TG New Tourism Policy : వెయ్యి ఎక‌రాల్లో కొత్త జూ పార్క్ - టూరిజం పాలసీపై కీలక ఆదేశాలు-cm revanth reddy ordered the officials to formulate a new policy for the development of tourism in telangana ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Tg New Tourism Policy : వెయ్యి ఎక‌రాల్లో కొత్త జూ పార్క్ - టూరిజం పాలసీపై కీలక ఆదేశాలు

TG New Tourism Policy : వెయ్యి ఎక‌రాల్లో కొత్త జూ పార్క్ - టూరిజం పాలసీపై కీలక ఆదేశాలు

Maheshwaram Mahendra Chary HT Telugu
Aug 31, 2024 05:21 AM IST

కొత్త టూరిజం పాలసీపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్షించారు. రాష్ట్రంలో టూరిజాన్ని మరింత అభివృద్ధి చేసేలా పాలసీ ఉండాలని ఆదేశించారు. హైదరాబాద్ నగరం బయట దాదాపు వెయ్యి ఎకరాల విస్తీర్ణంలో కొత్త జూ పార్క్ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు.

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష (Image Source CMO Telangana)

తెలంగాణలో పర్యాటక అభివృద్ధి కోసం కొత్త పాలసీని రూపొందించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.. అధికారులను ఆదేశించారు. అందుకు ఇతర రాష్ట్రాల్లో అనుసరిస్తున్న అత్యుత్తమ పాలసీలను అధ్యయనం చేయాలని అధికారులకు చెప్పారు. ఎకో టూరిజం, హెల్త్ టూరిజం, టెంపుల్ టూరిజంలకు విడివిడిగా పాలసీలను రూపొందించాలని సూచించారు.

స్మార్ట్ ప్రోయాక్టివ్ ఎఫిషియెంట్ అండ్ ఎఫెక్టివ్ డెలివరీ (SPEED) ప్రాజెక్టుల్లో భాగంగా డా.బీఆర్ అంబేద్కర్ సచివాలయంలో పర్యాటక రంగ అభివృద్ధిపై సీఎం సమీక్షించారు. తెలంగాణలో ఉన్న వనరుల అభివృద్ధికి అవసరమైన చోట పీపీపీ విధానాన్ని అవలంభించాలని సూచించారు. పర్యాటకశాఖ మంత్రి జూపల్లితో పాటు కార్పొరేషన్ ఛైర్మన్ పటేల్ రమేశ్ రెడ్డి ఇందులో పాల్గొన్నారు.

ఈ సమావేశంలో పర్యాటక రంగానికి సంబంధించిన అనేక అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు. కవ్వాల్, అమ్రాబాద్ అటవీ ప్రాంతాల్లో సఫారీలను ఏర్పాటు చేసే అవకాశాలను పరిశీలించాలని సీఎం రేవంత్ రెడ్డి దిశానిర్దేశం చేశారు. కొన్ని చోట్ల రాత్రి విడిది ఉండే కాటేజీలను నిర్మించాలని సూచించారు.

వెయ్యి ఎకరాల్లో జూపార్క్…

హైదరాబాద్ బయట దాదాపు వెయ్యి ఎకరాల విస్తీర్ణంలో కొత్త జూపార్క్ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. జామ్​ నగర్​ లో అనంత్ అంబానీ 3 వేల ఎకరాల్లో వనతార వన్యప్రాణి సంరక్షణ కేంద్రాన్ని నెలకొల్పిన విషయాన్ని ప్రస్తావించారు. అనంతగిరి ప్రాంతంలో అద్బుతమైన ప్రకృతి అటవీ సంపద ఉందన్నారు. అక్కడున్న 200 ఎకరాల ప్రభుత్వ భూములను హెల్త్ టూరిజం అభివృద్ధికి వినియోగించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్ణయించారు. బెంగుళూరులోని జిందాల్ నేచర్ క్యూర్ ఇన్స్టిట్యూట్ తరహాలో నేచర్ వెల్​ నెస్​ సెంటర్ ఏర్పాటు చేయాలన్నారు.

హైదరాబాద్ ఫోర్త్ సిటీలో వెయ్యి ఎకరాల విస్తీర్ణంలో నిర్మించనున్న హెల్త్ సిటీలో హెల్త్ టూరిజంను అభివృద్ధి చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. ఇక్కడ తమ సెంటర్లు నెలకొల్పేందుకు ముందుకు వచ్చే సంస్థలకు ప్రభుత్వం తగిన ప్రోత్సాహకాలు ఉండేలా కొత్త పాలసీ తయారు చేయాలని చెప్పారు. దేశంలోనే అందరి దృష్టిని ఆకర్షించేలా హైదరాబాద్ ను మెడికల్ టూరిజం హబ్ గా తీర్చిదిద్దాలన్నారు.

యాదగిరిగుట్ట అభివృద్ధికి కీలక ఆదేశాలు:

తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు తరహాలో యాదగిరిగుట్ట టెంపుల్ బోర్డు ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. అచ్చంగా టీటీడీ అనుసరించిన తరహాలోనే బోర్డుకు స్వయం ప్రతిపత్తి, విధి విధానాలు ఉండేలా అవసరమైతే చట్ట సవరణ చేయాలన్నారు. యాదగిరిగుట్ట ఆలయ రాజ గోపురానికి బంగారు తాపడం పనులను ప్రారంభించాలని ఆదేశించారు.

యాదగిరిగుట్ట ఆలయ అభివృద్ధి పనులు చాలావరకు అర్థంతరంగా నిలిచిపోయిన విషయాన్ని ప్రస్తావిస్తూ అలా ఆగిపోవడానికి వీల్లేదన్నారు. ఇప్పటివరకు ఏమేం అభివృద్ధి పనులు జరిగాయి…? ఇంకా ఏమేం అసంపూర్తిగా ఉన్నాయనే వివరాలతో వారం రోజుల్లో సమగ్ర నివేదికను అందించాలని స్పష్టం చేశారు.

ప్రస్తుతం కీసర గుట్టపై ఉన్న రామలింగేశ్వర ఆలయాన్ని అద్భుతంగా పునర్నిర్మించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్ణయించారు. ములుగు జిల్లాలోని రామప్ప ఆలయానికి ప్రతిరూపంగా, అచ్చం అదే నమూనాతో కీసరగుట్ట ఆలయాన్ని నిర్మించాలని చెప్పారు. ఇప్పుడున్న అధునాతన టెక్నాలజీతో రామప్ప ఆలయ ఆకృతిలో యథాతథంగా కీసర ఆలయం పునర్మిర్మాణం చేపట్టాలని దిశానిర్దేశం చేశారు.