Foxconn Investments : ఫోర్త్ సిటీలోనూ పెట్టుబడులు..! సీఎం రేవంత్ తో 'ఫాక్స్‌కాన్‌' ఛైర్మన్‌ చర్చలు-foxconn chairman young liu met with telangana chief minister revanth reddy in new delhi ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Foxconn Investments : ఫోర్త్ సిటీలోనూ పెట్టుబడులు..! సీఎం రేవంత్ తో 'ఫాక్స్‌కాన్‌' ఛైర్మన్‌ చర్చలు

Foxconn Investments : ఫోర్త్ సిటీలోనూ పెట్టుబడులు..! సీఎం రేవంత్ తో 'ఫాక్స్‌కాన్‌' ఛైర్మన్‌ చర్చలు

Maheshwaram Mahendra Chary HT Telugu
Aug 16, 2024 04:35 PM IST

తెలంగాణ ప్రభుత్వం నిర్మించబోతున్న ఫోర్త్ సిటీలోనూ ఫాక్స్‌కాన్‌ పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపింది. శుక్రవారం ఢిల్లీలో సీఎం రేవంత్ రెడ్డితో ఆ సంస్థ ఛైర్మన్ యాంగ్ లియూ భేటీ అయ్యారు. ఫోర్త్ సిటీతో పాటు పారిశ్రామిక అనుకూల విధానాల్లో సీఎం రేవంత్ రెడ్డి విజ‌న్ అద్భుతంగా ఉందని యాంగ్ లియూ కొనియాడారు.

ఢిల్లీలో సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన ఫాక్స్‌కాన్‌ చైర్మన్
ఢిల్లీలో సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన ఫాక్స్‌కాన్‌ చైర్మన్

ఢిల్లీలోని అధికారిక నివాసంలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో దిగ్గ‌జ పారిశ్రామిక సంస్థ ఫాక్స్‌కాన్‌ చైర్మ‌న్ యాంగ్ లియూ మర్యాదపూర్వకంగా కలిశారు. తెలంగాణలో కొత్త పెట్టుబడుల విస్తరణ అంశంపై ఫాక్స్‌కాన్‌ ప్రతినిధి బృందంతో ముఖ్యమంత్రి చర్చలు జరిపారు. ఈ సమావేశంలో సీఎం వెంట పరిశ్రమలు ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబుతో పాటు పలువురు ఉన్నతాధికారులు ఉన్నారు.

తెలంగాణ ఆర్థిక వ్యవస్థకు ఊతమిచ్చేలా పెట్టుబడులకు అనుకూలమైన కొత్త విధానాలను ప్రజాప్రభుత్వం అమలు చేస్తోందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు. అంతర్జాతీయ అవసరాలకు తగ్గట్టు హైదరాబాద్ శివారులో ఫోర్త్ సిటీ (ఫ్యూచర్ సిటీ)ని నిర్మిస్తున్నామని వివరించారు.

ఫోర్త్ సిటీలో ఫాక్స్‌కాన్‌ (Foxconn) సంస్థ కూడా పెట్టుబడులు పెట్టాల్సిందిగా సీఎం ఆహ్వానించారు. ఫోర్త్ సిటీలో ఫాక్స్‌కాన్‌ వారు ప‌రిశ్ర‌మ‌లు నెలకొల్పేందుకు అవసరమైన సహకారాన్నిఅందిస్తామని యాంగ్ లియూకు సీఎం భరోసా ఇచ్చారు.

ఫ్యూచర్ సిటీగా ఫోర్త్ సిటీ రూప‌క‌ల్ప‌న‌లో సీఎం రేవంత్ రెడ్డి దార్శ‌నిక‌త‌, పారిశ్రామిక అనుకూల విధానాలు తనను ఎంత‌గానో ఆక‌ట్టుకున్నాయ‌ని సంస్థ ఛైర్మన్ యాంగ్ లియూ కొనియాడారు. ఫోర్త్ సిటీతో పాటు పారిశ్రామిక అనుకూల విధానాల్లో సీఎం రేవంత్ రెడ్డి విజ‌న్ అద్భుతంగా ఉందని వ్యాఖ్యానించారు.

సాధ్యమైనంత తొందర్లోనే హైద‌రాబాద్ ను సంద‌ర్శిస్తానని యాంగ్ లియూ చెప్పారు. అంతకంటే ముందుగా ఫాక్స్‌కాన్‌ క్యాంప‌స్ ఆప‌రేష‌న్స్ చీఫ్ క్యాథీ యాంగ్, ఫాక్స్‌కాన్‌ (Foxconn) భార‌త దేశ ప్ర‌తినిధి వీ లీ (V Lee) నేతృత్వంలోని బృందం హైద‌రాబాద్ వ‌స్తుంద‌ని యాంగ్ లియూ తెలిపారు.

సమావేశంలోఐటీ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు మాట్లాడుతూ…. పారిశ్రామిక అభివృద్ధికి ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రజాప్ర‌భుత్వం తీసుకుంటున్న చ‌ర్య‌లను వివరించారు. ఇటీవల ముఖ్యమంత్రి బృందం విజయవంతంగా చేపట్టిన అమెరికా, ద‌క్షిణ కొరియా పర్యటనకు సంబంధించిన వివరాలను పేర్కొన్నారు. రాబట్టిన పెట్టుబడులు, తెలంగాణపై అంతర్జాతీయంగా నెలకొన్న ఆసక్తుల వివరాలను కూడా యాంగ్ లియూకి చెప్పుకొచ్చారు.

ప్యూచర్ సిటీపై ఫోకస్:

హైదరాబాద్‌, సికింద్రాబాద్‌, సైబరాబాద్‌లకు ధీటుగా ఆధునిక మౌలిక సదుపాయాలతో అత్యాధునికంగా నాలుగో నగరాన్ని నిర్మించాలనే ఉద్దేశ్యంతో తెలంగాణ ప్రభుత్వం ప్యూచర్ సిటీని తెరపైకి తీసుకొచ్చింది.

ముచ్చర్ల ప్రాంతంలో హెల్త్ టూరిజం హబ్, స్పోర్ట్స్ హబ్, ఎడ్యుకేషన్ హబ్ వంటివాటిని అభివృద్ధి చేయడం, పక్కనే ఆమన్‌గల్ అర్బన్ అడవుల్లో నైట్ సఫారీ పెట్టడం వంటి వాటితో మొత్తంగా ఈ ప్రాంతాన్ని ప్రపంచస్థాయి నగరంగా తీర్చిదిద్దాలని సర్కార్ భావిస్తోంది.

ఇందులో భాగంగానే కందుకూరు మీర్‌ఖాన్‌పేట్ వద్ద నెట్‌జీరో సిటీలో ప్రతిపాదిత స్కిల్ యూనివర్సిటీతో పాటు అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ సెంటర్, మోడ్రన్ స్కూల్, ప్రైమరీ హెల్త్ సెంటర్, కమ్యూనిటీ సెంటర్‌లకు కూడా ఇటీవలే శంకుస్థాపన జరిగింది. స్కిల్ యూనివర్సిటీలో అడ్మిషన్ లభించిందంటే కచ్చితంగా ఉద్యోగం లభించే విధంగా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని సర్కార్ చెబుతోంది. నాలుగో నగరంగా ఏర్పడటానికి కీలకమైన విద్య, వైద్యం, ఇతర మౌళిక సదుపాయాలను కల్పించి ముచ్చర్లను ఫ్యూచర్‌ సిటీగా మార్చాలనే ధృడ నిశ్చయంతో తెలంగాణ సర్కార్ ఉంది.

సంబంధిత కథనం