Chits Director Suicide: సూసైడ్ లెటర్ రాసి చిట్ ఫండ్ డైరెక్టర్ ఆత్మహత్య.. హరిత హోటల్ 306 గదిలో ఏం జరిగింది..?
Chits Director Suicide: ఉమ్మడి వరంగల్ కు చెందిన ఓ ప్రముఖ చిట్ ఫండ్ కంపెనీ డైరెక్టర్ ఆత్మహత్య విషయం కలకలం రేపింది. హనుమకొండ నక్కలగుట్టలో ఉన్న హరిత హోటల్ లో సీలింగ్ ఫ్యాన్ కు ఉరేసుకుని చనిపోగా.. కుటుంబ సభ్యులు వచ్చి ఆరా తీయగా అసలు విషయం బయటపడింది.
Chits Director Suicide: వరంగల్ జిల్లాకు చెందిన ప్రముఖ చిట్‌ఫండ్ కంపెనీ యజమాని ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఆదివారం సాయంత్రం ఈ ఘటన చోటుచేసుకోగా.. ఆయన రాసిన సూసైడ్ లెటర్ సోమవారం ఉదయం వెలుగులోకి రావడం కలకలం రేపుతోంది.
బాధితులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. హనుమకొండలోని సుబేదారి ఎక్సైజ్ కాలనీకి చెందిన నల్లా భాస్కర్ రెడ్డి(35) కనుకదుర్గ చిట్ ఫండ్స్ ప్రైవేటు లిమిటెడ్ సంస్థలో అసిస్టెంట్ జనరల్ మేనేజర్ కం డైరెక్టర్ గా పని చేస్తున్నాడు.
నిత్యం బయట తిరిగే బిజినెస్ కావడంతో తరచూ ఇంట్లో వాళ్లకు చెప్పి బయటకు వెళ్లేవాడు. ఈ క్రమంలోనే శనివారం రాత్రి 8 గంటల ప్రాంతంలో తన కుటుంబ సభ్యులకు చెప్పి రోజువారీలాగే బయటకు వెళ్లాడు. ఆలస్యమవుతున్నా భాస్కర్ రెడ్డి ఇంటికి చేరకపోవడంతో కుటుంబ సభ్యులు ఆయనకు ఫోన్ చేయగా.. వ్యక్తిగత పని మీద బయటకు వచ్చానని, ఇంటికి రావడానికి ఆలస్యం అవుతుందని సమాచారం ఇచ్చాడు.
ఆ తరువాత ఎంతసేపైనా భాస్కర్ రెడ్డి ఇంటికి రాకపోవడంతో మరోసారి కుటుంబ సభ్యులు ఆయనకు ఫోన్ చేశారు. దీంతో ఆయన ఫోన్ లిప్ట్ చేయలేదు. కంగారు పడిన భాస్కర్ రెడ్డి భార్య శామిలి ఆయన స్నేహితులైన శ్రీకాంత్, సంజయ్, ఇంద్రసేనా రెడ్డికి సమాచారం అందించింది. దీంతో వారంతా చుట్టుపక్కల ప్రాంతాలు, తెలిసిన వారి ఇండ్లను ఆరా తీశారు. అయినా ఫలితం లేకుండాపోయింది.
హరిత హోటల్లో సూసైడ్
భాస్కర్ రెడ్డి కోసం వెదుకుతున్న ఆయన స్నేహితులు శ్రీకాంత్, సంజయ్, ఇంద్రసేనారెడ్డి ఆదివారం మధ్యాహ్నం ప్రాంతంలో హనుమకొండ నక్కలగుట్టలోని హరిత హోటల్ లో ఆయన కారు ఉన్నట్టు గుర్తించారు.
లోపలికి వెళ్లి రిసెప్షన్ స్టాఫ్ ను ఆరా తీయగా రూమ్ నెంబర్ 306 లో భాస్కర్ రెడ్డి ఉన్నట్టు సమాచారం ఇచ్చారు. దీంతో వారు రూమ్ వద్దకు వెళ్లి పరిశీలించగా.. లోపలి వైపు నుంచి గడియ పెట్టి ఉంది. అనంతరం హోటల్ సిబ్బంది సహాయంతో గదిని ఓపెన్ చేయగా.. భాస్కర్ రెడ్డి సీలింగ్ ఫ్యాన్ కు చున్నీతో ఉరి వేసుకుని వేలాడుతూ కనిపించాడు.
