BSP Bharosa Sabha: బహుజన రాజ్యమే అజెండా..! హైదరాబాద్ వేదికగా 'తెలంగాణ భరోసా సభ'-bsp telangana bharosa sabha at hyderabad ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Bsp Bharosa Sabha: బహుజన రాజ్యమే అజెండా..! హైదరాబాద్ వేదికగా 'తెలంగాణ భరోసా సభ'

BSP Bharosa Sabha: బహుజన రాజ్యమే అజెండా..! హైదరాబాద్ వేదికగా 'తెలంగాణ భరోసా సభ'

HT Telugu Desk HT Telugu
May 07, 2023 02:05 PM IST

BSP Telangana Bharosa Sabha in Hyderabad: హైదరాబాద్ వేకిగా బీఎస్పీ ఆధ్వర్యంలో ‘తెలంగాణ భరోసా సభ’ను తలపెట్టింది. ఇందుకు ఆ పార్టీ అధినేత్రి మాయావతి ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. ఈ మేరకు శనివారమే ఆమె నగరానికి చేరుకున్నారు.

బీఎస్పీ భరోసా సభ
బీఎస్పీ భరోసా సభ (twitter)

BSP Bharosa Sabha in Hyderabad: బహుజన రాజ్యమే అజెండానే లక్ష్యంగా... తెలంగాణలో విస్తరించే దిశగా అడుగులు వేస్తోంది బహుజన సమాజ్ పార్టీ(బీఎస్పీ). తెలంగాణ అధ్యక్షుడిగా మాజీ ఐపీఎస్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ బాధ్యతలు చేపట్టిన తర్వాత... రాష్ట్రవ్యాప్తంగా యాత్రలు చేపట్టారు. పలు సమస్యలపై గళమెత్తుతున్నారు. తెలంగాణలో బహుజన రాజ్యం స్థాపనే లక్ష్యంగా ముందుకు సాగుతున్నారు. గతేడాది జరిగిన మునుగోడు ఉపఎన్నికలో బరిలో నిలిచి అందరి దృష్టిని ఆకర్షించే ప్రయత్నం చేశారు. ఇటీవల పేపర్ లీక్ అంశంపై పార్టీ అధినేత ప్రవీణ్ కుమార్ గట్టిగా ప్రశ్నిస్తున్నారు. నిరుద్యోగులకు మద్దతుగా ఉంటామని... బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని పడగొట్టాలని పిలుపునిస్తున్నారు. ఇక ఇదే ఏడాది రాష్ట్రంలో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో... మరింత దూకుడును పెంచే ప్రయత్నం చేస్తున్నారు.

"బహుజన ధర్మం పాటిద్ధాం.. బహుజన రాజ్యం సాదిద్ధాం" అనే నినాదంతో హైదరాబాద్ లోని సరూర్ నగర్ వేదికగా ఇవాళ సాయంత్రం భారీ సభను తలపెట్టారు. ఇందుకు పార్టీ అధినేత్రి మాయావతి ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. ఇప్పటికే హైదరాబాద్ కు చేరుకున్న ఆమెకు... పార్టీ నేతలు ఘన స్వాగతం పలికారు. ఇక సభను విజయవంతం చేసేందుకు భారీగా ఏర్పాట్లు చేస్తున్నారు. టీఎస్​పీఎస్సీ పేపర్ లీకేజీ కారణంగా యువత భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారిందని ఆరోపిస్తూ 'తెలంగాణ భరోసా సభ'కు బీఎస్పీ పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే.

కీలక ప్రసంగం...!

ఈ సభ వేదికగా పార్టీ అధినేత్రి మాయావతి కీలక ప్రసంగం చేసే అవకాశం ఉంది. తెలంగాణలోని సమస్యలు, ఉద్యమ నేపథ్యంలో, నిరుద్యోగ సమస్యతో పాటు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రధానంగా ప్రస్తావించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇక ప్రత్యేక తెలంగాణకు బీఎస్పీ మద్దతునిచ్చిన విషయాన్ని కూడా ప్రస్తావించటంతో పాటు.... నాడు బీఎస్పీ ఆధ్వర్యంలో ఉత్తరప్రదేశ్ లో చేసిన అభివృద్ధిని కూడా వివరించే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఈ సభ ద్వారా స్పష్టమైన సందేశాన్ని రాష్ట్ర ప్రజలకు ఇచ్చే అవకాశం ఉంది.

ఇక ఈ సభకు రాష్ట్రవ్యాప్తంగా బీఎస్పీ కార్యకర్తలతో పాటు అంబేడ్కర్ వాదులు తరలిరానున్నారని పార్టీ నేతలు చెబుతున్నారు. ఈ సభ వేదికగా తెలంగాణలోని ప్రధాన సమస్యలను ప్రస్తావించటంతో పాటు… రాజ్యాధికార సాధన దిశగా మాయావతి కీలక ప్రసంగం చేస్తారని అంటున్నారు.

IPL_Entry_Point

సంబంధిత కథనం