Ubit Crypto Scam : యూబిట్ ఆన్లైన్ దందా- కాయిన్స్ వేటలో ఉపాధ్యాయులు!-adilabad ubit crypto coins online fraud govt teachers employees involved ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Ubit Crypto Scam : యూబిట్ ఆన్లైన్ దందా- కాయిన్స్ వేటలో ఉపాధ్యాయులు!

Ubit Crypto Scam : యూబిట్ ఆన్లైన్ దందా- కాయిన్స్ వేటలో ఉపాధ్యాయులు!

HT Telugu Desk HT Telugu
Sep 03, 2024 09:34 PM IST

Ubit Crypto Scam : యూబిట్ కాయిన్ క్రిప్టో కరెన్సీ మల్టీ లెవెల్ మార్కెటింగ్ దందాలో పలు ఉపాధ్యాయులు, ఉద్యోగులు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ఇప్పటికే ఇద్దరు ఉపాధ్యాయులను అరెస్టు చేశారు. ఆదిలాబాద్ జిల్లాలో బయటపడ్డ యూబిట్ ఆన్లైన్ దందాలో దాదాపు 70 శాతం ఉపాధ్యాయులే ఉండటం గమనార్హం.

యూబిట్ ఆన్లైన్ దందా- కాయిన్స్ వేటలో ఉపాధ్యాయులు!
యూబిట్ ఆన్లైన్ దందా- కాయిన్స్ వేటలో ఉపాధ్యాయులు! (HT_PRINT)

Ubit Crypto Scam : బడిని గుడిగా మార్చి నాలుగు గోడల మధ్య పిల్లల జీవితాలను తీర్చిదిద్దిన గురువులను చూసాము. ప్రత్యేకశ్రద్ధ పెట్టి పాఠాలు చెబుతున్న వాళ్లను చూసాము, తమ విధులకు న్యాయం చేస్తూ కేవలం తమను నమ్ముకుని సర్కారు బడులకు వచ్చే విద్యార్థుల ఆశలను నిలబెడుతున్న వారిని సైతం చూసాము. కానీ ప్రస్తుతం కొందరు గురువులు మాత్రం 'కాయిన్స్' వేటలో, కాసుల కక్కు ర్తిలో పడి తమ వృత్తికే మచ్చ తెచ్చి కటకటాలపాలైన వారిని చూడాల్సి వస్తుందని ప్రజలు చర్చించుకుంటున్నారు. పాఠాలు చెప్పడం మరిచి.. బడికి రాకుండానే గడిపేస్తున్నారని, తరగతి గదిలో ఎదురుగా ఉన్న విద్యార్థులను పట్టించుకోకుండా.. ఎక్కడో ఉన్నవాళ్లతో సెల్ఫోన్లో బిజినెస్, ఆన్లైన్ లో పెట్టుబడులు, సెటిల్మెంట్ దందాలు చేస్తున్నారనే విమర్శలు చోటు చేసుకుంటున్నాయి.

ఇటీవల ఆదిలాబాద్ జిల్లాలో బయటపడ్డ యూబిట్ ఆన్లైన్ దందాలో దాదాపు 70 శాతం ప్రభుత్వ ఉపాధ్యాయులే ఉండటం గమనార్హం. తాము చదివిన చదువుకు, కష్టపడి సాధించిన కొలువులో నెల నెల వస్తున్న లక్షల రూపాయల జీతం కాదన్నట్లుగా.. తమ విధినిర్వహణకు సంబంధం లేకుండా దందాలు చేస్తూ యూబిట్ దందా తెరిచి అమాయక ప్రజలను ఆశల్లో నెట్టేస్తూ పోలీసులకు చిక్కిపోయారు. జిల్లాలో చాలామంది ఉద్యోగులు వారు ఊబిలోకి తాము దిగడమే కాకుండా వందలమందిని లాగుతూ వారి జీవితాలను చీకటిలోకి నెట్టే యత్నాన్ని పోలీసులు రెండు రోజుల క్రితం చెదారగొట్టిన విషయం తెలిసిందే.

యూబిట్ దందాలో పోలీసులు ఐదుగురినే అదుపులోకి తీసుకున్నారు. కానీ ఈ రెండురోజులుగా వందలాది పేర్లు వెలుగులోకి వస్తున్నాయి. ఇందులో కొందరి పేర్లు విని విస్తుపోవాల్సి వస్తోంది. భార్యాభర్త ఇద్దరూ ఉపాధ్యాయులు, ఉద్యోగులుగా ఉన్నా.. 'కాయిన్స్' కోసం కక్కుర్తి పడిన తీరు దారుణం. చెరో రూ.లక్ష చొప్పున నెలవారీ వేతనం వస్తున్నప్పటికి ఆది సరిపోదు అన్నట్లుగా అత్యాశకు పోయి చిక్కుల్లో పడటం గమనార్హం.

ఇద్దరూ ఉపాధ్యాయుల సస్పెన్షన్ : డీఈఓ

ఆదిలాబాద్ జిల్లాలో సంచలనం సృష్టించిన యూబిట్ కాయిన్ క్రిప్టో కరెన్సీ మల్టీ లెవెల్ మార్కెటింగ్ దందాలో పోలీసులు అరెస్టు చేసి రిమాండ్ కు తరలించిన ఇద్దరు ఉపాధ్యాయులను సస్పెండ్ చేసినట్లు డీఈవో రవీందర్రెడ్డి తెలిపారు. మొర్రిగూడెం పాఠశాల బూససాయికిరణ్, గంగాపూర్ ఉపాధ్యాయుడు కండేలా నరేశ్ లను పోలీసులు రిమాండ్ నివేదిక ఆధారంగా సస్పెండ్ చేశామని పేర్కొన్నారు. ఉపాధ్యాయులు క్రిప్టో కరెన్సీ మాయలో పడొద్దని, తమ దృష్టికి వస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

రిపోర్టింగ్: వేణుగోపాల కామోజీ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ప్రతినిధి, హిందూస్తాన్ టైమ్స్ తెలుగు.

సంబంధిత కథనం