HYD Rains: హైదరాబాద్‌లో కుండపోతగా వర్షం.. అత్యవసరమైతేనే బయటకు రావాలని హెచ్చరికలు.. మరికొన్ని గంటలు భారీ వర్షం
HYD Rains: హైదరాబాద్ నగరాన్ని భారీ వర్షం వణికిస్తోంది. సోమవారం మధ్యాహ్నం నుంచి ఏకధాటిగా వర్షం కురుస్తోంది. కుండపోత వానతో జనజీవనం స్తంభించింది.అరగంటలో ఐదు సెంటమీటర్ల వర్షం నమోదు కావడంతో ప్రజలు బెంబేలెత్తిపోయారు.భారీ వర్షంతో నగరంలోని పలు ప్రాంతాలు జలమయం అయ్యాయి.అవసరమైతేనే బయటకు రావాలని సూచిస్తున్నారు
HYD Rains: హైదరాబాద్‌లో కుండపోతగా వర్షం కురుస్తోంది. సోమవారం మధ్యాహ్నం మొదలైన వర్షం కొనసాగుతూనే ఉంది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావొద్దని అధికారులు సూచించారు. సోమవారం రాత్రి పొద్దుపోయే వరకు ప్రజలు కార్యాలయాల నుంచి ఇళ్లను చేరుకోలేకపోయారు. భారీ వర్షానికి పార్సీగుట్టలో కార్లు కొట్టుకుపోయాయి. ఓ గుర్తు తెలియని వ్యక్తి నీటిలో కొట్టుకుపోయినట్టు స్థానికులు చెబుతున్నారు.
రోడ్లపై వర్షపు నీరు చేరడంతో వాహనాలు రోడ్లపై బంపర్ టూ బంపర్ నడిచాయి. రోడ్లపై వర్షపు నీరు ప్రవహిస్తుండటంతో ఫ్లైఓవర్లపై ట్రాఫిక్ నిలిచిపోయింది. మరోవైపు మంగళవారం తెల్లవారుజాము నుంచి కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అత్యవసరమైతేనే ఇళ్ల నుంచి బయటకు రావాలని సూచించరు.
సోమవారం నుంచి ఏకధాటిగా వర్షం కురుస్తుండటంతో జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. సోమవారం రాత్రి కురిసిన వర్షాలకు రోడ్లు జలమయం అయ్యాయి. మంగళవారం తెల్లవారు జాము నుంచి భారీ వర్షం కురుస్తుండటంతో నగరంలోని రోడ్లన్నీ జలమయం అయ్యాయి. హైదరాబాద్‌తో పాటు శివారు ప్రాంతాల్లో భారీ వర్షం పడుతుండటంతో లోతట్టు కాలనీలు జలమయం అయ్యాయి. మంగళవారం ఉదయం కూడా నగరంలోని అన్ని ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తోంది. ఎల్‌బి నగర్ నుంచి మియాపూర్ వరకు అన్ని ప్రాంతాలు జలమయం అయ్యాయి.
ఎల్లో అలర్ట్…
గ్రేటర్ హైదరాబాద్‌లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. అత్యవసర పరిస్థితుల్లో 040-2111 1111, 9000113667 నంబర్లను సంప్రదించాలని సూచించారు. జూబ్లిహిల్స్, బంజారా హిల్స్, పంజాగుట్ట, దిల్‌సుఖ్‌నగర్, అమీర్ పేట, పెద్ద అంబర్పేట్, మలక్‌పేట్, ఖైరతాబాద్, నాగారాం ,కుత్బుల్లాపూర్, కూకట్‌పల్లి, అల్విన్ కాలనీ, కేపీహెచ్‌బీ, మూసాపేట, బాచుపల్లి, నిజాంపేట్, ప్రగతినగర్ ప్రాంతాల్లో ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తోంది.
