BRS Stand On CBN Arrest : మారుతున్న గులాబీ నేతల గళం...! వ్యూహంలో భాగమేనా..?-brs stand seems to have changed regarding chandrababu arrest ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Brs Stand On Cbn Arrest : మారుతున్న గులాబీ నేతల గళం...! వ్యూహంలో భాగమేనా..?

BRS Stand On CBN Arrest : మారుతున్న గులాబీ నేతల గళం...! వ్యూహంలో భాగమేనా..?

Mahendra Maheshwaram HT Telugu
Oct 01, 2023 05:45 AM IST

Chandrababu Arrest : చంద్రబాబు అరెస్టు అంశం ఏపీలోనే కాదు... తెలంగాణలోనూ చర్చనీయాంశంగా మారింది. ప్రధానంగా అధికార BRSకు తలనొప్పిగా మారిన పరిస్థితులు కనిపిస్తున్నాయి. మొన్నటి వరకు న్యూట్రల్ అని చెప్పిన గులాబీ పెద్దలు... ఇప్పుడు మరోలా రియాక్ట్ అవుతున్నారు. ఇది కాస్త రాజకీయవర్గాల్లో ఆసక్తికరంగా మారింది.

చంద్రబాబు అరెస్ట్..... ఆసక్తికరంగా బీఆర్ఎస్ స్టాండ్
చంద్రబాబు అరెస్ట్..... ఆసక్తికరంగా బీఆర్ఎస్ స్టాండ్

BRS On Chandrababu Arrest: స్కిల్ స్కామ్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్ట్ కావటం రాజకీయవర్గాల్లో సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఎన్నికలకు ఏడాది సమయం ఉండగానే ఏపీ కేంద్రంగా హాట్ హాట్ పాలిటిక్స్ జరుగుతుండగా... ఈ సెగ తెలంగాణను కూడా తాకింది. ప్రధానంగా అధికార బీఆర్ఎస్ స్టాండ్ పై ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. మొన్నటి వరకు తమకేం సంబంధం లేని... న్యూట్రల్ స్టాండ్ అని చెప్పే ప్రయత్నం చేసింది బీఆర్ఎస్. పక్క రాష్ట్రం మ్యాటర్ ఇక్కడేందుకు అంటూ కేటీఆర్ చేసిన కొన్ని వ్యాఖ్యలు.. పార్టీకి డ్యామేజీ చేసేలా ఉన్నాయనే ఫీడ్ బ్యాంక్ అందిందనే చర్చ వినిపిస్తోంది. ఆ వెంటనే తేరుకున్న గులాబీ నాయకత్వం.... ఆచితూచీ అడుగులు వేయటమే కాదు.. స్వరాలను మార్చే పనిలో ఉన్నట్లు కనిపిస్తోంది. అందుకు తాజా పరిణామాలే బలం చేకూరుస్తున్నాయి.

హైకమాండ్ అలా... నేతలు మరోలా..!

చంద్రబాబు అరెస్టు విషయంలో బీఆర్ఎస్ హైకమాండ్ ఒకలా వ్యవహరిస్తే... పలు నియోజకవర్గాలోని నేతల రూట్ మాత్రం మరోలా ముందుకు సాగారు. పైన ఉన్న నేతలు న్యూట్రల్ స్టాండ్ తీసుకున్నట్లు కనిపించినా... బహిరంగంగా మాత్రం స్పందించలేదు. కానీ పలు నియోజకవర్గాల్లోని నేతలు మాత్రం... అదినాయకత్వానికి భిన్నంగా వ్యవహరించారు. ఏకంగా చంద్రబాబును అరెస్టును ఖండించటంతో పాటు... స్థానికంగా తలపెట్టిన ర్యాలీలో కూడా పాల్గొన్నారు. ఖమ్మం, ఎల్బీనగర్, కూకట్ పల్లి, కుత్బుల్లాపూర్, శేరిలింగంపల్లి వంటి పలు నియోజకవర్గాల్లో నిరసన కార్యక్రమాలు జరిగాయి. ఇందుకు అక్కడ ఉన్న స్థానిక బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కూడా సంఘీభావం తెలిపారు. ఖమ్మంలోని పరిస్థితులు మరో లెవల్ లో ఉన్నాయి. ఇక్కడ గత వారం 'వీ సపోర్ట్ సీబీఎన్'​ పేరుతో చంద్రబాబు ఫాలోవర్స్​ భారీ ర్యాలీ నిర్వహించారు. దీనికి మంత్రి పువ్వాడ అన్ని విధాలా సపోర్ట్ చేశారనే టాక్ జోరుగా వినిపిస్తోంది. ఒక్క ఖమ్మం పట్టణంలోనే కాదు... జిల్లా వ్యాప్తంగా ఉన్న బీఆర్ఎస్ నేతలు చంద్రబాబు అరెస్టును తీవ్రంగా ఖండించారు. నిరసన ర్యాలీలు చేపడుతా... ఒకరిని మించి మరోకరు స్టేట్ మెంట్లు ఇస్తున్నారు. ఇక ఓ మీడియా సమావేశంలో మాట్లాడుతూ... చంద్రబాబు అరెస్టుపై స్పందించారు మంత్రి కేటీఆర్. ఈ సందర్భంగా ఆయన చేసిన కొన్ని వ్యాఖ్యలు... హాట్ టాపిక్ గా మారాయి. పక్క రాష్ట్రం విషయం మనకేందుకు అనటంతో.... పార్టీకి పలు ఇబ్బందులు తెచ్చిపెట్టేంత వరకు వచ్చిందట!

