TG Indiramma Houses : ఒకేసారి 10 లక్షల ఇందిరమ్మ ఇళ్లు.. లబ్ధిదారులను ఎంపిక చేసేది వీరే!
TG Indiramma Houses : తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి.. ఇందిరమ్మ ఇళ్లపై ఆశలు పెరిగాయి. ముఖ్యంగా గ్రామాల్లో ఇళ్ల కోసం ప్రజలు ఎదురుచూస్తున్నారు. ఇందిరమ్మ ఇళ్ల కోసం చూసే వారికి ప్రభుత్వం త్వరలోనే గుడ్ న్యూస్ చెప్పబోతోంది. ఒకేసారి ఏకంగా 10 లక్షల ఇళ్లను మంజూరు చేయనుంది.
అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ ప్రజలకు కొన్ని ప్రధాన హామీలు ఇచ్చింది. వాటిలో ముఖ్యమైంది. ఇందిరమ్మ ఇళ్లు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల ప్రజలు ఇందిరమ్మ ఇళ్ల కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నారు. వారికి రేవంత్ సర్కారు త్వరలో శుభవార్త చెప్పబోతోందని తెలుస్తోంది. ఇందిరమ్మ ఇళ్ల పంపిణీలో భాగంగా.. మొదటి దశలోనే ఒకేసారి 10 లక్షల ఇళ్లను మంజూరు చేసేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తున్నట్టు సమాచారం.
వైఎస్సార్ మార్క్‌ను దాటేలా..
ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. 2004 నుంచి 2009 వరకు వైఎస్ రాజశేఖర్ రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు 15 లక్షలకు పైగా ఇళ్ల నిర్మాణాలు చేపట్టారు. అయితే.. ఆ మార్కును దాటాలని రేవంత్ రెడ్డి ఆలోచిస్తున్నట్టు తెలుస్తోంది. అందుకే మొదటి దశ లోనే ఒకేసారి 10 లక్షల ఇళ్లను మంజూరు చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నట్టు సమాచారం.
పారదర్శకంగా ఎంపిక..
ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఎంపికలో ప్రభుత్వం జాగ్రత్తలు తీసుకుంటోంది. అందుకే లబ్ధిదారుల ఎంపికకు గ్రామ స్థాయిలోనే కమిటీలు ఏర్పాటు చేయాలని సీఎం అధికారులను ఆదేశించినట్టు తెలిసింది. గ్రామాల్లోని అంగన్‌వాడీ, ఆశ, గ్రామ కార్యదర్శి తోపాటు.. స్థానికంగా ఉండే వారితో కలిపి కమిటీలను నియమించేందుకు నిర్ణయం తీసుకున్నట్లు గృహ నిర్మాణ శాఖ అధికారులు చెబుతున్నారు. ఈ కమిటీలు ఇచ్చే నివేదిక ఆధారంగా.. మండల స్థాయిలో ఎంపీడీవోలు తుది నిర్ణయం తీసుకొని లబ్ధిదారుల తుది జాబితా ఖరారు చేస్తారని అంటున్నారు.
త్వరలో మార్గదర్శకాలు విడుదల..
మరి కొన్ని రోజుల్లో లబ్ధిదారుల ఎంపికకు మార్గదర్శకాలు విడుదల చేయనున్నట్టు తెలుస్తోంది. అయితే.. సీఎం రేవంత్ రెడ్డి మాత్రం.. దసరా పండుగకు ముందే మార్గదర్శకాలు విడుదల చేయాలని ఆదేశించినట్టు సమాచారం. దీంతో అధికారులు ఇందిరమ్మ ఇళ్లపై వేగంగా అడుగులు ముందుకేస్తున్నారు. దసరా నాటికి స్వయంగా రేవంత్ రెడ్డి ఇందిరమ్మ ఇళ్ల పై ప్రకటన చేసే అవకాశం ఉందని కాంగ్రెస్ ఎమ్మెల్యే ఒకరు 'హిందుస్తామ్ టైమ్స్ తెలుగు' ప్రతినిధితో మాట్లాడుతూ చెప్పారు.
గత ఏడాది డిసెంబర్ 28 నుంచి జనవరి 6 వరకు ప్రజాపాలన కార్యక్రమం చేపట్టింది తెలంగాణ ప్రభుత్వం. గ్యారెంటీ పథకాల కోసం మొత్తం 1,25,84,383 దరఖాస్తులు అందాయి. వీటిలో అత్యధికంగా ఇందిరమ్మ ఇళ్ల కోసం అప్లికేషన్స్ అందిన సంగతి తెలిసిందే. గత ప్రభుత్వంలో ఇచ్చిన గృహలక్ష్మి దరఖాస్తులను కాంగ్రెస్ సర్కార్ రద్దు చేయడంతో.. వారంతా తిరిగి దరఖాస్తు చేసుకున్నారు. వీటి సంఖ్య 80 లక్షలకు పైగా ఉంది.
ఈ స్కీమ్ కింద గృహ నిర్మాణానికి రూ. 5 లక్షల ఆర్థిక సాయాన్ని అందిచనుంది. ఈ నేపథ్యంలో ఈ స్కీమ్ పకడ్బందీగా అమలు చేయాలని చూస్తోంది ప్రభుత్వం. అయితే ఒకే ఆధార్ నెంబర్ తో వేర్వురు ప్రాంతాల్లో చేసిన దరఖాస్తులను గుర్తించేందుకు కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సేవలను వినియోగించుకున్నట్లు తెలుస్తోంది. ఫలితంగా ఏదో ఒక చోట స్వీకరించిన దరఖాస్తును మాత్రమే పరిణనలోకి తీసుకునే అవకాశం ఉంటుంది.