Farmers Loan Waiver : ఉమ్మడి ఆదిలాబాద్ లో 60 శాతం రైతులకే రుణమాఫీ, కొత్త రుణాల జారీలో జాప్యం!
Farmers Loan Waiver : రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన రైతు రుణమాఫీ కొన్ని జిల్లాల్లో పలు కారణాలతో ఆసల్యం అవుతోంది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఇప్పటి వరకూ 60 శాతం రైతులకు మాత్రమే రుణమాఫీ అయిందని గణాంకాలు చెబుతున్నాయి.
Farmers Loan Waiver : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రకటించిన రైతు రుణమాఫీ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో కొనసాగుతోంది. అర్హులైన రైతులు వారి బ్యాంకులో రుణమాఫీ చేసుకునేందుకు సంబంధిత పత్రాలతో దరఖాస్తు చేసుకుంటున్నారు. కొన్నిచోట్ల ఈ కార్యక్రమం నత్తనడకన సాగుతుండగా మరి కొన్నిచోట్ల సాఫీగా సాగుతుంది. బ్యాంకు అధికారులు రుణమాఫీ చేసేందుకు కసరత్తు ప్రారంభించారు. ఆసిఫాబాద్, నిర్మల్, మంచిర్యాల, ఆదిలాబాద్ జిల్లా వ్యవసాయశాఖ అధికారులు పేర్కొన్న వివరాల ప్రకారంగా ఇప్పటివరకు కేవలం 60 శాతం మంది రైతులు మాత్రమే రుణమాఫీ చేసుకున్నట్లు తెలుస్తోంది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో రూ.1596 కోట్లు రుణమాఫీ జరిగినట్లు గణాంకాలు చెబుతున్నాయి.
రుణమాఫీ పెండింగ్
2018 డిసెంబర్ నెల వరకు తీసుకున్న లక్ష రూపాయల రుణాలను రాష్ట్ర ప్రభుత్వం రుణమాఫీగా ప్రకటించింది. మిగతా రుణమాఫీ ప్రక్రియ కొనసాగుతుందని అధికారులు చెబుతున్నారు. కొందరు రైతులు చనిపోయారని, మరికొందరు రైతులు ఈ కేవైసీ లేనందున, బ్యాంకుల్లో ఖాతాలు సరిగా లేనందున, కొందరికి పాస్ బుక్కుల్లో పేర్లు తప్పుగా వచ్చినందున పెండింగ్ ఉన్నట్లు అధికారులు తెలిపారు. అయితే రుణమాఫీ జరిగిన అనంతరం కొత్త రుణాలు ఇంకా తమకు అందడం లేదని కొందరు రైతులు వాపోతున్నారు. కొత్త రుణాలను అందించే ప్రక్రియలో బ్యాంకు అధికారులు నిమగ్నమయ్యారని, త్వరలోనే అందరికీ రుణాలు అందిస్తారని అధికారులు తెలిపారు.
కొత్త రుణాలు
ఈ విషయమే జిల్లా వ్యవసాయశాఖ అధికారులు మాట్లాడుతూ... ఇప్పటి వరకు ఆదిలాబాద్ జిల్లాలో అర్హులైన 1,32,000 మంది రైతులలో 49 వేల మంది రైతులు రూ.325 కోట్ల రుణమాఫీ పొందారని, అదేవిధంగా మంచిర్యాల జిల్లాలో 87,402 మంది రైతులు అర్హులు ఉండగా వీరిలో 41,400 మంది రైతులు రూ.224 కోట్ల రుణమాఫీ పొందారన్నారు. అసిఫాబాద్ జిల్లాలో 67,000 మంది రైతులలో 39 వేల మందికి రూ.199 కోట్లు రుణమాఫీ లభించింది. నిర్మల్ జిల్లాలో 1,10,000 మంది అర్హులు ఉండగా 52,000 మంది రైతులు 319 కోట్ల రూపాయలు రుణమాఫీ పొందారు. వీరందరికీ కొత్త రుణాలు త్వరలోనే బ్యాంకు ఖాతాలో జమవుతాయని వివిధ జిల్లాల వ్యవసాయ శాఖ అధికారులు తెలిపారు. ఈ క్రమంలో రుణమాఫీ అయిన రైతులకు వెంటనే కొత్త రుణాలు అందించాలని రైతులు వేడుకుంటున్నారు.