను ప్రసరణను గుర్తించింది. ఇది రాబోయే మూడు రోజుల వాతావరణ నమూనాకు దోహదం చేస్తుందని తెలిపింది. సెప్టెంబర్ 28,29,30 వరకు విస్తారంగా వర్షాలు కురుస్తాయని ఐఎండీ తెలిపింది. ఈరోజు రంగారెడ్డి, మేడ్చల్-మల్కాజిగిరి, మెదక్, వికారాబాద్, సిద్దిపేట, యాదాద్రి, వనపర్తి, జనగాం జిల్లాల్లో ఓ మోస్తరు వర్షాలు, ఇతర జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ కేంద్ర వాతావరణ కేంద్రం తెలియజేసింది.
ట్రాఫిక్ కు అంతరాయం
హైదరాబాద్ లో కుండపోత వర్షం కురుస్తుండడంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జీహెచ్ఎంసీ అధికారులు సూచించారు. వర్షం వల్ల సమస్యలు తలెత్తిన, సహాయం కోసం డీఆర్ఎఫ్ నెంబర్లు 040-21111111, 9000113667 సంప్రదించాలని అధికారులు సూచించారు. మాన్‌సూన్ ఎమర్జెన్సీ బృందాలు, ఈవీడీఎం టీమ్స్ క్షేత్రస్థాయిలో ఉండాలని జీహెచ్ఎంసీ మేయర్ గద్వా్ల్ విజయలక్ష్మీ ఆదేశించారు. ఇంటికి వెళ్లే ఉద్యోగులు, పలు పనుల నిమిత్తం బయటికి వచ్చిన ప్రజలు భారీ వర్షంతో ఇబ్బందులు పడుతున్నారు. రోడ్లపైకి వరద నీరు చేరడంతో పలు ప్రాంతాల్లో ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. నగరంలోని ప్రధాన కూడళ్లలో భారీగా ట్రాఫిక్ జాం అయింది. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులకు గరవుతున్నారు. మెట్రో రైళ్లలో ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉంది. మెట్రో స్టేషన్లలో జనంతో నిండిపోయాయి.