Adilabad Rains: ఉమ్మడి ఆదిలాబాద్‌లో దంచి కొడుతున్న వర్షాలు… పొంగి ప్రవహిస్తున్న వాగులు
Adilabad Rains: బంగాళాఖాతంలో ఏర్పడిన ఆవర్తనానికి తోడు నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదులుతుండటంతో ఉమ్మడి ఆదిలాబాద్ లోని పలు నియోజక వర్గాల్లో సోమవారం రాత్రి వర్షం దంచి కొట్టింది.
Adilabad Rains: బంగాళాఖాతంలో ఏర్పడిన ఆవర్తనానికి తోడు నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదులుతుండటంతో ఉమ్మడి ఆదిలాబాద్ లోని పలు నియోజక వర్గాల్లో సోమవారం రాత్రి వర్షం దంచి కొట్టింది. రెండు గంటల పాటు ఏకదాటిగా కురిసిన వర్షంతో పలు గ్రామాల్లో, పట్టణాలలో రహదారులు జలమయమయ్యాయి.
నిర్మల్ జిల్లా కేంద్రం లో డాక్టర్స్ లైన్, శివాజీ చౌక్, శాస్త్రి నగర్ లో రోడ్లపై వర్షపు నీరు ప్రవహించడంతో వాహనదారులు రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. గ్రామాల నుంచి వచ్చిన ప్రజలు వర్షంలో తడిసి ముద్దయ్యారు. నిర్మల్ బాసర, కుబీర్ మండల కేంద్రంతో పాటు వివిధ గ్రామాల్లో సోమవారం సాయంత్రం 5 గంటల నుండి ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. దీంతో రోడ్లన్నీ జలమయమయ్యాయి.
పంటల సాగు కోసం గత కొన్ని రోజులుగా వర్షాల కోసం ఎదురుచూస్తున్న అన్నదాతలు ఊపిరి పీల్చుకున్నారు. ఎట్టకేలకు వరుణుడు కరుణించడంతో సాగు చేసిన సోయా, పత్తి, కంది పంటకు మేలు చేకూరనుంది.
ఖానాపూర్ నియోజకవర్గంలోని వివిధ మండలాల్లో మోస్తారు నుండి భారీ వర్షాలు కురిసాయి. నియోజకవర్గంలోని పలు మండలాల్లో సోమవారం రాత్రి భారీ వర్షం కురిసింది. అలాగే జన్నారం, ఉట్నూర్, తదితర మండలాల్లో తేలికపాటి వర్షాలు పడ్డాయి. రాబోయే మూడు రోజుల పాటు పలు మండలాల్లో మోస్తారు వర్షాలు పడతాయని, ఒకటి రెండు మండలాల్లో భారీ వర్షాలు కురవచ్చని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు.
స్వర్ణ వాగు పరివాహక గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి:
స్వర్ణ జలాశయం పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ లక్ష్మి అన్నారు. జలాశయం పరివాహక ప్రాంతంలో వర్షాలు కురిసే అవకాశముందని సోమవారం రాత్రి వరద గేటు నుండి దిగువకు నీటిని వదలనున్నట్టు తెలిపారు. స్వర్ణ వాగు పరివాహక గ్రామాల ప్రజలు, పశువుల కాపరులు, రైతులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. మత్స్యకారులు వాగులో చేపల వేటకు వెళ్ళవద్దని కోరారు.
కడెం ప్రాజెక్టులోకి కొనసాగుతున్న నీటి ప్రవాహం ఎగువ ప్రాంతాల నుండి కడెం ప్రాజెక్టులోకి నీటి ప్రవాహం కొనసాగుతుందని ప్రాజెక్టు అధికారులు తెలిపారు. కడెం ప్రాజెక్టు పూర్తి సామర్థ్యం 700 అడుగులు కాగా, సోమవారం ప్రాజెక్టులో 684 అడుగుల నీటిమట్టం ఉందన్నారు. ఎగువ ప్రాంతాల నుండి ప్రాజెక్టులోకి ప్రస్తుతం 477 క్యూసెక్కుల నీరు వస్తుండగా, దిగువకు 77 క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు. అయితే ఆయకట్టుకు సాగునీటిని విడుదల చేయడం లేదని అధికారులు వెల్లడించారు.
నిర్మల్ మున్సిపాలిటీలో టోల్ ఫ్రీ నెంబర్ ఏర్పాటు రాష్ట్రవ్యాప్తంగా రానున్న నాలుగు రోజుల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున నిర్మల్ మున్సిపాలిటీలో టోల్ ఫ్రీ నంబర్ ఏర్పాటు చేసినట్లు మున్సిపల్ కమిషనర్ సీవీఎన్ రాజు ఒక ప్రకటనలో తెలిపారు. లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అత్యవసర పరిస్థితిలో టోల్ ఫ్రీ నెంబర్ 7036661070ను సంప్రదించాలని కోరారు.
(రిపోర్టింగ్: కామోజీ వేణుగోపాల్ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ప్రతినిధి)