Four Youth Drowned : తెలంగాణలో పండుగపూట తీవ్ర విషాదం, నదిలో స్నానానికి దిగి నలుగురు యువకులు మృతి
Four Youth Drowned : తెలంగాణలో తీవ్ర విషాద ఘటన చోటుచేసుకుంది. హోలీ చేసుకున్న అనంతరం స్నానానికి నదిలో దిగిన నలుగురు యువకులు నీట మునిగిపోయారు. ఈ ఘటన కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లాలో జరిగింది.
Four Youth Drowned : తెలంగాణ పండుగపూట(Holi turns Tragic) తీవ్ర విషాదం నెలకొంది. నదిలో సరదాగా స్నానానికి వెళ్లిన నలుగురు యువకులు(Four Youth Drowned) గల్లంతయ్యారు. కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా కౌటాల మండలం నదిమాబాద్ గ్రామానికి చెందిన ప్రవీణ్, సాయి, సంతోష్, కమలాకర్ అనే నలుగురు యువకులు వార్ధా నదిలో స్నానానికి దిగి నీట మునిగిపోయారు. ఈ నలుగురు యువకులు అప్పటి వరకూ ఎంతో సంతోషంగా హోలీ(Holi) ఆడుకున్నారు. హోలీ అనంతరం స్నానానికి నదిలో దిగి గల్లంతయ్యారు. వారి కోసం జాలర్లు గాలించారు. చివరికి నలుగురి మృతదేహాలను జాలర్లు వెలికి తీశారు. స్థానికుల సమాచారం సంఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. కేసు నమోదు చేసుకుని మృతదేహాలను పోస్ట్‌మార్టం నిమిత్తం కౌటాల ఆసుపత్రికి తరలించారు. హోలీ పండుగ పూట నలుగురు యువకులు మృతి చెందడంతో గ్రామంలో విషాదం అలుముకుంది. తల్లిదండ్రులు, బంధువులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. ఈ ఘటనపై ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
వాటర్ ట్యాంక్ కూలి చిన్నారి మృతి
హోలీ పండగ వేళ నారాయణపేట జిల్లాలో(Narayanapet) విషాద ఘటన జరిగింది. మంచి నీటి ట్యాంకు కూలిన ఘటనలో ఓ చిన్నారి మృతి చెందింది. మరో ఇద్దరు బాలికలకు గాయాలయ్యాయి. నారాయణపేట జిల్లా కేంద్రంలోని 20వ వార్డులో లక్ష్మీ ప్రణతి, తన స్నేహితులతో కలిసి హోలీ చేసుకుంటుంది. చిన్నారులు ఆడుకుంటూ నీళ్ల ట్యాంకు సమీపంలోకి వెళ్లారు. ఈ క్రమంలో ట్యాంకు ఒక్కసారిగా కూలిపోయింది. వాటర్ ట్యాంక్ శిథిలాలు చిన్నారులపై పడడంతో లక్ష్మీ ప్రణతి(13) అక్కడికక్కడే మృతి చెందింది. మరో ఇద్దరు చిన్నారులు నిహారిక, హరిప్రియ గాయపడ్డారు. అయితే నీళ్ల ట్యాంక్ పక్కనే హోలికా దహనం చేయడంతో ఆ వేడికి ట్యాంకు బీటలు వచ్చి కూలిపోయినట్లు కాలనీవాసులు ఆరోపిస్తున్నారు.
లిఫ్ట్ కాలువలో ఈతకు దిగిన బాలుడు గల్లంతు
మంచిర్యాల జిల్లాలో హోలీ పండుగ (Holi Turns Tragedy)పూట విషాదం చోటుచేసుకుంది. జన్నారం మండలంలోని లిఫ్ట్ కాలువలో(Lift Canal) ఈతకు దిగిన బాలుడు మృతి చెందాడు. కార్తీక్ (15) తన అమ్మమ్మ గారి ఊరైన మామిడిపల్లికి వెళ్లాడు. ఇవాళ హోలీ కావడంతో స్నేహితులతో కలిసి హోలీ ఆటాడుకున్నాడు. ఆ తర్వాత తానిమడుగు గ్రామ సమీపంలోని లిఫ్ట్ కాలువ వద్దకు వెళ్లి స్నేహితులతో కలిసి స్నానానికి దిగాడు. అయితే కార్తీక్ కు ఈత రాకపోవడంతో(Boy Drowned) లిఫ్టు కాలువ మునిగిపోయాడు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని కార్తీక్ మృతదేహాన్ని బయటకు తీశారు. బాలుడి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం లక్షేటిపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కార్తీక్ తల్లి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.