TSPSC ED Probe: నేడు పేపర్‌ లీక్ కేసు నిందితుల్ని ప్రశ్నించనున్న ఈడీ-ed to investigate accused in public service commission paper leak case ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Tspsc Ed Probe: నేడు పేపర్‌ లీక్ కేసు నిందితుల్ని ప్రశ్నించనున్న ఈడీ

TSPSC ED Probe: నేడు పేపర్‌ లీక్ కేసు నిందితుల్ని ప్రశ్నించనున్న ఈడీ

HT Telugu Desk HT Telugu
Apr 17, 2023 11:22 AM IST

TSPSC ED Probe: తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పేపర్ లీక్ వ్యవహారంలో కీలక నిందితులు ప్రవీణ్‌, రాజశేఖర్ రెడ్డిలను నేడు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ విచారించనుంది. పేపర్ లీక్ వ్యవహారంలో లక్షలాది రుపాయలు చేతులు మారాయనే ఆరోపణల నేపథ్యంలో ఈడీ విచారణ జరుపుతోంది.

తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఉద్యోగాలు
తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఉద్యోగాలు

TSPSC ED Probe: తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పేపర్ లీక్ కేసులో ప్రధాన నిందితులు ప్రవీణ్, రాజశేఖర్ రెడ్డిలను ఏప్రిల్ 17న చంచల్ గూడ జైల్లో ఈడీ విచారించనుంది. ప్రవీణ్, రాజశేఖర్లను విచారించడానికి నాంపల్లి కోర్టు ఈడీని అనుమతించింది. ఈ కేసులో ఇప్పటికే కమిషన్ ఉద్యోగులు శంకర లక్ష్మీ, సత్యనారాయణలను ఈడీ విచారించింది.

నేడు ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు విచారణ జరపనుంది. నిందితుల తరపు న్యాయవాది సమక్షంలో విచారించాలని ఈడీకి ఆదేశం నాంపల్లి కోర్టు ఆదేశించింది. నిందితుల విచారణ నేపథ్యంలో చంచల్ గూడ జైలుకు ల్యాప్ టాప్, పెన్ డ్రైవ్, మొబైల్స్ నాంపల్లి కోర్టు అనుమతించింది. నలుగురు ఈడీ బృందం వెళ్లి నిందితులను విచారించడానికి కోర్టు అనుమతించింది.

విచారణ నేపథ్యంలో ఈడీ అధికారులకు వసతులు ఏర్పాటు చేయాలని జైలు సూపర్ డెంట్‌ను న్యాయస్థానం ఆదేశించింది. మనీ లాండరింగ్ కోణంలో ఇద్దరు నిందితులను ఈడీ విచారించనుంది. మొత్తం రెండు రోజుల పాటు నిందితుల వాంగ్మూలాన్ని ఈడీ అధికారులు నమోదు చేసుకోనున్నారు.

కారు అమ్మి పేపర్ కొన్న ఖమ్మం దంపతులు…

మరోవైపు డివిజనల్‌ అకౌంట్స్‌ ఆఫీసర్‌ ప్రశ్నాపత్రాన్ని కొనుగోలు చేసిన కేసులో ఖమ్మంకు చెందిన సాయిలౌకిక్‌, సుష్మిత దంపతుల మూడు రోజుల కస్టడీ ఆదివారంతో ముగిసింది. తమ ఆడికారును అమ్మి, అడ్వాన్స్‌గా వచ్చిన రూ.6 లక్షలను కమిషన్ ఉద్యోగి ప్రవీణ్‌కుమార్‌కు పంపించామని, మిగతా రూ.4 లక్షలు పరీక్ష అనంతరం ఇచ్చేలా ఒప్పందం చేసుకున్నామని సిట్‌ విచారణలో సుష్మిత దంపతులు వెల్లడించారు.

సుష్మిత గ్రూప్‌-1 పరీక్ష రాసింది. ఓఎమ్మార్‌ షీట్‌లో బబ్లింగ్‌లో చేసిన పొరపాటుతో ఆమె పేపర్‌ తిరస్కరణకు గురైంది. ఈ విషయంపై టీఎస్‌పీఎస్సీ కార్యాలయానికి రావడంతో అక్కడ సెక్రటరీ పీఏ ప్రవీణ్‌కుమార్‌ ఆమెకు పరిచయం అయ్యాడు. డీఏవో ప్రశ్నపత్రం తమ వద్ద ఉన్నదని చెప్పడంతో సుష్మిత, ఈ విషయాన్ని తన భర్త లౌకిక్‌తో చర్చించి పేపర్‌ కొనుగోలుకు సిద్ధపడినట్లు విచారణలో అంగీకరించింది.