ఎందుకిలా...?

మరికొద్దిరోజుల్లో తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. దీనికితోడు... తెలంగాణ ప్రాంతంలోని చాలా నియోజకవర్గాల్లో టీడీపీ సానుభూతిపరులు, ఆ పార్టీలో పని చేసిన అనుభవం ఉన్న చాలా మంది ఉన్నారు. ఇక వారే కాకుండా... చాలా నియోజకవర్గాల్లో సెటిలర్లు భారీగా ఉన్నారు. ఇందులో కమ్మ సామాజికవర్గం వారి సంఖ్య ఎక్కువే. ఇక ప్రస్తుత బీఆర్ఎస్ లో ఉన్న చాలా మంది నేతలు కూడా తెలుగుదేశం నుంచి వచ్చినవారే. ఈ పరిస్థితుల నేపథ్యంలో... చంద్రబాబు అరెస్టుపై స్పందించకపోతే ఇబ్బందులు తలెత్తే అవకాశం స్పష్టంగా ఉంటుందని... సదరు నేతలు భావించినట్లు కనిపిస్తోంది. ముఖ్యంగా కూకట్ పల్లి, శేరిలింగంపల్లి, కుత్బుల్లాపూర్, ఎల్బీనగర్, పటాన్ చెరుతో పాటు ఖమ్మం జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో సెటిలర్లు ఎక్కువగా ఉంటారు. ఆయా నియోజకవర్గాల్లోలో మెజార్టీ సంఖ్యలో బీఆర్ఎస్ కు చెందిన వారే ఎమ్మెల్యేలుగా ఉన్నారు. ఈ క్రమంలో... చంద్రబాబు అరెస్టును ఖండించకుండా, హైకమాండ్ వైఖరిని అనుసరిస్తే… నష్టం వాట్లిల్లే అవకాశం ఉంటుందని అంచనా వేయటమే కాకుండా…. అందుకు తగ్గట్టుగానే సదరు నేతలు... బహిరంగంగానే స్టేట్ మెంట్లు ఇచ్చేశారు. నిరసన కార్యక్రమాల్లో కూడా పాల్గొన్నారు. ఇక తెలంగాణ శాసనసభ స్పీకర్ పోచారం కూడా చంద్రబాబు అరెస్టును బహిరంగంగా ఖండించారు. దీనికి కారణం లేకపోలేదు. ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న బాన్సువాడ నియోజకవర్గంలోని ఓ మండలంలో అత్యధికంగా సెటిలర్లు ఉన్నారు. పైగా చంద్రబాబుతో కలిసి పని చేసిన అనుభవం కూడా ఆయనకు ఉంది.

మారుతున్న స్వరాలు...

