Dharani Portal : ఇక ఆ సమస్యలకు చెక్... ధరణిలో కొత్తగా 8 ఆప్షన్లు
Telangana Dharani Portal : ధరణి పోర్టల్ లో మరికొన్ని మార్పులు చేసింది తెలంగాణ సర్కార్. తాజాగా మరో 8 ఆప్షన్లను అందుబాటులోకి తీసుకొచ్చింది.
Dharani Portal Updates: ధరణిలో ఉన్న పలు సమస్యలకు పరిష్కారం చూపుతూ కీలక నిర్ణయం తీసుకుంది తెలంగాణ సర్కార్. ప్రజల నుంచి వస్తున్న ఫిర్యాదుల మేరకు… తాజాగా కొత్తగా 8 ఆప్షన్లను అందుబాటులోకి తీసుకువచ్చింది. ఈ మేరకు గురువారం ఆదేశాలు జారీ చేసింది. కొత్త ఆప్షన్లతో జిల్లాల్లో నెలకొన్న భూసమస్యలను పరిష్కరించాలని కలెక్టర్లను ఆదేశించించింది.
ఇవి కొత్త మాడ్యుల్స్ ఇవే:
-పట్టా భూములు అసైన్డ్ గా నమోదైతే భూమి రకం, భూమి వర్గీకరణ, భూమి సాగుకు సంబంధించి టీఎం-33 మాడ్యూల్ కింద పరిష్కరించుకోవడానికి అవకాశం కల్పించారు.
- భూమి రిజిస్ట్రేషన్ సమయంలో దాని విస్తీర్ణం, మార్కెట్ విలువను తెలుసుకొని రిపోర్టును కూడా పోర్టల్ లో అందుబాటులో ఉంటుంది. అంతేకాకుండా క్రయ, విక్రయాల సమయంలో భూమి మార్కెట్ విలువను తెలుసుకోవచ్చు.
- గిఫ్ట్, సేల్ డీడ్స్ రిజిస్ట్రేషన్లలో ఒక్కరికే కాకుండా ఎక్కువ మంది కొనుగోలు చేసేలా, విక్రయించే ఛాన్స్ ఉంది.
- పేరు, వ్యక్తిగత వివరాల మార్పు చేర్పులకు టీఎం-33 మాడ్యూల్‌తో సంబంధం లేకుండా అవకాశం ఇచ్చారు.
- ఏజెన్సీ ప్రాంతాలు మినహా ఇతర ప్రాంతాల్లోని వారు బ్యాంకుల్లో మార్టిగేజ్‌లకు కుల ధ్రువీకరణ పత్రం జతచేయాలనే నిబంధన ఉండేది. ఇప్పుడు అవసరం లేకండా మినహాయింపు కల్పించారు.
-సీసీఎల్‌ఏ, కలెక్టర్ లాగిన్లలో గ్రామ పహాణి రిపోర్టులు అందుబాటులోకి తీసుకొచ్చారు.
- దరఖాస్తు చేసుకున్నా తర్వాత పాసుపుస్తకాల్లో సమాచారం సరిచేసుకునే వెసులుబాటు కూడా కల్పించారు. ఆ సమయంలోనూ ఆ దరఖాస్తుల(రివర్టెడ్) జాబితాను ఇకపై జిల్లా కలెక్టర్లు పరిశీలించవచ్చు.
నిజానికి ధరణిలో రిజిస్ట్రేషన్ల ప్రక్రియ సవ్వంగా సాగుతున్నప్పటికీ… అనేక ఇబ్బందులు ఉన్నాయి. ఇప్పటికే 40 రకాల సమస్యల పరిష్కారంలో తప్పుల సవరణకు పలు మ్యాడ్యూల్స్ అందుబాటులోకి వచ్చాయి. ఫలితంగా పలు సమస్యలకు పరిష్కారం దొరికినట్లు అయింది. వారసత్వ భూములను కుటుంబ సభ్యుల అనుమతి లేకుండా అమ్ముకునే వీలు గతంలో లేదు. ధరణి వచ్చాక ఎవరిపేరు మీద ఉంటే వారు అమ్ముకునే స్వేచ్చ అమలులోకి వచ్చింది. రికార్డుల్లోకి ఎక్కని రైతులకు మార్గం లేకుండా పోయింది. అసైన్డ్ చట్టం ప్రకారం అసైనీలు చనిపోతే ఆ భూములను వారసుల పేర్లమీద మార్చాలి. కానీ అది జరగడంలేదు. ఇవే కాకుండా వ్యవసాయభూములను గజాల్లో కొన్న వాటి విషయంలో కూడా సర్కార్ నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. గజాల్లో ఉండటం ద్వారా మ్యూటేషన్ ప్రక్రియ జగటం లేదు. కేవలం గుంటలల్లో ఉంటే మాత్రమే మ్యూటేషన్ ప్రక్రియ పూర్తి అవుతుంది. అయితే దీనిపై కూడా సర్కార్ దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. కేబినెట్ సబ్ కమిటీ ఇచ్చిన సిఫార్సుల ఆధారంగా ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుంటుంది.