Ninth Nizam of Hyderabad : 9వ నిజాంగా అజ్మత్‌ అలీఖాన్‌-azmat alikhan declared as titular nizam ix over his father mukarram jah demise ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Ninth Nizam Of Hyderabad : 9వ నిజాంగా అజ్మత్‌ అలీఖాన్‌

Ninth Nizam of Hyderabad : 9వ నిజాంగా అజ్మత్‌ అలీఖాన్‌

HT Telugu Desk HT Telugu
Jan 22, 2023 09:36 AM IST

హైదరాబాద్‌ నిజాం వారసుడిగా మీర్‌ మహ్మద్‌ అజ్మత్‌ అలీఖాన్‌ అజ్మత్‌ జా ఎంపికయ్యారు.అజ్మత్‌ జాను ఎంపిక చేస్తున్నట్లు కుటుంబ సభ్యులు ఓ ప్రకటన విడుదల చేశారు.

9వ నిజాంగా అజ్మత్‌ అలీఖాన్‌
9వ నిజాంగా అజ్మత్‌ అలీఖాన్‌ (twitter)

Azmat AliKhan declared as titular Nizam IX: తొమ్మిదో నిజాం పేరు ఖరారైంది. తదుపతి నిజాంగా మీర్‌ మహమ్మద్‌ అజ్మత్‌ అలీఖాన్‌ ఎంపికయ్యారు. అస్‌ఫజాహీ సంప్రదాయం మేరకు ఆయన చౌమొహల్లా ప్యాలెస్‌ దర్బార్‌హాల్‌లో బాధ్యతలు స్వీకరించారు. అస్‌ఫజాహీ వంశస్థులు, నిజాం ట్రస్టుల ప్రతినిధుల సమక్షంలో ఈ కార్యక్రమం నిరాడంబరంగా జరిగింది. ఈ మేరకు కుటుంబ సభ్యులు ఓ ప్రకటన కూడా విడుదల చేశారు. ఎనిమిదో నిజాం నవాబ్‌ మీర్‌ బర్కత్‌ అలీ ఖాన్‌ వాలాషన్‌ ముకర్రం జా బహదూర్‌ ఈ నెల 15న కన్నుమూసిన సంగతి తెలిసిందే. ఆయన వీలునామా ప్రకారం పెద్దకుమారుడైన అజ్మత్‌ అలీఖాన్‌కు పట్టాభిషేకం జరిపారు.

అజ్మత్ జా 1960లో జన్మించారు. లండన్‌లో ప్రాథమిక విద్యతో పాటు ఉన్నత చదువులు చదివారు. ఫొటోగ్రఫీని వృత్తిగా ఎంచుకున్నారు. ఫొటోగ్రఫీలోనే కాలిఫోర్నియా యూనివర్సిటీ పట్టా పొందారు. హాలీవుడ్‌లో కొన్ని సినిమాలకు డైరెక్టర్‌ ఆఫ్‌ ఫొటోగ్రఫీగా పని చేశారు. పలు లఘుచిత్రాలు, డాక్యుమెంటరీలు చిత్రీకరించారు. లండన్‌లో నివసిస్తున్నా.. తన వ్యాపారాలు, డాక్యుమెంటరీ చిత్రీకరణలకు పలుదేశాలకు రాకపోకలు సాగిస్తున్నారు. తండ్రి ముకర్రమ్‌ జా అంత్యక్రియల పూర్తికి వారం రోజుల కిందట హైదరాబాద్‌ వచ్చిన ఆయన ప్రస్తుతం పాతబస్తీలోని తన పూర్వీకుల నివాసంలో ఉంటున్నారు.

నేపథ్యం ఇదే..

హైదరాబాద్ సంస్థానాన్ని పాలించిన చివరి నిజాం మీర్ ఉస్మాన్ అలీఖాన్ బహదూర్ మనుమడే ముకరం జా. 1948 వరకు హైదరాబాద్ సంస్థానాన్ని మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ పాలించారు. ఆయన ఏడో నిజాం రాజు. మీర్ ఉస్మాన్ పెద్ద కుమారుడు ప్రిన్స్ ఆజమ్ జా, ప్రిన్సెస్ దుర్రె షెహవార్ దంపతులకు 1933లో ముకరం జా జన్మించారు. తన కుమారులను పక్కన బెట్టి మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ తన వారుసుడిగా ముకరం జాను ప్రకటించారు. 1967 ఏప్రిల్ 6న చౌమహల్లా ప్యాలెస్‌లో ముకరం జా, హైదరాబాద్ ఎనిమిదో నిజాం రాజుగా పట్టాభిషిక్తులు అయ్యారు. భారత్ నుంచి ఆస్ట్రేలియా వెళ్లి కొన్ని రోజుల గడిపిన ముకరం జా, ఆతర్వాత అక్కడి నుంచి టర్కీకి వెళ్లి స్థిరపడ్డారు. నిజాం చారిటబుల్ ట్రస్ట్, ముకరం జా ట్రస్ట్ ఫర్ ఎడ్యుకేషన్ అండ్ లెర్నింగ్ కు ముకరం జా చైర్మన్ గా వ్యవహరించారు. ఏడో నిజాం వారసుడిగా1967లో ప్రపంచంలో అత్యధిక సంపదను ముకరం జా వారసత్వంగా పొందారు.

30 ఏళ్ల వయసులో దాదాపు 25,000 కోట్ల రూపాయల విలువైన ఆస్తులకు వారసుడైన ముకరం జా ఆస్తి తర్వాత తర్వాత ఆవిరైపోయింది. ఆయన తన చివరి రోజుల్లో ఇస్తాంబుల్ నగరంలో ఒక డబుల్ బెడ్ రూమ్ ఫ్లాట్ లో ఉండాల్సి వచ్చింది. ఇటీవల ముకరం జా మరణంతో ఒక శకానికి ముగింపు పలికినట్లు అయింది. ఆయన వారసుడిగా అజ్మత్ జాను ప్రకటించారు. ఈ మేరకు చేయాల్సిన కార్యక్రమాలను కుటుంబసభ్యులు పూర్తి చేశారు.

IPL_Entry_Point