Gas Tanker Accident: వరంగల్‌ శివార్లలో గ్యాస్ ట్యాంకర్ బోల్తా.. నాలుగు గంటలు టెన్షన్-gas tanker overturned on the outskirts of warangal tension for four hours ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Gas Tanker Accident: వరంగల్‌ శివార్లలో గ్యాస్ ట్యాంకర్ బోల్తా.. నాలుగు గంటలు టెన్షన్

Gas Tanker Accident: వరంగల్‌ శివార్లలో గ్యాస్ ట్యాంకర్ బోల్తా.. నాలుగు గంటలు టెన్షన్

HT Telugu Desk HT Telugu
Feb 02, 2024 06:31 AM IST

Gas Tanker Accident: హైదరాబాద్ నుంచి గ్యాస్ లోడ్ తో వస్తున్న ఓ ట్యాంకర్ వరంగల్ శివారులో ఉన్న రింగ్ రోడ్డు సమీపంలో బోల్తా కొట్టింది.

వరంగల్ రింగ్‌ రోడ్డుపై బోల్తా పడిన గ్యాస్ ట్యాంకర్
వరంగల్ రింగ్‌ రోడ్డుపై బోల్తా పడిన గ్యాస్ ట్యాంకర్

Gas Tanker Accident: హనుమకొండ జిల్లా కమలాపూర్ వెళ్తున్న గ్యాస్‌ ట్యాంకర్‌ రింగ్sa రోడ్డు వద్ద రాంపూర్ సమీపంలో డివైడర్ ను ఢీకొట్టి రోడ్డు అవతలికి వెళ్లి పల్టీ కొట్టింది. దీంతో అందులో ఉన్న డ్రైవర్ వెహికిల్ కింద పడి చనిపోయాడు.

గ్యాస్ తో నిండి ఉన్న ట్యాంకర్ బోల్తా కొట్టగా అందులోంచి గ్యాస్ లీకవుతుందన్న ప్రచారంతో దాదాపు నాలుగు గంటల పాటు రింగ్ రోడ్డు ప్రాంతంలో హై టెన్షన్ వాతావరణం కనిపించింది. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి..

తమిళనాడు రాష్ట్రానికి చెందిన నటరాజన్ (46) అనే లారీ డ్రైవర్ హెచ్‌పి గ్యాస్ కంపెనీలో పని చేస్తున్నాడు. హనుమకొండ జిల్లా కమలాపూర్ మండల కేంద్రానికి సమీపంలోని ఉన్న గ్యాస్ బాట్లింగ్‌ యూనిట్ కు లోడ్ తీసుకురావాల్సి ఉండగా.. గురువారం ఉదయం హైదరాబాద్ చర్లపల్లి నుంచి ట్యాంక్ లోడ్ చేసుకుని బయలుదేరాడు.

వరంగల్ శివారుకు చేరుకునే సరికి గురువారం మధ్యాహ్నం కాగా హనుమకొండ జిల్లాలోని కరుణాపురం వద్ద రింగ్ రోడ్డు ఎక్కాడు. అక్కడి నుంచి ధర్మసాగర్ మండలం రాంపూర్, ఎలుకుర్తి మీదుగా హసన్ పర్తి మండలంలోని చింతగట్టు క్యాంప్ వద్ద వెహికిల్ రింగ్ రోడ్డు దిగాల్సి ఉంది.

రింగ్ రోడ్డు కావడం, పెద్దగా వాహనాల రాకపోకలు ఏమీ లేకపోవడంతో స్పీడ్‌గా ప్రయాణించాడు. రింగ్ రోడ్డు మీదుగా వస్తున్న క్రమంలో రాంపూర్ శివారు ప్రాంతంలో ట్యాంకర్ వెహికిల్ అదుపు తప్పింది. ఎడమ వైపు నుంచి వెళ్తున్న ట్యాంకర్ కాస్త డివైడర్ ను దాటుకుని కుడి వైపు రోడ్డు మీదుగా రాంపూర్ సమీపంలోని రంగసముద్రం చెరువులోకి పరుగులు తీసింది.

