Medak Cruelty: మంత్రాల నెపంతో మెదక్‌లో దారుణం, కర్రలు, రాళ్ల దాడిలోఒకరి మృతి, ఇద్దరికి గాయాలు
Medak Cruelty: మంత్రాలూ చేస్తున్నారనే అనుమానంతో మెదక్‌లో ముగ్గురి పై కట్టెలు, రాళ్లతో దాడి చేయడంతో ఒకరు మృతి చెందారు. గ్రామాల్లో ప్రజలు మంత్రాలూ, తంత్రాలు చేస్తున్నారనే నెపంతో ఒకరి ప్రాణాలు తీయటం అందరిని షాక్ గురి చేసింది. మెదక్ జిల్లాలో ఈ దారుణ సంఘటన సోమవారం రాత్రి చోటుచేసుకుంది.
Medak Cruelty: సైన్స్ మాత్రమే భూమి మీద అన్ని సమస్యలకు పరిష్కారం చూపిస్తుందని నిరూపితమైనా ఇంకా గ్రామాల్లో ప్రజలు మంత్రాలూ, తంత్రాలు చేస్తున్నారనే నెపంతో ఒకరి ప్రాణాలు తీయటం అందరిని షాక్ గురి చేసింది.
మెదక్ జిల్లాలో ఈ దారుణ సంఘటన సోమవారం రాత్రి చోటుచేసుకుంది. మంత్రాలు చేస్తున్నారనే అనుమానంతో గ్రామస్థులు ముగ్గురి వ్యక్తుల పై దారుణంగా కట్టెలతో, రాళ్లతో దాడి చేశారు.
బాధితులు తమని వొదిలిపెట్టమని ఎంత బ్రతిమిలాడినా, కాపాడమని మొత్తుకున్నా, ఆ గ్రామం మొత్తం మీద ఒక్కరు కూడా వారిని కాపాడడానికి ముందుకు రాకపోవడం గ్రామంలో నెలకొన్న మూఢ నమ్మకాలకు అద్దం పడుతోంది.
బాధితుల్లో ఒకరు అక్కడిక్కడే మృతి చెందగా, మిగిలిన ఇద్దరికి తీవ్ర గాయాలై ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ దారుణ సంఘటన మెదక్ జిల్లా టేక్మాల్ మండలంలోని గొల్లగూడెం గ్రామంలో మంగళవారం కలకలం రేపింది.
వివరాల్లోకి వెళ్తే కొల్చారం మండలం ఏటిగడ్డ మాందాపూర్ కు చెందిన రాములు (56), నిజాంపేట్ మండలం బాచుపల్లికి చెందిన బాలమణి తో కలిసి రెండు రోజుల క్రితం గొల్లగూడెం గ్రామానికి చెందిన తమ దగ్గరి బంధువు బురుజు కింది గంగవ్వ ఇంటికి వచ్చారు. ఈ క్రమంలో సోమవారం రాత్రి గంగవ్వ ఇంటి సమీపంలో నిమ్మకాయలు ఉన్నాయంటూ స్థానికులు వారిని నిలదీశారు.
ఇంటి సమీపంలో నిమ్మకాయలు ఉండటంతో ..
అంతే కాకుండా ఇంతకు ముందే మంత్రాలూ చేస్తున్నారని వారిపై స్థానికులకు అనుమానం ఉండేది. సోమవారం అమావాస్య కావడం, ఇంటి సమీపంలో నిమ్మకాయలు ఉండడంతో మంత్రాలూ చేస్తున్నారని స్థానికులు గంగవ్వ ఇంట్లో ఉన్న ముగ్గురిని బయటకు లాక్కొచ్చి దారుణంగా కొట్టారు.
ఈ ఘటనలో తీవ్ర గాయాలైన రాములు అక్కడికక్కడే మృతి చెందగా, ఇద్దరు మహిళలు గంగవ్వ, బాలమణికి గాయాలయ్యాయి. ఈ ఘటనపై చుట్టుపక్కల వారు పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందిన వెంటనే అల్లాదుర్గం సీఐ రేణుక ఘటన స్థలానికి చేరుకొని బాధితులతో మాట్లాడి వివరాలు సేకరించారు. అనంతరం రాములు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జోగిపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం అదే ఆసుపత్రికి తరలించారు.
వ్యక్తి చావుకు కారణమైన వారిపై కేసులు .…
మంత్రాలూ చేస్తున్నారనే నెపంతో దాడి చేసిన ఘటనలో ఒకరు మృతి చెందిన విషయాన్నీ తెలుసుకున్న జోగిపేట డిఎస్పీ ప్రసన్నకుమార్ మంగళవారం గొల్లగూడెం గ్రామాన్ని సందర్శించారు. ఈ దాడి ఎలా జరిగింది? ఎవరు చేశారన్న విషయాన్నీ చుట్టుపక్కల వారిని అడిగి తెలుసుకున్నారు.
ప్రజలు ఎవ్వరు కూడా ఇలాంటి మూఢ నమ్మకాలను నమ్మవద్దని, అనుమానం ఉంటె పోలీసులకు సమాచారం అందించాలి అయన ప్రజలకు పిలుపునిచ్చారు. కానీ చట్టాన్ని చేతుల్లోకి తీసుకోకూడదని డిఎస్పీ హెచ్చరించారు. మంత్రాల నెపంతో వ్యక్తులపై దాడులు చేయడం సరికాదన్నారు.
ఈ ఘటనలో వ్యక్తి చావుకు కారణమైన వారి వివరాలను సేకరించి వారిపై కేసులు నమోదు చేయాలనీ సీఐ రేణుకను ఆదేశించారు. గ్రామంలో మూఢనమ్మకాలపై అవగాహన కల్పించడంలో ప్రభుత్వ యంత్రాంగాలు నిర్లక్ష్యం వహించడం వల్లే తరచూ ఈ తరహా ఘటనలు జరుగుతున్నాయనే ఆరోపణలు ఉన్నాయి.