Cyberabad Crime Report 2023 : సైబరాబాద్ పరిధిలో పెరిగిన సైబర్ నేరాలు- రూ.232 కోట్లు మోసం, రూ.46 కోట్లు రికవరీ
Cyberabad Crime Report 2023 : ఈ ఏడాది సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో సైబర్ నేరాలు పెరిగాయని సీపీ అవినాష్ మహంతి తెలిపారు. ఎమ్మెల్యేల కొనుగోలు కేసు, మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ పై హత్య కుట్ర కేసులపై దర్యాప్తు కొనసాగుతోందన్నారు. సైబరాబాద్ వార్షిక నేర నివేదికను సీపీ విడుదల చేశారు.
Cyberabad Crime Report 2023 : సైబరాబాద్ పరిధిలో గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది సైబర్ నేరాల పెరిగాయని సైబరాబాద్ పోలీస్ కమిషనర్ అవినాష్ మహంతి వెల్లడించారు. శనివారం వార్షిక నేర నివేదిక-2023 విడుదల చేసిన సందర్బంగా ఆయన మీడియాతో మాట్లాడారు. ఆయన విడుదల చేసిన నివేదిక ప్రకారం సైబరాబాద్ పోలీస్ కమిషరేట్ పరిధిలో నేరాల వివరాలు ఇలా ఉన్నాయి.
సైబరాబాద్ పరిధిలో పెరిగిన సైబర్ క్రైమ్ కేసులు
గత ఏడాది సైబరాబాద్ పరిధిలో 27,322 కేసులు నమోదు కాగా ఈ సంవత్సరం 29,156 కేసులు నమోదు అయ్యాయి. ఇక సైబరాబాద్ లో ఈ ఏడాది 105 హత్యలు జరగగా, సైబర్ క్రైమ్ కేసులు మాత్రం గత ఏడాదితో పోలిస్తే పెరిగాయి. 2022 లో 4,850 సైబర్ కేసులు నమోదు కాగా ఈ ఏడాది 5,342 సైబర్ కేసులు నమోదు అయ్యాయి. ఈ ఏడాది మొత్తం 3432 మంది నిందితులకు పోలీసులు పట్టుకున్నారు. సైబర్ క్రైమ్ ద్వారా రూ.232 కోట్ల మోసం జరిగితే అందులో రూ.46 కోట్లు పోలీసులు రికవరీ చేశారు. సైబరాబాద్ పరిధిలో మొత్తం 277 డ్రగ్స్ కేసులు నమోదు అయితే ఆ కేసులకు సంబంధించి 567 మందిని పోలీసులు అరెస్ట్ చేశారని సైబరాబాద్ సీపీ అవినాష్ మహంతి వెల్లడించారు.
షీ-టీమ్ ల ద్వారా 2,587 మంది అరెస్ట్
డ్రగ్స్ కేసులో ఇద్దరిపై పీడీ ఆక్ట్ నమోదు చేశామని సైబరాబాద్ సీపీ అవినాష్ మహంతి పేర్కొన్నారు. 6,676 కేజీల గంజాయి స్వాధీనం చేసుకున్నామన్నారు. డ్రగ్స్ కేసులో రూ. 27 కోట్లు విలువ చేసే మత్తు పదార్థాలను స్వాధీనం చేసుకున్నామన్నారు. 52,124 డ్రంకన్ డ్రైవ్ కేసులు నమోదు అయ్యాయని, ట్రాఫిక్ ఉల్లంఘనల ద్వారా రూ.104 కోట్ల చాలాన్లను విధించామన్నారు. ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన 24,318 మంది డ్రైవింగ్ లైసెన్స్ క్యాన్సిల్ చేశామన్నారు. షీ టీమ్ ద్వారా 2,587 మందిని అరెస్ట్ చేశామని సీపీ అవినాష్ మహంతి తెలిపారు.
ఎమ్మెల్యేల కొనుగోలు కేసుపై దర్యాప్తు
ఈ ఏడాది 6,676 కిలోల గంజాయి,13 లీటర్ల హాష్ ఆయిల్,507 గ్రాముల కోకైన్, 261 గ్రాముల ఎండిఎంఏ,120 గ్రాముల అల్ఫ్రోజోలెం ,26 కిలోల చరాస్ స్వాధీనం చేసుకున్నట్లు సైబరాబద్ కమిషనర్ అవినాష్ మహంతి పేర్కొన్నారు. ఆపరేషన్ స్మైల్, ఆపరేషన్ ముస్కన్ కింద 1829 చిన్నారులను రెస్క్యూ చేశామన్నారు. ఇక కేపీ చౌదరీ కేసులో దర్యాప్తు కొనసాగుతోందని చౌదరీ కన్ఫెషన్ లో చెప్పిన ప్రతీ ఒక్కరినీ విచారిస్తుని వెల్లడించారు. న్యూ ఇయర్ వేడుకల్లో కమర్షియల్ ఈవెంట్లకు తప్పనిసరిగా అనుమతి తీసుకోవాలని సూచించారు. పోలీసులు ప్రకటించిన మార్గదర్శకాలను ప్రజలు పాటించాలని సైబరాబాద్ సీపీ అవినాష్ మహంతి కోరారు. ఎమ్మెల్యేల కొనుగోలు కేసు, మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ పై జరిగిన హత్య కుట్రల కేసులపై దర్యాఫ్తు జరుగుతోందని తెలిపారు.
రిపోర్టింగ్ : కేతిరెడ్డి తరుణ్,హైదరాబాద్ జిల్లా