Honor Killing: యువతి ప్రాణాలు తీసిన సోషల్ మీడియా పోస్టులు.. అన్న చేతిలో హతం-brother killed sister for posting on social media ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Honor Killing: యువతి ప్రాణాలు తీసిన సోషల్ మీడియా పోస్టులు.. అన్న చేతిలో హతం

Honor Killing: యువతి ప్రాణాలు తీసిన సోషల్ మీడియా పోస్టులు.. అన్న చేతిలో హతం

HT Telugu Desk HT Telugu
Jul 26, 2023 07:47 AM IST

Honor Killing: వద్దన్న వినకుండా సోషల్ మీడియలో పోస్టులు పెడుతుందనే కోపంతో చెల్లిని దారుణంగా కొట్టి చంపిన ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో జరిగింది. ఆ తర్వాత రాయి తగిలి చనిపోయిందని నమ్మించేందుకు ప్రయత్నించి దొరికిపోయాడు.

అన్న చేతిలో ప్రాణాలు కోల్పోయిన అజ్మీరా
అన్న చేతిలో ప్రాణాలు కోల్పోయిన అజ్మీరా

Honor Killing: భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పరువు హత్య కలకలం రేపింది. సోదరి సోషల్‌ మీడియాలో చురుగ్గా ఉండటాన్ని సహించలేని అన్న సొంత చెల్లెల్ని హత్య చేశాడు. వద్దని చెప్పినా వినకుండా చెల్లెలు సోషల్‌ మీడియాలో తరచుగా వీడియోలు పెడుతోందని ఆగ్రహించిన అన్న, ఆమెను రోకలిబండతో మోది హత్య చేశాడు. ఈ ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందు మండలం రాజీవ్‌నగర్‌లో సోమవారం జరిగింది.

అజ్మీరా సింధు, అజ్మీరా హరిలాల్ ఇద్దరు అన్నా చెల్లెళ్లు. వీరి తండ్రి రెండేళ్ల క్రితమే చనిపోయారు. తల్లి అజ్మీరా దేవి కూలి పనులు చేసుకుంటుంది. సోషల్‌ మీడియా పోస్టుల వ్యవహారంలో సోమవారం ఉదయం సోదరుడు హరిలాల్, సింధు మధ్య గొడవ జరిగినట్టు స్థానికులు చెబుతున్నారు. ఈ క్రమంలోనే కోపొద్రిక్తుడు అయిన సోదరుడు సింధుపై రోకలిబండతో దాడి చేయడంతో ఆమె తీవ్రంగా గాయపడిందని, వెంటనే ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రి తరలించగా చికిత్స పొందుతూ రాత్రి చనిపోయిందని గ్రామస్తులు చెబుతున్నారు.

ఆవేశంతో చెల్లెల్ని హత్య చేసిన అన్న ఆ తర్వాత రాయి తగిలి చనిపోయిందని నమ్మించే ప్రయత్నం చేశాడు.ఈ ఘటనపై గ్రామస్థులకు అనుమానం రావడంతో పోలీసులకు సమాచారం ఇవ్వడంతో అసలు విషయం బయటపడింది.

మహబూబాబాద్‌లో ఏఎన్‌ఎం అప్రెంటిస్‌ చేస్తున్న సింధు సోషల్‌ మీడియాలో చురుగ్గా ఉంటోంది. తరచూ రీల్స్‌, వీడియోలు పోస్ట్ చేస్తోంది. ఇది నచ్చని అన్న హరిలాల్‌ ఆమెతో తరచూ గొడవ పడేవాడు. ఇదే విషయమై సోమవారం రాత్రి కూడా ఇద్దరి మధ్య ఘర్షణ జరిగింది. ఈ క్రమంలో హరిలాల్‌ రోకలిబండ తీసుకొని ఆమె తలపై కొట్టడంతో అజ్మీరా తీవ్రంగా గాయపడ్డారు.

బాధితురాలిని వెంటనే ఖమ్మం ఆసుపత్రికి తరలించగా పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు చెప్పారు. మెరుగైన చికిత్స కోసం వరంగల్‌ తీసుకెళ్తుండగా మృతి చెందారు. మంగళవారం ఉదయం కుటుంబసభ్యులు హడావుడిగా అంత్యక్రియలకు ఏర్పాట్లు చేస్తుండటంతో గ్రామస్థులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. వారు ఘటనా స్థలానికి చేరుకొని విచారణ చేపట్టడంతో దాడి విషయం వెలుగులోకి వచ్చింది. అప్పటికే హరిలాల్‌ పరారయ్యాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ పేర్కొన్నారు.

Whats_app_banner