1 Lakh For BCs : గుడ్ న్యూస్... లక్ష సాయం నిరంతర ప్రక్రియ - ప్రతి నెల 15న ఆర్థిక సాయం అందజేత-cabinet sub committee key statement about 1 lakh for bcs in telangana ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  1 Lakh For Bcs : గుడ్ న్యూస్... లక్ష సాయం నిరంతర ప్రక్రియ - ప్రతి నెల 15న ఆర్థిక సాయం అందజేత

1 Lakh For BCs : గుడ్ న్యూస్... లక్ష సాయం నిరంతర ప్రక్రియ - ప్రతి నెల 15న ఆర్థిక సాయం అందజేత

Maheshwaram Mahendra Chary HT Telugu
Jun 18, 2023 06:42 AM IST

Telangana Govt News: బీసీల్లో వెనుకబడిన చేతివృత్తులు, కుల వృత్తుల కుటుంబాలకు తెలంగాణ ప్రభుత్వం రూ. లక్ష ఆర్థిక సాయం అందిస్తోంది. ఇప్పటికే మార్గదర్శకాలు ఖరారు కాగా... దరఖాస్తు ప్రక్రియ నడుస్తోంది. ఇక ఈ స్కీమ్ పై కేబినెట్ సబ్ కమిటీ కీలక నిర్ణయం తీసుకుంది.

తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్
తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్

1 Lakh Aid to Practitioners of BC Caste Occupations: తెలంగాణలోని బీసీల్లోని చేతి, కుల వృత్తుల వారికి రూ.లక్ష ఆర్థికసాయం ప్రక్రియ షురూ అయింది. రజక, నాయీ బ్రాహ్మణ, విశ్వబ్రాహ్మణ, శాలివాహన కుమ్మరి, మేదరి తదితర కులవృత్తుల వారిని ఆర్థికంగా ఆదుకునేందుకు ఒక్కో కుటుంబానికి రూ. లక్ష ఆర్థిక సాయం అందించాలని ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా.... జూన్ 6వ తేదీ నుంచి అప్లికేషన్ ప్రక్రియ ప్రారంభమైంది. సర్కార్ ఇచ్చిన మార్గదర్శకాలకు అనుగుణంగా... ఇప్పటికే దరఖాస్తులు చేసుకుంటున్నారు. ఆయా వర్గాల నుంచి భారీగా దరఖాస్తులు వస్తున్న నేపథ్యంలో… తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం ప్రకటించింది.

నిరంతర ప్రక్రియ - మంత్రి గంగుల

ఈ స్కీమ్ కు సంబంధించి ఏర్పాటైన కేబినెట్ సబ్ కమిటీ... శనివారం సచివాలయంలో మంత్రి గంగుల కమలాకర్‌ అధ్యక్షతన ప్రత్యేకంగా భేటీ అయింది. బీసీలకు లక్ష ఆర్థికసాయం పథకం నిరంతర ప్రక్రియని మంత్రి గంగుల కమలాకర్‌ స్పష్టం చేశారు. పథకానికి అర్హులను ఎంపిక చేసి ప్రతినెలా 15న ఆర్థికసాయం అందిస్తారని వెల్లడించారు. శనివారం నాటికి 2,70,000 దరఖాస్తులు వచ్చాయని ప్రకటించారు. మొదటగా అర్హతకలిగిన లబ్ధిదారుల్లోని అత్యంత పేదలకు అందజేస్తారని వెల్లడించారు. అయితే ప్రతి నెల 5వ తేదీలోపు కలెక్టర్లు లబ్ధిదారుల జాబితాను ప్రభుత్వానికి పంపించాలని సూచించారు. ఇన్‌చార్జి మంత్రులు ధ్రువీకరించిన జాబితాలోని లబ్ధిదారులకు ప్రతి నెలా 15లోగా స్థానిక ఎమ్మెల్యేలు రూ.లక్ష ఆర్థికసాయం అందజేస్తారని పేర్కొన్నారు. దరఖాస్తు ఫారంను ఏ ఆఫీసులోనూ, ఏ అధికారికి అందజేయాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. లబ్ధిదారులు నెలరోజుల్లోగా తమకు నచ్చిన, కావాల్సిన పనిముట్లను, సామగ్రిని కొనుకోవాలని…. ఆ నిర్ణయాధికారం పూర్తిగా లబ్ధిదారులదేనని వివరించారు. కొనుగోలు చేసిన యూనిట్ల ఫొటోలను ఆన్‌లైన్‌లో అప్‌లోడ్‌ చేయాల్సి ఉంటుందని వివరించారు.

మార్గదర్శకాలు :

- లక్ష రూపాయ ఆర్థిక సాయం కోసం దరఖాస్తు చేసుకునేందుకు బీసీ కులవృత్తిదారులు, చేతివృత్తిదారులు అర్హులు అవుతారు.

-కుటుంబంలో ఒక్కరికి మాత్రమే వృత్తుల అభ్యున్నతికి ఆర్థిక సాయం అందిస్తారు.

- ఆయా కులాల పనిముట్ల కొనుగోలు, ఆధునీకరణ లేదా ముడిసరుకు కొనుగోలుకు మాత్రమే ఆర్థిక సాయం అందిస్తారు.

- దరఖాస్తుదారుల వయస్సు జూన్‌ 2 నాటికి 18 -55 ఏళ్లు ఉండాలి.

- వార్షిక ఆదాయం గ్రామీణ ప్రాంతాల్లో 1.50 లక్షలు, పట్టణ ప్రాంతాల్లో రూ.2 లక్షలకు మించకూడదు.

- దరఖాస్తు తేదీ నుంచి గత 5 ఏండ్లలో ఏ ప్రభుత్వ శాఖ ద్వారా కూడా లబ్ధిపొందినవారు అర్హులు కారు. ఇక 2017-18లో రూ.50 వేల ఆర్థిక సాయం పొందిన వారు ఈ స్కీమ్ కు అనర్హులు అవుతారు.

- జూన్‌ 20 తేదీ వరకు అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలి. రేషన్‌కార్డు, కుల, ఆదాయం ధ్రువీకరణ పత్రాలు, ఆధార్‌కార్డు, బ్యాంక్‌ పాస్‌బుక్‌, పాస్‌పోర్ట్‌ సైజ్‌ ఫొటోను దరఖాస్తుతో సమర్పించాలి. క్షేత్రస్థాయి పర్యటన తర్వాత జిల్లా కలెక్టర్‌ అధ్యక్షతన ఏర్పాటైన కమిటీకి నివేదిస్తారు. జూన్‌ 27వ తేదీలోగా జిల్లా ఇన్‌చార్జి మంత్రి ఆమోదం తీసుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాత రూ.లక్ష ఆర్థిక సాయం కోసం ఎంపికైన లబ్ధిదారుల జాబితాను ఆన్‌లైన్‌లో ప్రకటిస్తారు.

దరఖాస్తు ప్రాసెస్ ఇదే...

దరఖాస్తు దారులు మొదటగా.. https://tsobmmsbc.cgg.gov.in వెబ్ సైట్ లోకి వెళ్లాలి.

applicationFormforBC.action అనే ఆప్షన్ పై క్లిక్ చేయాలి. మీకు దరఖాస్తు ఫామ్ ఓపెన్ అవుతుంది.

మొదటగా మీ చిరునామా వివరాలు ఎంట్రీ చేయాలి. జిల్లా, మండలం, నియోజకవర్గం, పిన్ కోడ్ వంటి వివరాలు ఇందులో ఉంటాయి.

రెండో భాగంలో Applicant Details(దరఖాస్తుదారుడి వివరాలు) పూర్తి చేయాలి. ఇందులో ఆధార్, రేషన్ కార్డు, విద్యార్హతలు, ఉపకులం, సంవత్సర ఆదాయం, వృత్తి, మొబైల్ నెంబర్ ను నమోదు చేయాలి.

ఇక మూడో విభాగంలో సెక్టారు వివరాలు పూర్తి చేయాలి. Purpose of Financial Assistance, బ్యాంక్ ఖాతా, పాన్ నెంబర్ వివరాలు నమోదు చేయాలి.

ఇక చివరిగా ఫొటోను అప్ లోడ్ చేయాలి. సెల్ఫ్ డిక్లరేషన్ ఆప్షన్స్ పై క్లిక్ చేసి ప్రివ్యూ బటన్ పై నొక్కాలి

IPL_Entry_Point