Adilabad Rains: ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో వర్షాలతో స్తంభించిన జనజీవనం.. ఒకరి మృతి-heavy rains disrupt daily life in undivided adilabad district resulting in one death ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Adilabad Rains: ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో వర్షాలతో స్తంభించిన జనజీవనం.. ఒకరి మృతి

Adilabad Rains: ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో వర్షాలతో స్తంభించిన జనజీవనం.. ఒకరి మృతి

HT Telugu Desk HT Telugu
Sep 02, 2024 01:43 PM IST

Adilabad Rains: ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో జిల్లాలో శనివారం రాత్రి నుంచి ఎడతెరిపి లేని వర్షం కురవడంతో జనం తల్లడిల్లతున్నారు. భారీ వర్షాలతో వాగులు, ఒర్రెలు పొంగి ప్రవహిస్తున్నాయి. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని ప్రతీ మండలాల్లో కంట్రోల్ రూమ్‌లను ఏర్పాటు చేస్తున్నట్లు కలెక్టర్లు ప్రకటించారు.

లోతట్టు ప్రాంతాల్లో నిలిచిన వర్షపు నీరు
లోతట్టు ప్రాంతాల్లో నిలిచిన వర్షపు నీరు

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో భారీ వర్షాలకు, వరదలకు ఇబ్బందుల్లో చిక్కుకున్న ప్రజలకు కంట్రోల్ రూమ్ ద్వారా సహాయక చర్యలను అందిస్తామని కలెక్టర్లు ప్రకటించారు. అత్యవసరమైతే తప్ప ఇంట్లో నుంచి బయటకు వెళ్లవద్దని అధికారులు ప్రజలను ఇప్పటికే అప్రమత్తం చేశారు.

నీటి పారుదల ప్రాజెక్టుల వద్ద అప్రమత్తం

ఉమ్మడి ఆదిలాబాద్ లోని పలు సాగునీటి ప్రాజెక్టు ల వద్ద అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షస్తున్నారు. ఎగువన నుండి వచ్చే వరదలను అంచనా వేస్టు ప్రాజెక్టు గేట్లు పైకి ఎత్తి కిందికి వరదను వదిలేస్తున్నారు. లోతట్టు ప్రాంతాలలో ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు.

కడెం ప్రాజెక్టుకు భారీగా వరద రావడంతో అధికారులు అప్రత్తమై 10 గేట్లను ఎత్తి నీటిని దిగువకు వదులుతున్నారు. జిల్లాలో అత్యధికంగా కుబీర్ మండలంలో 129 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు అధికారులు చెప్పారు.

స్వర్ణ ప్రాజెక్టు లోకి ఎగువ మహారాష్ట్ర నుండి భారీగా వరద నీరు చేరుతోంది. 30వేల క్యూసెక్కుల వరద ఇన్ ఫ్లో నీటిని దిగువకు వదిలేస్తున్నారు.

కొమురం భీమ్ జిల్లా‌లోని కొమురం భీమ్ ప్రాజెక్టు లోనికి వచ్చే వరద నీటిని కిందికి వదిలేస్తున్నారు. మంచిర్యాల జిల్లా ఎల్లంపల్లి ప్రాజెక్టు లోకి భారీ నీరు చేరుతోంది. ప్రాజెక్టు సామర్థ్యం మేరకు పూర్తిగా నిండింది.

ఉమ్మడి ఆదిలాబాద్ లోని సత్నాల, స్వర్ణ, కడ్డం, గాడ్డెనా వాగు, పెంగంగా, మత్తడివాగు, ప్రాజెక్టు లలో వరద నీరు భారీగా చేరడంతో అధికారులు ఎప్పటికప్పుడు నీటి నిల్వలను ప్రాజెక్టు సామర్థ్యం మేరకు నిల్వ ఉంచి మిగతా నీటిని కిందికి వదిలేస్తున్నారు.

జనజీవనంపై తీవ్ర ప్రభావం

ఉమ్మడి జిల్లాలో ఎడ తెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో గ్రామాల సమీపంలోని వాగులు ప్రవహిస్తున్నాయి. జిల్లాలోని పలు వాగులు సోనాల వాగు, రెంకోని వాగు, కరత్వాడ గ్రామం సమీపంలోని వాగు ఉప్పొంగి ప్రవహించాయి. ఫలితంగా లోతట్టు ప్రాంతాలలో ఉన్న పంట చేలు మునిగిపోయాయి. వాగులు పొంగి ప్రవహించడంతో చుట్టూ పక్కల గ్రామాల ప్రజలకు రాకపోకలకు నిలిచిపోయాయి.

ఇక వాగు ఉధృతి వల్ల పంట చేలలో భూములు కోతకు గురయ్యాయి. మరోవైపు పంట పొలాల్లో అక్కడక్కడ ఇసుక మేటలు వేశాయి. అప్రమత్తమైన అధికార యంత్రంగం భారీ వర్షల కారణంగా ఆయా మండలాల అధికార యంత్రం అప్రమత్తమైంది. జిల్లా ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు స్థానిక తహసీల్దార్లు రెవెన్యూ అధికారులు అప్రమత్తమై పలు గ్రామాల ప్రజలకు సూచనలు చేశారు.

పశువుల కాపరి మృతి

కొమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లాలో బొండగూడ గ్రామంలో పశువుల కాపరి టెకం గణేష్ (37) ఒర్రె దాటుతూ ఒర్రెలో కొట్టుకుపోయి చనిపోయారు. నిర్మల్ జిల్లా కేంద్రం సమీపంలో చిట్యాల వంతెన పై నుండి డీసీఏం వాహనం అదుపుతప్పి పోయి వంతెన పైనుండి వాగులో పడిపోయింది. అందులో ఉన్నవారు స్వల్ప గాయలతో బయట పడ్డారు.

కడం ప్రాజెక్ట్ కు భారీ వరద.. 14 గేట్లు ఎత్తివేత

రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాలు భాగంగా నిర్మల్ జిల్లాలో శనివారం నుంచి కురుస్తున్న భారీ వర్షాలకు జిల్లాలోని ప్రాజెక్ట్ లు నిండుకుండల్లా మారిపోయాయి. దీంతో జిల్లాలోని కడం నారాయణరెడ్డి ప్రాజెక్ట్ కి భారీగా వరదనీరు చేరుతోంది. వెంటనే అప్రమత్తమైన నీటిపారుదల శాఖ అధికారులు ఆదివారం ఉదయం పది గేట్లు ఎత్తి నీటిని దిగువకు వదులుతున్నారు. ప్రస్తుతం డ్యాంలో 7.603 టీఎంసీ లు ఉండగా ప్రాజెక్టు ఎగువ ప్రాంతాల్లో భారీ వర్షాలు కురవడంతో ప్రాజెక్టులోకి వరద భారీగా చేరుతోంది. పది గేట్ల ద్వారా వచ్చిన వరదను వచ్చినట్లు దిగువకు వదులుతున్నారు.

దీంతో గోదావరి నది తీర ప్రాంతంలో పశువుల కాపరులు, గొర్రెల కాపరులు, రైతులు వెళ్లకూడదని, నీటిపారుదల శాఖ అధికారులు అలర్ట్ జారీ చేశారు. ప్రాజెక్టు చేరుతున్న వరద నీటి ఉధృతిని అధికారులు ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్నారు.

రిపోర్టింగ్: వేణుగోపాల్ కామోజీ, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా, హిందుస్తాన్ టైమ్స్ తెలుగు