అప్పటికప్పుడు లౌకిక్‌ వద్ద డబ్బులు లేకపోవడంతో తమ రెండు కార్లలో ఆడి కారును స్నేహితుడికి విక్రయించి అడ్వాన్స్‌గా రూ.6 లక్షలు తీసుకొని ప్రవీణ్‌కు పంపించాడు. ఫిబ్రవరి 23న ఖమ్మం నుంచి సుష్మిత దంపతులు హైదరాబాద్‌కు వచ్చి ఎల్బీనగర్‌లోని డీ మార్ట్‌ వద్ద ప్రవీణ్‌ను కలిశారు. అక్కడే ప్రవీణ్‌ ప్రశ్నపత్రాన్ని సుష్మితకు అందజేశాడు. ఆ రోజు అల్కాపురిలోని ఒక లాడ్జిలో బసచేసిన సుష్మిత దంపతులు.. తర్వాతి రోజు ఖమ్మం వెళ్లిపోయారు.

ఖమ్మంలో తమ ఇంట్లో కాకుండా బంధువుల ఇంట్లో రెండు రోజులపాటు సుష్మిత పరీక్షకు సిద్ధమైంది. 26వ తేదీన పరీక్ష రాసింది. శనివారం ఖమ్మం రాపర్తినగర్‌లోని వారి ఇంట్లో సోదాలు చేయగా ప్రవీణ్‌ వద్ద నుంచి తీసుకున్న మాస్టర్‌ ప్రశ్నపత్రంతో పాటు హాల్‌టికెట్‌ను కూడా సిట్‌ స్వాధీనం చేసుకున్నది. ఈ ప్రశ్నపత్రం తాము ఎవరికి ఇవ్వలేదని వారు వెల్లడించారు. నిందితులు చెప్పిన విషయాలు, దర్యాప్తులో పోలీసులు సేకరించిన సమాచారాన్ని విశ్లేషించిన సిట్‌.. డీఏవో పేపర్‌ సుష్మిత నుంచి ఇతరులకు వెళ్లలేదని ప్రాథమిక నిర్ధారణకు వచ్చింది. వీరి కస్టడీ పూర్తి కావడంతో సోమవారం కోర్టులో వారిని హాజరు పర్చనున్నారు.

పరీక్షలకు కష్టపడి చదివానని మెయిల్ పంపిన ప్రశాంత్…

ప్రశ్నపత్రాల లీక్ కేసులో నిందితుల్లో ఒకడైన రాజశేఖర్‌రెడ్డి, న్యూజిలాండ్‌లో ఉన్న తన బావ ప్రశాంత్‌రెడ్డికి గ్రూప్‌-1 ప్రశ్నపత్రాన్ని పంపినట్లు గుర్తించారు. న్యూజిలాండ్‌లో పరీక్షకు సిద్ధమై, హైదరాబాద్‌కు వచ్చి ప్రశాంత్‌ గ్రూప్‌-1 పరీక్ష రాసి తిరిగి వెళ్లిపోయాడు. పేపర్‌ లీకేజీ కేసులో వందకుపైగా మార్కులు వచ్చిన వారిని ఆరా తీస్తున్న క్రమంలో ప్రశాంత్‌ విషయం వెలుగులోకి వచ్చింది. విచారణలో తన బావకు ప్రశ్నపత్రాన్ని పంపించానని రాజశేఖర్‌రెడ్డి వెల్లడించాడు.

న్యూజిలాండ్‌లో ఉన్న ప్రశాంత్‌కు వాట్సాప్‌, ఈ మెయిల్‌ ద్వారా సిట్‌ నోటీసులు పంపించింది. ఈ నేపథ్యంలో ప్రశాంత్‌రెడ్డి సిట్‌కు ఈ మెయిల్‌ పంపించాడు. తాను కష్టపడి చదివానని, ఎవరి వద్ద నుంచి ప్రశ్నపత్రం తీసుకోలేదని, మార్కులు ఎక్కువగా రావడంతో అపోహ పడుతున్నారని మెయిల్‌లో పేర్కొన్నాడు. కమిషన్‌ ఉద్యోగి షమీమ్‌ కంప్యూటర్‌ను ఎనీడెస్క్‌ యాప్‌ ద్వారా న్యూజిలాండ్‌ నుంచి యాక్సెస్‌ చేసిన ప్రశాంత్‌, పేపర్ డౌన్‌లోడ్‌ చేసుకొని, పరీక్షకు సిద్ధమైనట్టు సిట్‌ విచారణలో వెల్లడైంది.