CM KCR | కీలక భేటీకి కేసీఆర్ పిలుపు.. కేంద్రంపై ఇక యుద్ధమే!
టీఆర్ఎస్ పార్టీ శాసనసభాపక్ష సమావేశానికి తెలంగాణ సీఎం కేసీఆర్ పిలుపునిచ్చారు. వరి ధాన్యం కొనుగోళ్ల విషయంలో కేంద్రంపై నిరసనలు తెలిపేందుకు ఈ భేటీలో ప్రణాళికలు రచించనున్నట్టు సమాచారం.
CM KCR latest news | తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్.. టీఆర్ఎస్ పార్టీ శాసనసభాపక్ష సమావేశానికి పిలుపునిచ్చారు. ఈ నెల 21న ఉదయం 11:30 గంటలకు ఈ సమావేశం జరగనుంది. కేంద్రప్రభుత్వ వైఖరికి వ్యతిరేకంగా చేపట్టాల్సిన నిరసనలపై ఈ భేటీలో చర్చలు జరగనున్నాయి.
ఈ సమావేశానికి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, జిల్లా అధ్యక్షులు, జడ్పీ చైర్మన్లు, డిసిసిబి, డిసిఎంఎస్ల అధ్యక్షులు, రైతుబంధు సమితుల జిల్లా అధ్యక్షులు తప్పనిసరిగా హాజరుకావాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. రాష్ట్రంలో యాసంగి వరి ధాన్యాన్ని కేంద్రప్రభుత్వం ఖచ్చితంగా కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ ధర్నా, ఆందోళన, నిరసన కార్యక్రమాలకు ఈ సమావేశంలో రూపకల్పన చేయనున్నట్లు సీఎం కెసిఆర్ పేర్కొన్నారు.
సమావేశం అనంతరం ముఖ్యమంత్రి, మంత్రుల బృందం అదే రోజు ఢిల్లీకి వెళ్లనున్నారు. ధాన్యం కొనుగోళ్ల మీద కేంద్ర మంత్రులను, అవసరమైతే ప్రధానిని కలిసి డిమాండ్ చేయనున్నారు. తెలంగాణ రాష్ట్రంలో జరిగే ఆందోళనా కార్యక్రమాలకు అనుగుణంగా లోక్సభ, రాజ్యసభలో టిఆర్ఎస్ ఎంపీలు నిరసనలు చేపడతారు.
పంజాబ్ రాష్ట్రానికి చెందిన వరి ధాన్యాన్ని 100శాతం కేంద్ర ప్రభుత్వం సేకరిస్తున్నందున, తెలంగాణ వరి ధాన్యాన్ని కూడా 100శాతం ఎఫ్సిఐ సేకరించాలని డిమాండ్ చేస్తూ ఈ ఆందోళన కార్యక్రమాలు కొనసాగించనున్నట్లు సీఎం కెసీఆర్ వివరించారు. తెలంగాణ రైతుల జీవన్మరణ సమస్యగా మారిన వరి ధాన్యం కొనుగోలుపై ఈ దఫా ఉధృతమైన పోరాటాలకు టీఆర్ఎస్ పార్టీ సిద్ధం అవుతున్నందున ఈ సమావేశానికి ఆహ్వానితులందరూ తప్పనిసరిగా హాజరుకావాలని సీఎం స్పష్టం చేశారు.
సంబంధిత కథనం
టాపిక్