TS Secretariat Fire : తెలంగాణ సచివాలయంలో అగ్నిప్రమాదం….-fire accident broke out at telangana state new secreteriat building and officials say it is mock drill ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Ts Secretariat Fire : తెలంగాణ సచివాలయంలో అగ్నిప్రమాదం….

TS Secretariat Fire : తెలంగాణ సచివాలయంలో అగ్నిప్రమాదం….

HT Telugu Desk HT Telugu
Feb 03, 2023 08:38 AM IST

TS Secretariat Fire నిర్మాణంలో ఉన్న తెలంగాణ సచివాలయంలో అగ్నిప్రమాదం జరిగింది. సచివాలయం 5,6 అంతస్తుల్లో ప్రమాదవశాత్తూ మంటలు చెలరేగడంతో సచివాలయ గుమ్మటంపై పొగలు కమ్ముకున్నాయి. 11 ఫైరింజన్లతో సిబ్బంది మంటల్ని అదుపులోకి తీసుకువచ్చారు. మరోవైపు సచివాలయంలో జరిగింది ప్రమాదం కాదని మాక్‌ డ్రిల్ అని భద్రతా సిబ్బంది చెబుతున్నారు.

తెలంగాణ నూతన సచివాలయంలో అగ్ని ప్రమాదం
తెలంగాణ నూతన సచివాలయంలో అగ్ని ప్రమాదం (twitter)

TS Secretariat Fire తెలంగాణ ప్రభుత్వం నిర్మిస్తున్న నూతన సచివాలయంలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. అగ్ని ప్రమాదం జరగడంతో గుమ్మటంపై భారీగా పొగలు కమ్ముకున్నాయి. గ్రౌండ్‌ ఫ్లోర్‌లో షార్ట్‌ సర్క్యూట్‌ జరగడంతోనే అగ్నిప్రమాదం జరిగిందని భద్రతా సిబ్బంది తెలిపారు. ప్రమాద సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది 11 అగ్నిమాపక యంత్రాలతో మంటలను అదుపులోకి తెచ్చారు. ఈ నెల 17న కొత్త సచివాలయాన్ని సీఎం కేసీఆర్‌ ప్రారంభించేందుకు నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో ప్రమాదం జరగడంపై కలకలం రేగింది.

నూతన సెక్రటేరియట్ లో అగ్నిప్రమాదంపై అధికారులు పెదవి విప్పడం లేదు. సెక్రటేరియట్ ప్రధాన గోపురం నుంచి దట్టమైన పొగలు వచ్చాయి. భారీ పొగలతో అక్కడ పని చేస్తున్న కార్మికులు ఉక్కిరి బిక్కిరయ్యారు. విషయం తెలియగానే ఫైర్ ఇంజన్లు ఘటనా స్థలానికి చేరుకుని మంటలను ఆర్పివేశాయి. అగ్ని ప్రమాదం జరగడంతో కొత్త సెక్రటేరియట్ చుట్టూ పోలీసులు ఆంక్షలు విధించారు. మీడియాను సచివాలయం వైపునకు అనుమతించడం లేదు. కొత్త సెక్రటేరియట్ లో ఎలక్ట్రికల్ పనులు నడుస్తున్నాయని తెలుస్తోంది. ప్రారంభోత్సవానికి గడువు సమీపిస్తుండటంతో వేగంగా పనులు నిర్వహిస్తున్నారు. మరో పదిహేను రోజుల్లో సచివాలయ భవనాన్ని ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్న నేపథ్యంలో ప్రమాదం జరగడంతో ఆందోళన వ్యక్తమవుతోంది.

సెక్రటేరియట్‌లో ప్రమాద సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది సుమారు 11ఫైర్ ఇంజన్లతో మంటలను అదుపు చేశారు. సెక్రటేరియట్‌లో వుడ్‌ వర్క్స్ జరుగుతున్న సమయంలో ప్రమాదవశాత్తు ఈ మంటలు చెలరేగినట్లుగా పోలీసులు భావిస్తున్నారు. ప్రారంభోత్సవానికి సంబంధించిన పనులు శరవేగంగా జరుగుతున్న క్రమంలో ఈ అగ్నిప్రమాదం జరగడంతో అధికారులు, నిర్మాణ సంస్థ ప్రమాదానికి గల కారణాలు పూర్తిగా తెలుసుకుంటున్నారు. ఈనెల 17వ తేదిన కొత్త సచివాలయాన్ని సీఎం కేసీఆర్‌ ప్రారంభించేందుకు నిర్ణయం తీసుకున్నారు.

ఫిబ్రవరి 17వ తేదీన సచివాలయ భవనాన్ని ప్రారంభించాలని నిర్ణయించారు. కేసీఆర్ పుట్టిన రోజున కొత్త సెక్రటేరియెట్‌ ప్రారంభోత్సవం చేయనున్నారు. కేసీఆర్ పుట్టిన రోజునే కొత్త సచివాలయ పనులను ప్రారంభించాలని నిర్ణయించారు.సచివాలయంలో అసంపూర్తిగా ఉన్న కొన్ని పనులను 10 రోజుల్లోనే పూర్తి చేయాలని తెలంగాణ రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు.కొత్త సచివాలయ ప్రారంభోత్సవానికి తమిళనాడు సీఎం స్టాలిన్, జార్ఖండ్ సీఎం హేమంత్ సోరేన్, బీహర్ ఉప ముఖ్యమంత్రి తేజస్వి యాదవ్ , జేడీ(యు) అద్యక్షుడు లలన్ సింగ్ , అంబేద్కర్ మనుమడు ప్రకాష్ అంబేద్కర్ లు హజరు కానున్నారు.

సచివాలయంలో జరిగిన ప్రమాదంపై రకరకాల ఊహాగానాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో అది మాక్‌ డ్రిల్‌ అంటూ అధికారులు కొత్త ప్రచారాన్ని తెరపైకి తెచ్చారు. ముఖ్యమంత్రి కార్యాలయం ఉండే 5,6 అంతస్తుల్లో మాక్ డ్రిల్ నిర్వహించినట్లు చెబుతున్నారు. ఈ ఘటనపై స్పష్టత రావాల్సి ఉంది.

IPL_Entry_Point

టాపిక్