అక్కడ అప్పటికే పూడిక తీసిన గుంతలు ఉండటంతో వాహనం పూర్తిగా బోల్తా కొట్టింది. వెహికిల్ మొత్తం రివర్స్ కావడంతో బండి నడుపుతున్న డ్రైవర్ నటరాజన్ ఇంజిన్ కిందనే పడి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు.

నాలుగు గంటలపాటు హైటెన్షన్

గురువారం మధ్యాహ్నం ఒంటి గంట సుమారులో గ్యాస్ ట్యాంకర్ బోల్తా పడింది. దీంతో ఆ వైపుగా రాకపోకలు సాగించేవాళ్లు అక్కడికి వెళ్లి పరిశీలించారు. కొద్దిగా గ్యాస్ వాసన వచ్చినట్టు అనిపించి, గ్యాస్ లీక్ అవుతుందనే ప్రచారం చేశారు.

నిత్యం వందలాది వాహనాలు రాకపోకలు సాగించే ప్రదేశం కావడం, ఆ చుట్టుపక్కల వ్యవసాయ బావుల వద్ద పనులు చేసుకుంటున్న వాళ్లుండటంతో గ్యాస్ లీక్ అయి మంటలు అంటుకుంటే పెనుప్రమాదమే సంభవించేది.

ట్యాంకర్ నిండుగా ఉండటం, మరోవైపు గ్యాస్ లీకవుతుందనే ప్రచారం జరగడంతో అక్కడ హై టెన్షన్ వాతావరణం నెలకొంది. ఏ క్షణాన బ్లాస్ట్ అవుతుందోననే భయాందోళన వ్యక్తమైంది. విషయం గమనించిన స్థానికులు వెంటనే ధర్మసాగర్ పోలీసులకు సమాచారం అందించారు. దీంతో హుటాహుటినా ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు గ్యాస్ ట్యాంకర్ ను లేపేందుకు సాహసించలేదు.

ఒకవేళ ఇష్టారీతిన ట్యాంకర్ ను లేపితే గ్యాస్ లీకై ప్రమాదం సంభవించే అవకాశం ఉండటంతో వెంటనే సంబంధిత గ్యాస్ కంపెనీ మేనేజ్మెంట్ కు సమాచారం అందించారు. ఆ తరువాత అగ్నిమాపక సిబ్బందికి కూడా సమాచారం చేరవేశారు.

నిండుగా ఉన్న ట్యాంకర్ కావడంతో దానిని లిఫ్ట్ చేసేందుకు ప్రత్యేకమైన వాహనం కావాల్సి వచ్చింది. దీంతో కంపెనీకి చెందిన వాహనాన్ని హైదరాబాద్ నుంచి రప్పించారు. అప్పటికే నాలుగు గంటల పాటు అధికారులంతా అలర్ట్ అయ్యి అక్కడే బందోబస్తు నిర్వహించారు.

హైదరాబాద్ నుంచి వచ్చిన కంపెనీ మేనేజ్మెంట్ సభ్యులు, ప్రత్యేకమైన క్రెయిన్ వెహికిల్ రాగా.. అనంతరం జాగ్రత్తగా ట్యాంకర్ ను జరిపి నటరాజన్ మృతదేహాన్ని వెలికి తీశారు. గ్యాస్ ట్యాంకర్ ను సేఫ్ గా లిఫ్ట్ చేయడంతో అధికారులతో పాటు రాంపూర్ గ్రామస్థులు, చుట్టుపక్కల ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు.

మృతదేహాన్ని వెలికి తీసిన అనంతరం పోలీసులు కుటుంబ సభ్యులకు సమాచారం అందించి, డెడ్ బాడీని వరంగల్ ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్టు ధర్మసాగర్ సీఐ శ్రీధర్ రావు వివరించారు.

(హిందుస్థాన్ టైమ్స్ తెలుగు, వరంగల్ ప్రతినిధి)

IPL_Entry_Point