Janagama Muthireddy: ముత్తిరెడ్డి గురించి మాట్లాడొద్దు..భవానీపై కోర్టు ఆంక్షలు
Janagama Muthireddy: తండ్రి కూతుళ్ల మధ్య తలెత్తిన వివాదంతో జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డికి కోర్టులో ఊరట లభించింది. ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా మీడియాలో మాట్లాడొద్దని తుల్జా భవానీ రెడ్డిని కోర్టు ఆదేశించింది.
Janagama Muthireddy: ఎమ్మెల్యే యాదగిరిరెడ్డికి వ్యతిరేకంగా మీడియాలో ఏమి మాట్లాడొద్దని హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టు ఆయన కుమార్తె తుల్జా భవానీ రెడ్డిని న్యాయస్థానం ఆదేశించింది. ఇటీవలి కాలంలో ఎమ్మెల్యే ముత్తిరెడ్డిపై ఆయన కుమార్తె తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తున్న నేపథ్యంలో ముత్తిరెడ్డి కోర్టును ఆశ్రయించారు. తన పరువుకు నష్టం కలిగించేలా విమర్శలు చేస్తున్నారని, తుల్జా భవానీ రెడ్డిపై న్యాయస్థానాన్ని ఆశ్రయించారు.
ముత్తిరెడ్డి పిటిషన్‌పై విచారించిన సిటీ సివిల్ కోర్టు ఎమ్మెల్యేపై మీడియాలో, ఇతర ప్రసార సాధనాల్లో ఎలాంటి వ్యాఖ్యలు చేయకూడదని ఆదేశించి ఈ మేరకు ముత్తిరెడ్డి కుమార్తె తుల్జా భవానీరెడ్డికి హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టు ఆదేశాలు జారీ చేసింది.
తుల్జా భవానీ రెడ్డిని ఆదేశిస్తూ ఈ నెల 9న కోర్టు ఈ నోటీసులు జారీచేసింది. కోర్టు ఆదేశాల ప్రతులు 10వ తేదీన తమకు అందినట్లు తుల్జా భవానీ సిబ్బంది స్పష్టం చేశారు. తన సంతకాలు ఫోర్జరీ చేయడంతో పాటు చేర్యాలలో ఆక్రమించిన భూముల్ని తన తండ్రి ఆక్రమించి తన పేరిట అక్రమంగా రిజిస్ట్రేషన్ చేశారని నిలదీశారు. కొద్ది నెలల క్రితం ముత్తిరెడ్డితో బహిరంగంగా గొడవ పడిన తుల్జా భవానీ ఆక్రమిత భూముల్లో ప్రహరీలను కూల్చేశారు.
ఆ తర్వాత పలు టీవీ ఛానళ్లకు ముత్తిరెడ్డికి వ్యతిరేకంగా ఇంటర్వ్యూలు ఇచ్చారు. తన తండ్రి అక్రమాలకు పాల్పడుతున్నారని, ప్రశ్నించే వారిపై అరాచకాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. మహిళా సిబ్బందిపై అనుచితంగా ప్రవర్తిస్తున్నారని, గర్బిణీ అని కూడా చూడకుండా ఓ ఉద్యోగిని ఎండలో నిలబెట్టారని ఆరోపించారు. తుల్జా భవానీ ఆరోపణలు మీడియాలో వైరల్ అయ్యాయి.
ఎమ్మెల్యే వైఖరికి వ్యతిరేకంగా తుల్జా భవానీ పలు ఆరోపణలు చేయడంతో ఆయన చిక్కుల్లో పడ్డారు. కుటుంబ వివాదాలు, ఆస్తి గొడవలని ప్రచారం జరిగినా అవేమి లేవని తుల్జా భవానీ స్పష్టం చేశారు. తండ్రి వైఖరి నచ్చకే తాను విభేదిస్తున్నట్లు స్పష్టం చేశారు. ఈ క్రమంలో కొన్ని రోజుల క్రితం ఎమ్మెల్యే ముత్తిరెడ్డి తన కుమార్తెపై హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. జనగామ, చేర్యాలలో భవానీరెడ్డిపై పోలీసులు కేసు నమోదు చేశారు.
ఆ తర్వాత కూడా తుల్జా భవానీ గత నెల రోజులుగా వివిధ టీవీ ఛానళ్లు, సామాజిక మాధ్యమాల ద్వారా తనను కుమార్తె విమర్శిస్తుందని ఆరోపిస్తూ హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టులో ఎమ్మెల్యే పిటిషన్ దాఖలు చేశారు. తన పరువు తీసేలా కుమార్తె మీడియాకు ఇంటర్వ్యూలు ఇస్తోందని, ప్రసార మాధ్యమాల్లో ఆమె తన గురించి మాట్లాడకుండా ఆదేశాలివ్వాలని కోరారు. కేసును విచారించిన కోర్టు.. ఎమ్మెల్యేపై ఎలాంటి ఇంటర్వ్యూలు ఇవ్వకూడదని, ఈ ఆదేశాలు ఈ నెల 30 వరకు అమలులో ఉంటాయని ఆదేశించింది.