CM KCR : మోసపోతే గోస పడతాం.. జాగ్రత్తగా ఉండాలే
12 రాష్ట్రాల నుంచి వలస వచ్చి తెలంగాణలో బతుకుతున్నారని సీఎం కేసీఆర్ అన్నారు. దేశంలోనే అద్భుతమైన రాష్ట్రంగా తెలంగాణ అభివృద్ధి సాధించిందన్నారు. పరిపాలనా సౌలభ్యం కోసమే కొత్త జిల్లాలు ఏర్పాటు జరిగిందన్నారు.
మేడ్చల్ జిల్లా శామీర్‌పేట సమీపంలోని అంతాయిపల్లి దగ్గర 30 ఎకరాల్లో 50 కోట్లతో నిర్మించిన నూతన కలెక్టరేట్ భవనాన్ని సీఎం కేసీఆర్ ప్రారంభించారు. తెలంగాణలో జరుగుతున్న మంచి మంచి కార్యక్రమాలు ప్రజలకు త్వరగా చేరుతున్నాయని సీఎం కేసీఆర్ అన్నారు. కొత్తగా 10 లక్షలు పింఛన్లు అందిస్తున్నామన్నారు. మొత్తం 46 లక్షల మందికి కొత్త కార్డులు ఇస్తున్నట్టుగా తెలిపారు.
మేడ్చల్‌లో కలెక్టరేట్ భవనం ఏర్పాటు చేయడం సంతోషంగా ఉందని కేసీఆర్ పేర్కొన్నారు. మేడ్చల్ జిల్లా అవుతుందని ఎవరూ అనుకోలేదని చెప్పారు. తెలంగాణ ఏర్పాటుతోనే ఇదంతా సాధ్యమైందన్నారు. ప్రజలకు పరిపాలన ఎంత దగ్గరకు వస్తే అంత చక్కగా పనులు జరుగుతాయన్నారు. పరిపాలనా సౌలభ్యం కోసమే కొత్త జిల్లాలు ఏర్పాటు జరిగిందన్నారు.
'తెలంగాణ వచ్చాక ఎన్నో మంచి పనులు జరుగుతున్నాయి. 24 గంటలు నాణ్యమైన విద్యుత్ అందిస్తున్నందుకు గర్వంగా ఉంది. మిషన్ భగీరథ ద్వారా నీటికొరత తీర్చుకున్నాం. దిల్లీలో 24 గంటలు విద్యుత్ లేని పరిస్థితి నెలకొంది. దేశంలో అసమర్థ విధానాలతో అనేక ఇబ్బందులు పడుతున్నాం. రాష్ట్రంలో తలసరి ఆదాయం రూ.2,78,500 గా ఉంది. ఒంటరి మహిళలకు, చేనేత, బీడీ కార్మికులకు పింఛన్లు ఇవ్వడం ఏ రాష్ట్రంలో లేదు. వృద్ధుల వద్ద డబ్బులు ఉంటున్నాయి. ఆర్థికంగా మనం అభివృద్ధి సాధించాం. మన జీఎస్‌డీపీ రూ.11 లక్షల 55 వేలకోట్లుగా ఉంది. భారతదేశంలోనే అద్భుతమైన రాష్ట్రంగా తెలంగాణ ఉంది.' అని సీఎం కేసీఆర్ అన్నారు.
నీచ రాజకీయాల కోసం ఎంతకైనా తెగించే వారు ఎప్పటికీ ఉంటారని సీఎం కేసీఆర్ అన్నారు. అలాంటి వారితో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని సూచించారు. జాగ్రత్తగా ఉంటేనే.. రాష్ట్రాన్ని, దేశాన్ని కాపాడుకోవచ్చన్నారు. దేశ రాజకీయాల్లో ప్రభావం చూపేలా చైతన్యంతో ముందుకు సాగాలన్నారు. ఏ మాత్రం మోసపోయినా.. గోస పడతామని సీఎం హెచ్చరించారు.
ఆంధ్రప్రదేశ్‌లోనే ఉంటే విద్యుత్, సంక్షేమం వచ్చేదా? అని ప్రజలను కేసీఆర్ అడిగారు. దేశంలో జరిగే పరిణామాలపై ఎప్పటికప్పుడు చర్చలు జరగాలన్నారు. చైతన్యవంతమైన సమాజం ఉంటే ముందుకు పురోగమిస్తామని వ్యాఖ్యానించారు. అభివృద్ధి చెందిన దేశాల బాటలో కుల, మత రహితంగా ముందుకు సాగాలని కేసీఆర్ పిలుపునిచ్చారు. నీచ రాజకీయల కోసం ఎంతకైనా తెగించే వాళ్లు ఎప్పటికీ ఉంటారని హెచ్చరించారు.