Intermediate : ఇంటర్మీడియట్ బైపీసీ, సీఈసీ పూర్తి చేసిన ఏకైక విద్యార్థి ఇతడే
ఇంటర్మీడియట్ అంటే.. ఏదో ఒక కోర్సు తీసుకుని.. ఇక ముక్కుసూటిగా దానికి సంబంధించిందే చదువుతూ వెళ్తారు. కానీ ఓ విద్యార్థి మాత్రం అందరికంటే భిన్నం. ఇంటర్ లో బైపీసీ, సీఈసీ రెండూ పూర్తి చేశాడు.
ఇంటర్ లో ఒక్క కోర్సు తీసుకుని చదివేందుకే చాలామంది నానా ఇబ్బందులు పడుతుంటారు. ఎలాగోలా పాసైతే చాలని.. తిప్పలు పడి గట్టేక్కుతారు. కానీ ఓ విద్యార్థి మాత్రం.. ఏకంగా ఇంటర్మీడియట్ బైపీసీ, సీఈసీ పూర్తి చేశాడు. ఇలా పూర్తి చేసిన ఏకైక విద్యార్థి అతడొక్కడే. ఇప్పటి వరకూ చదివినవాళ్లందరూ.. ఏదో ఒక కోర్సు ఎంపిక చేసుకుని.. ఇక దానికి సంబంధించిన పై చదువులు చదువుతూ ముందుకువెళ్లారు. కానీ అగస్త్య అనే విద్యార్థి మాత్రం.. రెండూ పూర్తి చేశాడు.
అగస్త్య జైస్వాల్ (16) ఇంటర్మీడియట్ బైపీసీ(బయాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ), సీఈసీ (సివిక్స్, ఎకనామిక్స్, కామర్స్) అనే రెండు విభాగాల్లో పూర్తి చేసిన మొదటి విద్యార్థి. తెలంగాణ ఇంటర్ ఫలితాలు ఇవాళ వచ్చిన విషయం తెలిసిందే. ఈ ఫలితాల్లో బైపీసీ, ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం పరీక్షలో అగస్త్య జైస్వాల్ ఒక ప్రైవేట్ కళాశాల నుంచి 81 శాతంతో ఉత్తీర్ణత సాధించాడు. అంతకుముందు అగస్త్యకు 11 సంవత్సరాల వయస్సు ఉన్నప్పుడు ఇంటర్మీడియట్లో CEC పాసైన మెుదటి విద్యార్థి. అగస్త్య హైదరాబాద్ కాచిగూడకు చెందినవాడే.
2020లో కేవలం 14 సంవత్సరాల వయస్సులో అగస్త్య జైస్వాల్ బీఏ జర్మలిజంలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన అతిచిన్న వయస్కుడు. ఉస్మానియా విశ్వవిద్యాలయం ప్రకటించిన డిగ్రీ ఫలితాల్లో మాస్ కమ్యూనికేషన్, జర్నలిజంలో డిగ్రీ పూర్తి చేసి ప్రథమ స్థానంలో ఉత్తీర్ణుడయ్యాడు. యూసుఫ్‌గూడలోని సెయింట్ మేరీ కాలేజీలో బీఏ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశాడు. అంతేకాదు 9 ఏళ్ల వయసులోనే 10వ తరగతి, 11 ఏళ్లలో ఇంటర్ పూర్తి చేశాడు. మళ్లీ ఇంటర్ బైపీసీ తీసుకుని చదివాడు.
'నా తల్లిదండ్రులే నాకు గురువులు. వారి మద్దతు మరియు శిక్షణతో నేను ఏదీ అసాధ్యం కాదని నిరూపిస్తున్నాను. ఇంటర్మీడియట్ లో Bi.Pc, CEC పూర్తి చేయాలనే ఉద్దేశం కేవలం జ్ఞానాన్ని సంపాదించడం కోసం మాత్రమే. తెలంగాణ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.' అని అగస్త్య చెబుతున్నాడు.
అగస్త్య జైస్వాల్ కు ఇంకా చాలా టాలెంట్స్ ఉన్నాయి. కేవలం 1.72 సెకన్లలో A నుండి Z వర్ణమాలలను టైప్ చేయగలడు. రెండు చేతులతో రాయగలడు. అగస్త్య జాతీయ స్థాయి టేబుల్ టెన్నిస్ ఆటగాడు. అగస్త్య జైస్వాల్ సోదరి నైనా జైస్వాల్ టేబుల్ టెన్నిస్‌లో అంతర్జాతీయ స్థాయిలో రాణిస్తూ 13 ఏళ్ల వయసులోనే డిగ్రీ పూర్తి చేసి చరిత్ర సృష్టించిన విషయం తెలిసిందే.
టాపిక్