CS Somesh Kumar : సోమేశ్ కు డీఓపీటీ షాక్.. తెలంగాణ తదుపరి సీఎస్ ఎవరు ?
CS Somesh Kumar : కేంద్ర సిబ్బంది శిక్షణ వ్యవహారాల శాఖ - డీఓపీటీ .. తెలంగాణ సీఎస్ సోమేశ్ కుమార్ ని రిలీవ్ చేసింది. జనవరి 12 లోపు ఏపీలో రిపోర్ట్ చేయాలని ఆదేశించింది. హైకోర్టు తీర్పు నేపథ్యంలోనే డీఓపీటీ ఈ ఉత్తర్వులు వెలువరించింది. ఈ నేపథ్యంలో తెలంగాణ తదుపరి సీఎస్ ఎవరనే చర్చ సాగుతోంది.
CS Somesh Kumar : హైకోర్టు తీర్పు నేపథ్యంలో.. తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ కి .. కేంద్ర సిబ్బంది శిక్షణ వ్యవహారాల శాఖ (Department of Personnel and Training - DOPT) షాక్ ఇచ్చింది. తెలంగాణ నుంచి సోమేశ్ ను రిలీవ్ చేసింది. జనవరి 12 లోపు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి రిపోర్ట్ చేయాలని ఆదేశించింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసిన డీఓపీటీ.. తక్షణమే ఆర్డర్స్ అమల్లోకి వస్తాయని స్పష్టం చేసింది. రాష్ట్ర విభజన తర్వాత ఆయనను ఏపీ క్యాడర్‌కు కేటాయించగా... క్యాట్ ను ఆశ్రయించి తెలంగాణకు వచ్చారు. 2019 నుంచి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు. తాజాగా హైకోర్టు తీర్పు.. డీఓపీటీ ఆదేశాలతో ఆయన మళ్లీ ఆంధ్రప్రదేశ్ కు వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది.
రాష్ట్ర విభజన తర్వాత ఐఏఎస్, ఐపీఎస్ అధికారులను రెండు రాష్ట్రాలకు కేటాయిస్తూ... కేంద్రం నిర్ణయం తీసుకుంది. విభజనలో భాగంగా సోమేష్ కుమార్‌ను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేటాయించారు. తెలంగాణలో పనిచేయాలని ఆసక్తి కనబరిచిన సోమేశ్ కుమార్.. ఏపీకి కేటాయింపుపై కేంద్ర పరిపాలన ట్రైబ్యునల్ - క్యాట్ ను ఆశ్రయించగా.. 2015లో ఆయనకు అనుకూలంగా తీర్పు వెలువడింది. దీంతో.. తెలంగాణ సర్వీసుల్లోకి వచ్చిన ఆయన... 2019లో సిఎస్‌గా నియమితులయ్యారు. మరోవైపు క్యాట్ తీర్పుని వ్యతిరేకిస్తూ... 2017లో కేంద్ర ప్రభుత్వం తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. సోమేష్ కుమార్‌ను మాతృ రాష్ట్రానికి పంపాలని కోరింది. ఈ పిటిషన్ పై విచారణ ముగించిన హైకోర్టు చీఫ్ జస్టిస్ ఉజ్జల్ భూయాన్‌తో కూడిన ధర్మాసనం జనవరి 10న తీర్పును వెలువరించింది. క్యాట్ ఉత్తర్వులు కొట్టివేస్తూ... తెలంగాణలో సీఎస్ గా కొనసాగింపును రద్దు చేసింది. సోమేష్ కుమార్ ఏపీ క్యాడర్‌కు తిరిగి వెళ్లాల్సిందేనని ఆదేశించింది. అప్పీల్ కోసం తీర్పు అమలును 3 వారాలు నిలిపివేయాలని సోమేశ్ న్యాయవాది కోర్టుని కోరగా... ఆ అభ్యర్థనను న్యాయస్థానం తోసిపుచ్చింది.
ఈ నేపథ్యంలో... సీఎం కేసీఆర్ తో సీఎస్ సోమేశ్ కుమార్ భేటీ అయ్యారు. మంగళవారం మధ్యాహ్నం ప్రగతి భవన్ కు చేరుకున్న సీఎస్... సీఎం కేసీఆర్ ను కలిశారు. హైకోర్టు తీర్పు, తదుపరి ప్రత్యామ్నాయాలపై చర్చించారు. వీరి భేటీ జరిగిన కొద్ది సేపటికే.. తెలంగాణ నుంచి సోమేశ్ ను రిలీవ్ చేస్తూ.. డీఓపీటీ ఆర్డర్స్ జారీ చేసింది. జనవరి 12న లోపు ఏపీలో రిపోర్ట్ చేయాలని ఆదేశించింది. ఊహించని పరిణామాల నేపథ్యంలో... ఇప్పుడు సోమేశ్ కుమార్ ఏం చేస్తారన్నది ఆసక్తిగా మారింది. డీఓపీటీ ఆదేశాలకు అనుగుణంగా ఏపీకి వెళతారా ? లేక వీఆర్ఎస్ తీసుకుంటారా అన్న చర్చ సాగుతోంది.
మరోవైపు... తెలంగాణ ప్రభుత్వం తక్షణమే నూతన సీఎస్ ను ఎంపిక చేయడం అనివార్యంగా మారింది. కొత్త సీఎస్ గా ఎవరిని ఎంపిక చేస్తారనేది చర్చనీయాంశమైంది. ప్రస్తుతం ఫైనాన్స్ సెక్రెటరీగా విధులు నిర్వహిస్తున్న రామకృష్ణారావు కి ఎక్కువ అవకాశాలు ఉన్నాయని.. రేపటి లోపు ఇందుకు సంబంధించిన ఉత్తర్వులు వెలువడొచ్చనే టాక్ నడుస్తోంది. అరవింద్ కుమార్, రజత్ కుమార్ల పేర్లు కూడా పరిశీలనలో ఉన్నట్లు సమాచారం.