భారీ వర్షాలతో జనజీవనం స్తంభించింది. భారీ వర్సాలతో రోడ్లపై రాకపోకలు నిలిచిపోయాయి. రాత్రి నుంచి కురుస్తున్న వర్షాలతో జలమయం అయిన రోడ్లను క్లియర్ చేసేందుకు ఎస్‌డిఆర్‌ఎఫ్, క్విక్ యాక్షన్ బృందాలను నియమించారు. మూసీ పరివాహక ప్రాంతాల్లో నివాసం ఉంటున్న వారిని ఖాళీ చేయించారు.
కుండపోతగా కురుస్తున్న వానతో సోమవారం హైదరాబాద్ నగరం స్తంభిం చింది. మధ్యాహ్నం 2 నుంచి 2.30 గం టల మధ్య టౌలిచౌకి, రాయదుర్గం, జూబ్లీ హిల్స్ ప్రాంతాల్లో అరగంట వ్యవధిలోనే 5 సెంటీ మీటర్లకు మించి వర్షపాతం నమోదైంది. టోలిచౌకి, ఖాజాగూడ, షేక్‌పేట తదితర ప్రాంతాల్లో రోడ్లు చెరువుల్లా మారాయి. రోడ్లపై వాహనాలు వర్షపు నీటిలో కొట్టుకుపోతున్న దృశ్యాలు వైరల్‌గా మారాయి.
సోమవారం మధ్యాహ్నం షేక్‌పేటలో 5.4సెం.మీ, యూసఫ్‌గూడలో 5. 38 సెంటిమీటర్లు, గచ్చిబౌలిలో 5.23 సెం.మీ, ఫిల్మ్ నగర్‌లో 4.9, బాలానగర్ లో 4.55, జూబ్లిహిల్స్‌లో 4.3సెం.మీ, వెస్ట్ మారెడ్‌పల్లి, గాయత్రిహిల్స్ ప్రాంతాల్లో 4.05 సెం.మీ, లంగర్ హౌజ్‌లో 3.55సెం.మీల వర్షం నమోదైంది.
మరోవైపు బంగాళాఖాతంలో ఏర్పడిన ఆవర్తన ప్రభావంతో భారీ వర్సాలు కురుస్తున్నాయి. తెలంగాణలోని పలు జిల్లాలకు ఐఎండి ఎల్లో అలర్ట్ జారీ చేసింది. మంగళవారం పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది.
ఆదిలాబాద్, కుమురంభీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, జగిత్యాల,రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, జనగామ, సిద్ధిపేట, యాదాద్రి భువనగిరి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజ్‌గిరి జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు.
సోమవారం తెలంగాణలోని పలు జిల్లాలో అత్యధిక వర్షపాతం నమోదైంది. నిజామాబాద్ జిల్లా భీమ్‌గల్‌లో 10.6 సెం.మీ వర్షపాతం నమోదైంది. సిద్ధిపేటలోని ధూల్‌పేటలో 10.6సెం.మీ, నల్గొండ జిల్లా జనూత్లలో 9.5సెం.మీ, గండిపల్లిలో 8.9సెంమీ,యాదాద్రిలోని యాదగిరి గుట్టలో 8.7సెం, నిజామాబాద్‌లోని నిజమాబాద్ దక్షిణంలో 8.5 సెం.మీ వర్షపాతం నమోదైంది.
భారీ వర్షాల నేపథ్యంలో జిహెచ్‌ఎంసిలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేవారు. వర్షం వల్ల ఇబ్బందులు ఎదురైనా, పాత గోడలు కూలినా, చెట్లు విరిగిపడినా వెంటనే జిహెచ్‌ఎంసికి సమాచారం ఇవ్వాలని అధికారులు సూచించారు. వర్షం కారణంగా నిలిచిన నీటిని మళ్లించేందుకు యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపడుతున్నారు. కుండ పోతగా కురుస్తున్న వర్షంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు. హైదరాబాద్‌లో మరో రెండు గంటల పాటు వర్షాలు కురుస్తాయని అధికారులు హెచ్చరించారు.