Bhupalpally News : షార్ట్ సర్క్యూట్ తో దగ్ధమైన ఇల్లు, కట్టుబట్టలతో రోడ్డున పడ్డ కౌలు రైతు కుటుంబం
Bhupalpally News : జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో విషాద ఘటన చోటుచేసుకుంది. షార్ట్ సర్క్యూట్ తో కౌలు రైతు ఇల్లు పూర్తిగా కాలిపోయింది. ఇంట్లోని దుస్తులు, నిత్యావసర వస్తువులన్నీ అగ్నికి ఆహుతయ్యాయి. దీంతో కట్టుబట్టలతో ఆ కుటుంబం రోడ్డున పడింది.
రెక్కాడితేగానీ డొక్కాడని కుటుంబం వారిది. అలాంటి కుటుంబాన్ని ఓ అగ్ని ప్రమాదం రోడ్డున పడేసింది. ఓ కౌలు రైతు ఇంట్లో షార్ట్ సర్క్యూట్ జరిగి మంటలు చెలరేగగా.. ఇంట్లో ఉన్న సామాగ్రి మొత్తం అగ్నికి ఆహుతైంది. ఈ ఘటన జయశంకర్ భూపాలపల్లి జిల్లా రేగొండ మండలం కొడవటంచ గ్రామంలో చోటు చేసుకోగా.. ప్రమాదంలో ఇంట్లో ఉన్న దుస్తులు, నిత్యావసర వస్తువులన్నీ కాలిపోయాయి. దీంతో ఆ కుటుంబం సర్వస్వం కోల్పోయి రోడ్డున పడినట్లయ్యింది.
కొడవటంచ గ్రామానికి చెందిన గిరుగుల పాణి వ్యవసాయ కూలిగా పని చేస్తూ భార్య, కొడుకు, కూతురును పోషించేవాడు. సొంతంగా భూమి లేకపోవడంతో గ్రామంలో కొంత భూమిని కౌలుకు తీసుకుని సాగు చేస్తున్నాడు. ఇంతవరకు బాగానే ఉండగా.. శుక్రవారం వ్యవసాయ పనుల నిమిత్తం పాణి బయటకు వెళ్లిపోగా.. మిగతా కుటుంబ సభ్యులు కూడా ఎవరి పనులకు వెళ్లిపోయారు. కాగా ప్రమాదవశాత్తు ఇంట్లో షార్ట్ సర్క్యూట్ జరగి ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. వైర్ల ద్వారా అంటుకున్న మంటలు ఇల్లు మొత్తం వ్యాపించాయి. దీంతో ఇంట్లో ఉన్న దుస్తులు, కూలర్, మంచాలు, నిత్యావసర సరుకులు, బియ్యం అన్నీ మంటలకు కాలిపోయాయి. కాగా ఇంట్లో నుంచి పొగలు వస్తుండటాన్ని గమనించిన స్థానికులు ఫైర్ ఇంజిన్ కు సమాచారం ఇచ్చారు.
అప్పటికే మంటలు వ్యాప్తి చెందుతుండగా.. బోర్ నీళ్లతో మంటలను అదుపులోకి తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. కానీ అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోగా.. ఇంట్లో ఏ ఒక్క సామగ్రి కూడా చేతికొచ్చే పరిస్థితి లేకుండా పోయింది. మొత్తంగా రూ.ఐదారు లక్షల వరకు నష్టం వాటిల్లినట్లు అంచనా వేస్తుండగా.. సాగు చేసుకుని బతికే కౌలు రైతు కుటుంబం రోడ్డున పడినట్లయ్యింది. అసలే నిరుపేద కుటుంబం కావడం, దాంతోపాటు ఇల్లు మొత్తం కాలిపోవడంతో కౌలు రైతు పాణి కుటుంబ సభ్యులు తీవ్రంగా రోధించారు. కట్టుబట్టలతో పిల్లాపాపలతో పాణి కుటుంబ సభ్యులు రోధించడం స్థానికులను కంటతడి పెట్టించింది.
దాతలు ఆదుకోవాలని వేడుకోలు
రెక్కల కష్టం మీద బతికే గిరుగుల పాణి నిరుపేద కుటుంబానికి చెందినవాడు కావడంతో అగ్ని ప్రమాదం వారిని కోలుకోలేని దెబ్బ తీసినట్లయ్యింది. దీంతోనే అతడికి సాయం చేసేందుకు పలువురు దాతలు, గ్రామస్థులు ముందుకొచ్చారు. ఎన్ఎస్ఆర్ సంస్థల అధినేత నాయినేని సంపత్ రావు రూ.5 వేల ఆర్థిక సాయం అందించారు. మరో వ్యక్తి రూ.3 వేల సాయం చేశారు. కాగా పాణికి స్కూల్ కు వెళ్లే ఇద్దరు పిల్లలు ఉండగా.. వారికి సంబంధించిన పుస్తకాలు కూడా మంటల్లో కాలిపోయాయి. దీంతో కుటుంబం తీవ్రంగా నష్టపోగా.. కౌలు రైతు పాణి కుటుంబాన్ని ఆదుకునేందుకు దాతలు ముందుకు రావాలని గ్రామస్థులు కోరుతున్నారు. అనుకోని ప్రమాదంతో తీవ్రంగా నష్టపోయిన పాణి కుటుంబానికి స్థానిక ప్రజాప్రతినిధులు అండగా నిలవాలని, ప్రభుత్వ పథకాల్లో ప్రాధాన్యం కల్పించి ఆదుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు.
సంబంధిత కథనం