Sangareddy District : మద్యం మత్తులో డబ్బుల కోసం గొడవ - వ్యక్తి దారుణ హత్య
Sangareddy District Crime News: మద్యం మత్తులో డబ్బుల కోసం గొడవ పడిన ఘటనలో వ్యక్తి హత్యకు గురయ్యాడు. ఈ ఘటన సంగారెడ్డి జిల్లాలో వెలుగు చూసింది.
Sangareddy District Crime News: సంగారెడ్డి జిల్లాలో దారుణ సంఘటన చోటుచేసుకుంది. మద్యం తాగిన మత్తులో డబ్బుల కోసం గొడవ పడి విచక్షణారహితంగా ఓ వ్యక్తిని బండ రాయితో తలపై కొట్టి హత్యా చేశారు. ఈ ఘటన సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలంలోని ఐడిఏ బొల్లారం పోలీస్ స్టేషన్ పరిధిలో మంగళవారం అర్ధరాత్రి జరిగింది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం హైదరాబాద్ గచ్చిబౌలి ప్రాంతంలోని ఖాజాగూడకు చెందిన సంపంగి యాదయ్య (36) ఐడిఏ బొల్లారంలోని బీరప్ప బస్తీలో పది సంవత్సరాలుగా నివాసం ఉంటూ రాళ్ళూ కొట్టుకుంటూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. యాదయ్యకు భార్య,ఇద్దరు కొడుకులు,ఒక కూతురు ఉన్నారు. చేర్యాల గ్రామానికి చెందిన రాజు కూడా రాళ్ళూ కొట్టుకుంటుండడంతో వీరిద్దరికి పరిచయం ఏర్పడింది. కాగా మంగళవారం రాత్రి రాజు తో కలిసి యాదయ్య మద్యం తాగడానికి వెళ్ళాడు. ఈ క్రమంలో వీరిద్దరి మధ్య డబ్బుల విషయంలో గొడవ జరగగా కోపోద్రిక్తుడైన రాజు తాగిన మైకంలో బండ రాయితో బలంగా యాదయ్య తలపై కొట్టడంతో తీవ్ర రక్తస్రావమై అతడు అక్కడికక్కడే మృతి చెందాడు. మద్యం మత్తులో ఉండటంతో రాజు కూడా అక్కడే పడిపోయాడు. స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు బుధవారం అక్కడికి చేరుకున్నారు. ఘటన స్థలంలోనే నిందితుడు రాజును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. యాదయ్య మృతి చెందడంతో కుటుంబసభ్యులు బోరున విలపిస్తున్నారు. మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతుడి భార్య పిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
మద్యానికి బానిసై ఓ వ్యక్తి ఉరేసుకొని ఆత్మహత్య ...
మద్యానికి బానిసై ఓ వ్యక్తి ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్న సంఘటన సిద్దిపేట జిల్లా గజ్వేల్ పరిధిలోని ప్రజ్ఞాపూర్ లో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే ప్రజ్ఞాపూర్ కోదండరామ్ పల్లికి చెందిన గుజ్జ అశోక్ (35) గ్రామంలో కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. అశోక్ కు భార్య,ముగ్గురు పిల్లలు ఉన్నారు. అశోక్ కొంతకాలంగా మద్యానికి బానిసై పనులకు సరిగా చేయడం లేదు. దీంతో భార్యాభర్తల మధ్య తరచూ గొడవలు జరుగుతున్నాయి. కాగా బుధవారం మరల భార్యతో మద్యానికి డబ్బులు కావాలని గొడవపడ్డాడు. ఆమె నిరాకరించడంతో మనస్థాపానికి గురై ఇంట్లో ఉన్న ఒక గదిలో ఫ్యాన్ కు ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అనుమానం వచ్చిన కుటుంబసభ్యులు తలుపులు తీసి చూడగా ఉరేసుకుని ఉన్నాడు. వెంటనే వారు కిందికి దింపి సమీపంలో ఉన్న ఆసుపత్రికి తరలించారు. అక్కడ పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు ధ్రువీకరించారు. మృతుని కుటుంబసభ్యులు ఇచ్చిన పిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.
రిపోర్టింగ్ - మెదక్ జిల్లా ప్రతినిధి
సంబంధిత కథనం