గత రెండు రోజులుగా చూస్తే.... బీఆర్ఎస్ పెద్దల స్వరం కూడా మారుతున్నట్లు స్పష్టంగా కనిపిస్తోంది. మీడియా సమావేశంలో కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు బెడిసికొట్టినట్లు అయిందనే చెప్పొచ్చు. అయితే శనివారం ఖమ్మంలో పర్యటించిన కేటీఆర్.. టీడీపీ వ్యవస్థాపకుడైన దివంగత ఎన్టీఆర్ ను ఆకాశానికి ఎత్తేశారు. ప్ర‌పంచంలో తెలుగు వారు ఎక్క‌డ ఉన్నా.. వారంద‌రికీ ఆరాధ్య దైవం ఎన్టీఆరేన‌ంటూ చెప్పుకొచ్చారు. ఖమ్మం జిల్లాలోని లకారం ట్యాంక్‌ బండ్‌పై రూ.1.37 కోట్ల వ్య‌యంతో నూతనంగా నిర్మించిన ఎన్టీఆర్‌ పార్క్‌ సహా విగ్రహాన్ని ఖ‌ మంత్రి పువ్వాడ అజయ్‌ కుమార్‌తో కలిసి కేటీఆర్‌ ఆవిష్కరించారు. రాముడిని, కృష్ణుడిని జనం ఆయనలోనే చూసుకుంటారన్న మంత్రి కేటీఆర్... అలాంటి మహానుభావుడి విగ్రహాన్ని ఆవిష్కరించగలగడం తన అదృష్టమని చెప్పారు. తారక రామారావు పేరులోనే పవర్ ఉందని, తనకూ ఆ పేరు ఉండడం సంతోషంగా ఉందని వివరించారు. ఎన్టీఆర్ పేరు పెట్టుకున్నందుకే రెండు సార్లు మంత్రిని కూడా అయ్యానన్నారు కేటీఆర్. ఇదిలా ఉంటే... పార్టీలో కీలక నేతగా ఉన్న మంత్రి హరీశ్ రావు కూడా చంద్రబాబు అరెస్టుపై స్పందించారు. చంద్రబాబు అరెస్ట్ దురదృష్టకరమని చెప్పిన ఆయన... ఈ వయసులో అరెస్ట్ చేయటం మంచిదికాదంటూ మాట్లాడారు. పార్టీలో కీలక నేతలుగా ఉన్న కేటీఆర్, హరీశ్ చేసిన ఈ వ్యాఖ్యలు రాజకీయవర్గాల్లో ఆసక్తికరంగా మారాయి.

మొన్నటి వరకు తటస్థ వైఖరితో ఉన్న గులాబీ పెద్దలు... ఉన్నట్టుండి ఒక్కసారిగా ఈ మాదిరిగా స్పందించటం టాక్ ఆఫ్ ది పాలిటిక్స్ గా మారింది. అయితే బీఆర్ఎస్ నేతల స్టాండ్ వెనక పక్కా వ్యూహం ఉందనే చర్చ కూడా రాజకీయ వర్గాల్లో జరుగుతోంది. గత ఎన్నికల్లో సెటిలర్లు బీఆర్ఎస్ వైపు నిలవటంతో... ఆయా నియోజకవర్గాల్లో గులాబీ జెండా ఎగిరింది. మరికొద్దిరోజుల్లో ఎన్నికలు ఉన్న నేపథ్యంలో.... వారి ఓట్లు పక్కకు వెళ్లకుండా ముందస్తు జాగ్రత్తగా బీఆర్ఎస్ నేతలు పావులు కదుపుతున్నారని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అప్రమత్తంగా వ్యవహరించకుంటే...సెటిలర్లు కాంగ్రెస్ వైపు మళ్లే ఛాన్స్ ఉందనే భయం కూడా బీఆర్ఎస్ ను వెంటాడుతుందట! అన్నింటిని లెక్కలో వేసుకునే.... చంద్రబాబు అరెస్ట్ అంశం విషయంలో ఆచితూచీ అడుగులు వేయాలని బీఆర్ఎస్ భావిస్తున్నట్లు కనిపిస్తోంది. వైసీపీ అనుకూల వర్గ ఓట్ల కూడా తమకే దక్కేలా అడుగులు వేయాలని చూస్తుందట!

ఇక తెలంగాణ నేతల రియాక్షన్లపై వైసీపీ నేతలు ఘాటుగా స్పందిస్తున్నారు. చంద్రబాబుపై ప్రేమతో తెలంగాణ ఖండించటం లేదని... కేవలం ఓట్ల కోసమే తమాషాలు చేస్తున్నారంటూ స్టేట్ మెంట్లు ఇస్తున్నారు. మొత్తంగా చంద్రబాబు అరెస్ట్ అంశం మరికొద్దిరోజుల పాటు... ఇరు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ గానే ఉండేలా కనిపిస్తోంది.

IPL_Entry_Point

సంబంధిత కథనం