దీంతో భాస్కర్ రెడ్డి స్నేహితులు, కుటుంబ సభ్యులు బోరున విలపించారు. అనంతరం సుబేదారి పోలీసులకు సమాచారం అందించగా.. మృతదేహాన్ని సిబ్బంది సహాయంతో కిందికి దించారు.
ఆర్థిక లావాదేవీలే కారణమా..?
కనకదుర్గ చిట్ ఫండ్ సంస్థ అసిస్టెంట్ జనరల్ మేనేజర్ గా కొనసాగుతున్న భాస్కర్ రెడ్డి తమ సంస్థలో చాలామందితో ఫిక్స్ డ్ డిపాజిట్లు చేయించారు. వాటి మెచురిటీ గడువు పూర్తయినా డబ్బులు చెల్లించకపోవడంతో డిపాజిటర్లు డబ్బుల కోసం భాస్కర్ రెడ్డిపై ఒత్తిడి తెచ్చారు.
ఈ క్రమంలోనే భాస్కర్ రెడ్డి కనుకదుర్గ చిట్ ఫండ్స్ యాజమాన్యం దృష్టికి కూడా తీసుకెళ్లాడు. అయినా సంబంధిత యాజమాన్యం పట్టించుకోకపోవడంతో భాస్కర్ రెడ్డి మానసిక ఒత్తిడి గురైనట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే ఆయన హరిత హోటల్ లో ఉరి వేసుకుని చనిపోయి ఉంటాడని భాస్కర్ రెడ్డి భార్య శామిలి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో.. కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్టు పోలీసులు తెలిపారు.
సూసైట్ లెటర్ లో ఏముంది..?
భాస్కర్ రెడ్డి ఆత్మహత్య విషయం ఆదివారం సాయంత్రం బయటకు రాగా.. ఆయన రూంలో సూసైడ్ లెటర్ కనిపించడం కలకలం రేపింది. సోమవారం ఉదయం వాట్సాప్ గ్రూపుల్లో సూసైడ్ లెటర్ చక్కర్లు కొట్టింది. కనుకదుర్గ చిట్ ఫండ్స్ కంపెనీలో కొన్ని కోట్లు డిపాజిట్లు, చిట్స్ వేయించానని, డబ్బులు చెల్లించలేక తమ సంస్థ వెంచర్లలో ల్యాండ్ ఇచ్చినట్లు భాస్కర్ రెడ్డి సూసైడ్ లెటర్ లో పేర్కొన్నాడు.
ఆ ల్యాండ్ తమకు అవసరం లేదని, తమకు డబ్బులే కావాలని డిమాండ్ చేస్తున్న విషయాన్ని యాజమాన్యం దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోకపోవడం, చిట్ ఫండ్ సంస్థ చైర్మన్ డబ్బులు ఇవ్వక ఇబ్బందులు పెట్టడం వల్లే తాను ఆత్మహత్య చేసుకుంటున్నట్లు సూసైడ్ లెటర్ లో పేర్కొన్నాడు.
ఈ మేరకు ఓ ఐదుగురు డిపాజిటర్లకు ఇవ్వాల్సిన డబ్బుల వివరాలను సూసైడ్ లెటర్ వెనుక రాసి ఉరేసుకుని భాస్కర్ రెడ్డి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కాగా ఈ విషయంపై కనుకదుర్గ చిట్ ఫండ్స్ చైర్మన్ తిరుపతిరెడ్డి స్పందిస్తూ భాస్కర్ రెడ్డి ఏరోజూ సంస్థ డైరెక్టర్ గా లేరని, ఉద్యోగిగా కొంతకాలం పని చేసి మానేశాడని పేర్కొన్నారు.
కరోనా కాలంలో బ్రాంచ్ లను మూసివేసిన సమయంలోనే ఆయన తమ వద్ద ఉద్యోగం మానేసాడన్నారు. తమపై తప్పుడు సమాచారం ప్రచారం చేయవద్దని హోటల్ లో ఆత్మహత్యకు పాల్పడిన భాస్కర్ రెడ్డికి, తమ కంపెనీకి ఎలాంటి సంబంధం లేదని చెబుతున్నారు.
(హిందుస్థాన్ టైమ్స్ తెలుగు, వరంగల్ ప్రతినిధి)