PET Suspension: రోడ్డెక్కిన గురుకుల విద్యార్థినులు.. పీఈటీని సస్పెండ్ చేసిన కలెక్టర్-a female pet working in the tangallapally tribal gurukula school has been suspended ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Pet Suspension: రోడ్డెక్కిన గురుకుల విద్యార్థినులు.. పీఈటీని సస్పెండ్ చేసిన కలెక్టర్

PET Suspension: రోడ్డెక్కిన గురుకుల విద్యార్థినులు.. పీఈటీని సస్పెండ్ చేసిన కలెక్టర్

Basani Shiva Kumar HT Telugu
Sep 13, 2024 10:31 AM IST

PET Suspension: విద్యార్థినులను వేధిస్తున్నారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న పీఈటీని కలెక్టర్ సస్పెండ్ చేశారు. తంగళ్లపల్లి మండలంలోని గిరిజన గురుకుల విద్యార్థినులు పీఈటీపై ఆరోపణలు చేస్తూ.. రోడ్డెక్కారు. దీంతో జిల్లా పాలనాధికారి ఈ నిర్ణయం తీసుకున్నారు. విద్యార్థుల సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.

విద్యార్థులతో మాట్లాడుతున్న స్థానిక పోలీసులు
విద్యార్థులతో మాట్లాడుతున్న స్థానిక పోలీసులు

రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం ఇందిరమ్మ కాలనీలోని గిరిజన గురుకుల పాఠశాల, కళాశాల ఉంది. దాంట్లో పని చేస్తున్న మహిళా పీఈటీ తమను దూషిస్తున్నారని విద్యార్థినులు ఆందోళనకు దిగారు. తమపై పీఈటీ చేయిచేసుకుంటున్నారని.. అంతే కాకుండా వీడియోలు తీస్తామని బెదిరిస్తున్నారని విద్యార్థినులు ఆరోపించారు. ఈ విషయాన్ని ప్రిన్సిపల్కు చెప్పినా పట్టించుకోలేదని వాపోయారు.

తమ సమస్య పరిష్కారం కాకపోవడంతో.. గురువారం సిరిసిల్ల- సిద్దిపేట రహదారిపై విద్యార్థినులు బైఠాయించారు. పీఈటీని వెంటనే సస్పెండ్‌ చేయాలని డిమాండ్‌ చేశారు. డోర్ పగలగొట్టి లోనికి వచ్చి మొబైల్ ఫోన్‌తో వీడియో రికార్డు చేస్తూ.. కొడుతోందని విద్యార్థినులు ఆవేదన వ్యక్తం చేశారు. పీఈటీని సస్పెండ్ చేసే వరకు తాము రోడ్డుపైనే ఉంటామని స్పష్టం చేశారు.

అటు గురుకులంలో వసతులు కూడా సరిగా లేవని విద్యార్థినులు ఆవేదన వ్యక్తం చేశారు. గురుకులంలో ఐదో తరగతి నుంచి ఇంటర్‌ వరకు మొత్తం 580 మంది విద్యార్థినులు ఉన్నారు. వీరికి కనీసం 58 స్నానాల గదులు ఉండాలి. కానీ 20 మాత్రమే ఉన్నాయని విద్యార్థులు చెబుతున్నారు. వేకువజామున 4 గంటల నుంచే స్నానాల కోసం వరుస కట్టాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు.

ఆరోగ్యం బాలేకపోయినా.. తరగతికి వెళ్లడం ఆలస్యమైనా పీఈటీ బూతులు తిడుతున్నారని, కొడుతున్నారని విద్యార్థులు కన్నీరు పెట్టుకున్నారు. విద్యార్థుల ఆందోళన విషయం తెలుసుకున్న స్థానిక ఎస్సై సుధాకర్, ఎంఈవో రఘుపతి అక్కడికి చేరుకున్నారు. న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. దీంతో విద్యార్థినులు రోడ్డు దిగారు. పాఠశాల వద్దకు చేరుకొని అక్కడ ఆందోళన చేశారు.

విద్యార్థుల ఆందోళన నేపథ్యంలో.. డీఈవో రమేశ్‌కుమార్‌ను కలెక్టర్‌ సందీప్‌కుమార్‌ ఝా గురుకులానికి పంపించారు. కలెక్టర్‌ ఆదేశాల మేరకు పీఈటీని సస్పెండ్‌ చేశారు. సాయంత్రం కలెక్టర్‌ గురుకులానికి చేరుకొని విద్యార్థినులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా తగిన చర్యలు తీసుకోవాలని ప్రిన్సిపల్‌ను ఆదేశించారు. కలెక్టర్ ముందు కూడా కొందరు విద్యార్థులు కంటతడి పెట్టినట్టు తెలిసింది.